Share News

న్యాయవ్యవస్థ పతనానికి కారణం ఎవరు?

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:12 AM

మృగాలు వేటాడి తమ ఆకలిని తీర్చుకున్న తర్వాత శాంతిస్తాయి కాని అవినీతి అనే ఆకలి ఉన్న మనిషి అంత త్వరగా శాంతించడు. ఆఫీసుల్లో, రహదారుల కూడళ్లలో, ప్రార్థనా మందిరాల్లో అంతటా మనిషి మనిషిని వేటాడడం మనకు....

న్యాయవ్యవస్థ పతనానికి కారణం ఎవరు?

మృగాలు వేటాడి తమ ఆకలిని తీర్చుకున్న తర్వాత శాంతిస్తాయి కాని అవినీతి అనే ఆకలి ఉన్న మనిషి అంత త్వరగా శాంతించడు. ఆఫీసుల్లో, రహదారుల కూడళ్లలో, ప్రార్థనా మందిరాల్లో అంతటా మనిషి మనిషిని వేటాడడం మనకు కనిపిస్తోంది. ఎన్నికల రాజకీయాల్లో కోట్ల రూపాయలు ప్రవహిస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలకు నిధుల సమీకరణ ఎవరి ద్వారా చేయాలో బాగా తెలుసు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి నిధుల సమీకరణకు అనేక మార్గాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని వ్యవస్థలూ వారికి అనుకూలంగా పనిచేస్తాయి. హవాలా మార్గాలు దేశమంతటా విస్తృతంగా పనిచేస్తూనే ఉంటాయి. పార్లమెంట్‌లో కీలకమైన ఓటింగ్ జరిగినప్పుడు ప్రజాప్రతినిధులను ప్రలోభపరిచిన ఉదంతాలు, నిండు సభలో నోట్ల కట్టలు రెపరెపలాడిన సంఘటనలు ఎన్నో. ఈ దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు కూడా డబ్బు ప్రవాహం ఆగనే లేదు. అప్పుడప్పుడూ ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేసి కోట్ల రూపాయల నోట్ల కట్టలను ఏ మంత్రి పీఏ ఇంటిలోనో, ఏ అధికారి నివాసంలోనో పట్టుకున్నట్లు వార్తలు వస్తాయి. కాని ఇది కంటితుడుపు మాత్రమే.


భారతదేశంలో అవినీతి సర్వాంతర్యామి. 62 శాతం మంది భారతీయులు తమ పనులకోసం ఎప్పుడో ఒకప్పుడు లంచాలు చెల్లించినవారేనని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. గత ఏడాది ఈ సంస్థ ప్రకటించిన నివేదిక ప్రకారం 180 దేశాల్లో భారతదేశం అవినీతి 96వ ర్యాంకును సాధించింది. స్కూలు అడ్మిషన్ల నుంచి సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలు వరకూ ఏ రంగమూ అవినీతికి మినహాయింపు కాదని, లైసెన్స్‌రాజ్ రద్దయినా ఈ దేశంలో ప్రైవేట్ రంగం అత్యధికంగా ప్రభుత్వ రంగంలో పెద్దల చుట్టూ తిరగాల్సి వస్తోందని అందరికీ తెలుసు. ‘భారత దేశంలో ఏ బడా ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ ప్రాపకం లేకుండా ఎదిగిందో చెప్పండి’. అని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఒక సందర్భంలో ప్రశ్నించారు. భారత దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఎంత బలంగా వేళ్లూనికొని ఉన్నదో రాజకీయ నాయకుల కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? ఈ నేపథ్యంలో గతవారం ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్లకట్టలు దొరికాయని వార్తలు రావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. న్యాయమూర్తులు సంపాదనకు అతీతులని ఈ దేశంలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? న్యాయమూర్తులను ప్రలోభపెట్టి తీర్పులను అనుకూలంగా తెప్పించుకునేందుకు, లేదా కేసులను వాయిదా వేయించుకునేందుకు నిరంతర ప్రయత్నాలు చేసేవాళ్లు నిరంతరం ఎక్కడో ఒకచోట తటస్థిస్తూనే ఉంటారు. ‘న్యాయమూర్తులేమీ దేవతలు కాదు, వారు కూడా ఇదే సమాజంలో భాగం’ అని ప్రముఖ న్యాయవాది రాంజెత్మలానీ ఒక సందర్భంలో చెప్పారు. న్యాయవ్యవస్థ లోపాల గురించి అనేక రచనలు వచ్చాయి. రావి శాస్త్రి న్యాయవ్యవస్థలో కుళ్లును బట్టబయలు చేశారు. ‘కోర్టు అంటే ఏమిటో తెలుసా.. అదొక పెద్ద అడవి. అడవిలోకి వచ్చినవాడిదే పొరపాటు కాని మనది కాదు. అక్కడ హైనాల వంటి పెద్ద పెద్ద జంతువులుంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మననే తినేస్తాయి..’ అని రావి శాస్త్రి రచించిన ‘మాయ’ అనే కథలో న్యాయస్థానాల గురించి అభివర్ణిస్తారు. ‘ప్లీడరు బాబూ సెప్తున్నా విను. ఏ మనిషీ మంచోడని ఎవరు చెప్పినా నేను నమ్మను.


ఈ లోకంలో డబ్బూ యాపారం తప్ప మరేటీ లేదు’ అని ముత్యాలమ్మ అనే సారా అమ్ముకునే స్త్రీ ద్వారా ఆయన చెప్పిస్తారు. న్యాయమూర్తుల్లో ఎంత శాతం మంది అవినీతిపరులో అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉన్నది. సుప్రీంకోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతిపరులేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మార్కండేయ కట్జూ కూడా ఒకప్పుడు వ్యాఖ్యానించారు. మార్కండేయ కట్జూ కూడా యశ్వంత్ వర్మ మాదిరే అలహాబాద్‌కు చెందినవారే. అలహాబాద్ హై కోర్టులో తీవ్ర అవినీతికి పాల్పడుతున్న న్యాయమూర్తుల జాబితాను తాను అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లహోటీకి ఇచ్చానని, కాని ఆయన ఏ చర్యా తీసుకోలేదని ఖట్జూ వెల్లడించారు. తాను వారి అవినీతి గురించి సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని ఖట్జూ అన్నప్పుడు అలా చేయవద్దని జస్టిస్ లహోటీ ఆయనను బతిమిలాడారు. ‘దయచేసి అలా చేయకండి. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి మనమే ప్రచారం చేస్తే రాజకీయ నాయకులు దాన్ని తమకు అనువుగా వాడుకుంటారు. జాతీయ జ్యుడిషియల్ కమిషన్‌ను నియమిస్తారు.’ అని జస్టిస్ లహోటీ ఆయనను అభ్యర్థించారు. అవినీతిపరులైన ఆ న్యాయమూర్తుల్లో కొందరిని బదిలీ చేసి ఊరుకున్నారు. ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో అదే జరిగింది. అసలు న్యాయవ్యవస్థలో ఉన్న బలహీనతలను అధికారంలో ఉన్నవారు వాడుకొననిది ఎప్పుడు? అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం న్యాయవ్యవస్థ తనకు అనుకూలంగా ఉండాలనే భావిస్తుంది.


దీన్ని ప్రతిఘటించి తన స్వతంత్రతను కాపాడుకునే ప్రయత్నాలు చేసిన, ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసిన న్యాయమూర్తులు లేకపోలేదు. న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కానియా నెహ్రూకు లేఖ రాసి స్పష్టం చేశారు. 1994లో జస్టిస్ వెంకటాచలయ్య పదవీవిరమణ తర్వాత ప్రభుత్వాలను బలంగా ప్రశ్నించే ప్రధాన న్యాయమూర్తులు అడపాదడపా మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. క్రమంగా న్యాయవ్యవస్థ బలహీనపడుతున్నదనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడుతోంది. ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి నివాసంలో డబ్బులు దొరకడం గురించి అనేక కథనాలు వచ్చినప్పటికీ ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అదంతా ఆయన ఊళ్లో లేనప్పుడు జరిగిన కుట్ర అని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నదని వాదించేవారు కూడా ఉన్నారు. అత్యంత శక్తివంతమైన ఢిల్లీ హై కోర్టు, కొలీజియంపై అలహాబాద్‌కు చెందిన న్యాయమూర్తుల పట్టు ఉన్నదని, దాన్ని సడలించేందుకే ఈ ఉదంతం జరిగిందని ఒక సీనియర్ న్యాయవాది చెప్పారు. ఏది ఏమైనా ఈ ఉదంతంతో ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై పట్టు బిగించే అవకాశం లభించిందని మాజీ న్యాయమూర్తి ఒకరు అన్నారు. గతంలో జస్టిస్ లహోటీ భయపడినట్లే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ నియామకానికి మరోసారి ప్రభుత్వం ప్రయత్నించేందుకు రంగం సిద్ధమవుతున్నదేమో? న్యాయ వ్యవస్థ తీవ్రంగా అప్రతిష్ఠపాలయినప్పుడు దాన్ని సరిదిద్ది న్యాయమూర్తుల నియామకాన్ని ఒక స్వతంత్ర సంస్థకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు హర్షించవచ్చు. కాని న్యాయవ్యవస్థ బలహీనపడటానికి బాధ్యులు ఎవరు? ఒక ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు ఒక హై కోర్టు అదనపు న్యాయమూర్తి మరో ఇద్దరు న్యాయమూర్తులను ఒత్తిడి చేశారన్న ఫిర్యాదుపై ఇటీవల లోక్‌పాల్ విచారణకు సిద్ధపడితే సుప్రీంకోర్టు స్టే విధించింది. ‘ఇది చాలా ఆందోళనకరం’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, అధికారులతో సమానంగా హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉన్నదా లేదా అని తామే తేల్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించుకుంది. నిజానికి లోక్‌పాల్ కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ ఆధ్వర్యంలో ఉన్నదే.


మరి లోక్‌పాల్‌కు హై కోర్టు న్యాయమూర్తులపై విచారించే అధికారం ఎందుకు లేదు? అంతర్గత విచారణ పేరుతో తమ న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలను తమే రహస్యంగా విచారించి ఏ చర్యా తీసుకోకుండా వదిలేయడం, మహా అయితే బదిలీ చేయడం సుప్రీంకోర్టు కొలీజియం ఇంతకాలం చేస్తూవస్తోంది. ‘స్థానం మారినంత మాత్రాన అవినీతి లక్షణాలు మారుతాయా?’ అని ప్రముఖ న్యాయకోవిదుడు ఉపేంద్ర బక్షి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. న్యాయమూర్తుల అవినీతి, అక్రమాల గురించి బయట విస్తృతంగా చర్చకు వస్తే న్యాయవ్యవస్థ అప్రతిష్టపాలవుతోందని, ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల గౌరవం పోతుందని వారు భయపడుతున్నారు. కాని న్యాయవ్యవస్థలో అవినీతిని కప్పిపుచ్చినంత మాత్రాన ప్రజలకు గౌరవం కలుగుతుందా? ఇది పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే తనను ఎవరూ గమనించరని భావించినట్లే ఉన్నది. సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న న్యాయమూర్తులు ఒకరి అస్మదీయులను మరొకరు నియమించుకుని పదవులు పంచుకున్న ఉదంతాలు ఎన్నో చర్చకు వచ్చాయి. తద్వారా బంధువులు, మిత్రులు, స్వవర్గీయులు అందలమెక్కిన సందర్భాలు కూడా ప్రజల దృష్టి నుంచి దాటిపోలేదు. సుప్రీంకోర్టు కొలీజియం ఆశ్రిత పక్షపాతంతో, తమకు నచ్చినవారిని నియమిస్తోందని, షెడ్యూల్డు కులాలు, జాతులు, ఇతర అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ ప్రగతిశీల న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ ఎప్పుడో చెప్పారు. దళితులకు న్యాయవ్యవస్థలో అవకాశం దక్కడం లేదని ఒకప్పుడు రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత 39 సంవత్సరాల పాటు ఒక్క మహిళను కూడా న్యాయమూర్తిగా నియమించలేదు.


ఒక రకంగా న్యాయవ్యవస్థ తన ఉనికిని, ప్రతిష్ఠను, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేకపోవడానికి కొందరు న్యాయమూర్తులే కారణం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే పదవీవిరమణ తర్వాత న్యాయమూర్తులు మరే పదవినీ నిర్వహించకూడదని 1958లో లా కమిషన్ సూచించింది. కాని పదవీవిరమణ అనంతరం పోస్టులకోసం వెంపర్లాడే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తాము తప్పులకు పాల్పడి ప్రభుత్వ పెద్దలు తమను శాసించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడే బాధ్యత చట్టసభలు, ప్రభుత్వంపై ఉన్నది. అన్ని వ్యవస్థలతో పాటు న్యాయవ్యవస్థ కూడా తమ అడుగులకు మడుగులొత్తాలని పాలకులు భావిస్తే మాత్రం మనం చేయగలిగింది ఏమీ లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 02:12 AM