దక్షిణాదిన బీజేపీ విస్తరణ ఎలా సాధ్యం?
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:41 AM
హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో ఒక స్తబ్దత ఏర్పడింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చాలా యాంత్రికంగా జరుగుతున్నాయి. మీడియా గ్యాలరీలు దాదాపు ఖాళీగా ఉండగా, ఉభయ సభల్లో కూడా సీట్లు చాలా...

హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో ఒక స్తబ్దత ఏర్పడింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చాలా యాంత్రికంగా జరుగుతున్నాయి. మీడియా గ్యాలరీలు దాదాపు ఖాళీగా ఉండగా, ఉభయ సభల్లో కూడా సీట్లు చాలా సందర్భాల్లో ఖాళీగా కనపడుతున్నాయి. సభ్యులు మొక్కుబడిగా చర్చల్లో పాల్గొంటున్నారు. రకరకాల అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడం, అడపాదడపా సభలు వాయిదాపడడం కూడా పెద్దగా వార్తల్లోకి ఎక్కడం లేదు. ప్రతిపక్షాలు బలహీనమైతే పార్లమెంట్ ఎలా నడుస్తుందో చెప్పేందుకు ప్రస్తుత సమావేశాలే నిదర్శనం. ‘పార్లమెంట్‌లో రాజకీయాలే జరగడం లేదు. మమ్మల్ని కూడా రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించకుండా రాష్ట్ర సమస్యల గురించి పట్టించుకోవాలని మా నాయకుడు చంద్రబాబునాయుడు కోరారు’ అని తెలుగుదేశం నేత ఒకరు చెప్పారు. మోదీకి కూడా పార్లమెంట్ సమావేశాలపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనపడడం లేదు. తన భావి అజెండాను ఎలా వేగంగా పూర్తి చేయాలా అన్న ఆలోచనతోనే ఆయన ఉన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే మధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ కేంద్రకార్యాలయానికి వెళ్లడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. మోదీ సంఘ్ కార్యాలయానికి వెళ్లడం, సంఘ్ వ్యవస్థాపకులు హెగ్డేవార్, గోల్వాల్కర్‌లకు నివాళులు అర్పించడం ఒక కీలక సంకేతంగా భావించవచ్చు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగపూర్‌లోని సంఘ్ కార్యాలయానికి, దేశ రాజధానిలోని ప్రధానమంత్రి కార్యాలయానికి మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా సయోధ్య ఏర్పడిందనడంలో సందేహం లేదు. గతంలో వాజపేయి హయాంలో కూడా నాగపూర్‌కు, ఢిల్లీకి మధ్య సయోధ్య ఏర్పర్చేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి అంతగా సఫలీకృతం కాలేదు. ఈ విషయం నాడు ఉప ప్రధానిగా ఉన్న లాల్ కృష్ణ ఆడ్వాణీ స్వయంగా అంగీకరించారు. ‘సంఘ్ సోదర కూటమిలో తమ స్వంత సైద్ధాంతిక మిత్రపక్షాల ఆందోళనను, అభిప్రాయాలను సరైన విధంగా పట్టించుకోలేకపోయామని, వారు ప్రధానంగా మాకు మద్దతునిస్తున్నందువల్ల ఎలాగూ మాతోనే కలిసి ఉంటారులే అన్న ఆత్మవిశ్వాసంతో ఉండిపోయామని, అదే తమ ఓటమికి ఒక కారణమైందని’ ఆడ్వాణీ తన ఆత్మకథలో రాసుకున్నారు. సంఘ్‌తో నిత్యసంబంధాలు ఏర్పర్చుకోవడం, సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య ఐక్యత సాధించేందుకు ప్రయత్నించడం వల్లే మోదీ విజయవంతం కాగలుగుతున్నారని చెప్పక తప్పదు. సిద్ధాంతానికీ ఆచరణకు మధ్య ఐక్యత సాధించడంలో విఫలమైనందువల్లే ఈ దేశంలో వామపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి.
నిజానికి మోదీ సంధి దశలో ఉన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ఆయనకు 75 ఏళ్లు పూర్తవుతాయి. అయితే సంఘ్ లోను, కొందరు బీజేపీ పెద్దల విషయంలోనూ అనుసరించిన నిబంధన మోదీకి వర్తించదని ఇప్పటికే స్పష్టమైంది. అందుకు కారణం మోదీ ప్రధానిగా మరి కొన్నేళ్లు కొనసాగాల్సిన అవశ్యకతను సంఘ్, సంఘ్ ప్రాధాన్యతను మోదీ ఇప్పటికే గుర్తించినట్లు కనిపిస్తోంది. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 83,129 శాఖలను నిర్వహిస్తున్నామని, వారానికి లక్షా 15వేలకు పైగా మిలన్‌లు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించడంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించామని ఇటీవల జరిగిన సంఘ్ సర్వప్రతినిధి సభ తర్వాత సహ్ కార్యవాహ్ ముకుంద్ మీడియాకు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ప్రతి ఏడాదీ లక్షలమంది యువకులు సంఘ్‌లో చేరుతున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన 4,415 ప్రారంభ శిక్షణా శిబిరాల్లో 2,22,962 మంది హాజర్యయారని, వీరిలో 1,63,000ల మంది 14–25 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారేనని ఆయన చెప్పారు. ఇంతటి కీలక ప్రభావం ఉన్న సంఘ్ బీజేపీకి అండగా ఉండడమే ఆ పార్టీకి బలం అని మోదీకి తెలుసు. గత సార్వత్రక ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే లభించిన తర్వాత మహారాష్ట్ర, హరియాణాలో సంఘ్ బలంగా పనిచేసి మళ్లీ మోదీ నిలదొక్కుకునేందుకు కావల్సిన బలాన్ని అందించిందని బీజేపీ నేతలే చెబుతున్నారు.
అందువల్ల మోదీ అసంపూర్తిగా ఉన్న తన అజెండాను అమలు చేసేందుకు ఆయనకు సంఘ్ బలం తప్పనిసరి. ఈ క్రమంలో ఆయన సంఘ్ అజెండాను కూడా పూర్తి చేయవలిసి ఉంటుంది. అనుకున్న విధంగా వక్ఫ్ బిల్లు ఆమోదానికి ఆయన రంగం సిద్ధం చేశారు. జమిలి ఎన్నికలకు కూడా ఆయన రాజకీయ పార్టీలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. రానున్న ఏడాది కాలంలో బిహార్, అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మెజారిటీ రాష్ట్రాల్లో గెలవడం బీజేపీకి ఒక అగ్నిపరీక్ష లాంటిది. ముఖ్యంగా దక్షిణాదిన బీజేపీ విస్తరించడం అంత సులభం కాదు.
అయితే కేవలం సంఘ్ అండదండలు ఉన్నంత మాత్రాన బీజేపీ విజయాలు సాధించగలుగుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి సంఘ్ బలంగా ఉండడం వేరు, బీజేపీ బలంగా ఉండడం వేరు అన్న విషయం రెండు సంస్థలకూ తెలియనిది కాదు సంఘ్ అత్యంత బలంగా ఉన్న కర్ణాటకను ఒకప్పుడు బీజేపీ దక్షిణాది ద్వారంగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. కాని క్రమంగా ఆ ద్వారం మూసుకుపోతున్నట్లు కనపడుతోంది. దేశమంతటా హిందూత్వ ప్రయోగం విజయవంతం అవుతున్నట్లు కనపడుతున్నప్పటికీ కర్ణాటకలో మాత్రం ఈ ప్రయోగం లింగాయత్‌ల అదుపులో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అక్కడ పార్టీలో ఉన్న అంతర్గత పోరాటాన్ని అధిష్ఠానం అరికట్టలేకపోతోంది. నేతలు ఒకరిపై మరొకరు మీడియాకెక్కుతున్నారు. యడ్యూరప్పను, ఆయన కుమారుడు విజయేంద్రను మచ్చిక చేసుకునేందుకు ఇటీవల బలమైన ఎమ్మెల్యేను బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను పార్టీ నుంచే బహిష్కరించారు. బీజేపీకి కర్ణాటకలో భవిష్యత్ లేదని త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని యత్నాల్ ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అప్రతిష్ఠపాలు చేసేందుకు ముడా కుంభకోణాన్ని లేవనెత్తి, ఈడీని ప్రయోగించినా బీజేపీ విజయవంతం కాలేకపోయింది. విచిత్రమేమంటే సంఘ్ హేమాహేమీలు దత్తాత్రేయ హోసబలె, సిఆర్ ముకుంద్, ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంతోష్, హెచ్‌వి శేషాద్రి, పద్మనాభాచార్య తదితరులు ఆ రాష్ట్రానికి చెందినవారే. ఒకప్పటి సర్ సంఘ్ చాలక్ సుదర్శన్ కూడా మైసూరుకు చెందినవారే. నిజానికి మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో అగ్రశ్రేణి సంఘ్ నేతలు కర్ణాటక నుంచే వచ్చారు. కాని అదే కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ రాజకీయ భవిష్యత్తు డోలాయమాన పరిస్థితిలో ఉన్నది. సంతోష్ జీ వల్లే దక్షిణాదిలో బీజేపీ దెబ్బతిన్నదని విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. తమిళనాడులో ఐపీఎస్ అధికారి అన్నామలైను ప్రవేశపెట్టి ఓట్ బ్యాంకును పెంచుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మళ్లీ అన్నాడీఎంకెపై ఆధారపడవలసిన స్థితి ఏర్పడింది. కేరళలో కూడా ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్నా బీజేపీ కొంత ఓటు శాతాన్ని పెంచుకోవడం తప్ప అసాధారణమైన విజయాలేమీ సాధించలేదు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నెల్లూరులో ఆర్ఎస్ఎస్ తొలి శాఖ 1947లోనే ఏర్పడింది. 1948లో విజయవాడలో ఆర్ఎస్ఎస్ అతి పెద్ద సభను నిర్వహించింది. 1950లలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తొలి ఓటీసీ నెల్లూరులో జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన దేశ్‌పాండే, బాపురావు మోఘే, బందిష్తే, గోపాల్‌రావు టాగోర్‌తో పాటు కరెడ్ల సత్యనారాయణ, భండారు సదాశివరావు, సోమెపల్లి సోమయ్య లాంటి వారు సంఘ్‌ను ఏపీలో నిర్మించారు. గుంటూరులో శాఖకు హాజరైన వారిలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, భవనం వెంకటరామ్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వేంకటేశ్వరరావు లాంటి వారున్నారని ఒక ఆర్ఎస్ఎస్ నేత తన ఆత్మకథలో రాశారు. నిజానికి హైదరాబాద్ స్టేట్‌లో ఆర్యసమాజ్ మూలంగా ఆర్ఎస్ఎస్‌కు అనుకూల వాతావరణం ఉండేది. 1947లోనే గోల్వాల్కర్ హైదరాబాద్‌కు రహస్యంగా వచ్చారు. 1949లో శ్రీరాంసాథే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించారు. నృపతుంగ, కేశవ మెమోరియల్ లాంటి విద్యాసంస్థలను సంఘ్ అభిమానులను ప్రారంభించారు. నక్సల్బరీ ఉద్యమానికి పోటీగా 1967లోనే ఏబీవీపి ఏర్పడింది. తొలి ఏబీవీపి విద్యార్థి సదస్సు 1967 జూలైలో జరిగింది. 1968లో అఖిల భారత ఏబీవీపి సదస్సు జరిగినప్పుడు సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తర్వాత క్రమేణా ఏబీవీపీ తెలంగాణలోని అనేక కాలేజీల్లో బలపడింది. అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ భావజాలం బలంగా ఉండడం వల్ల జనసంఘ్ ఉనికి ఏర్పర్చుకోలేకపోయింది. తర్వాతికాలంలో తెలుగుదేశం బలమైన ప్రాంతీయ పార్టీగా ఏర్పడడంతో బీజేపీ నిలదొక్కుకోలేకపోయింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సంఘ్ పరివార్, బీజేపీ పుంజుకునేందుకు వాతావరణం ఏర్పడినప్పటికీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆ పార్టీకి బలమైన ప్రతిబంధకాలుగా మారాయి. ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేగల నాయకత్వాన్ని ఆ పార్టీ ఏర్పర్చుకోలేకపోతోంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను బలహీనపరచడంవల్లనో, భావోద్వేగాలను సృష్టించడంవల్లనో లభించే విజయాలు ఎప్పటికైనా తాత్కాలికమవుతాయి. మనను నడిపిస్తున్న లక్ష్యాలేమిటి? రాజకీయాల్లో మనం ఎందుకు ప్రవేశించాం, ఆదర్శాలు, విశ్వాసాల కన్నా వ్యక్తులకు మనం ప్రాధాన్యత కల్పిస్తున్నామా అన్న ప్రశ్నలు వేసుకుని ముందుకు సాగకపోతే విజయాలు వైఫల్యాలుగా మారేందుకు ఎంతో కాలం పట్టదు. కాంగ్రెస్ అదే పరిస్థితిని ఎదుర్కొన్న విషయం తెలియనిది కాదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News