తిరోగమనంలో రాహుల్‌గాంధీ?
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:01 AM
అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? జన్యుపరమైన లోపాలేవో ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. స్వాతంత్య్ర సముపార్జనలో అగ్ర భాగాన ఉండి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిన...

అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? జన్యుపరమైన లోపాలేవో ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. స్వాతంత్య్ర సముపార్జనలో అగ్ర భాగాన ఉండి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిన ఆ పార్టీ నాయకత్వం ఇప్పుడు వెలవెలబోవడానికి కారణమేమిటి? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోవడానికి ఆ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమా? ఈ తరం ఆశిస్తున్నది ఏమిటో గుర్తించి అందుకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దడంలో, విధానాల రూపకల్పనలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవుతోందా? ప్రపంచీకరణ వైపు ప్రజలు చూస్తున్న ఈ రోజుల్లో కమ్యూనిస్టుల భావజాలాన్ని అందిపుచ్చుకోవడమే ఆ పార్టీకి శాపంగా మారిందా? వరుస ఓటములతో పార్టీ భవిష్యత్తు మసకబారిన సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గుజరాత్‌లో ఇటీవల నిర్వహించిన సదస్సులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగం విన్నవారికి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలగడం లేదు. 75 ఏళ్లకు చేరువలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోటీపడటంలో 50 ఏళ్లు పైబడిన రాహుల్‌గాంధీ ఎందుకు వెనుకబడుతున్నారు? అని ప్రశ్నించుకుంటే, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? వారి ఆలోచనలలో వచ్చిన మార్పు ఏమిటి అన్నది పసిగట్టకపోవడమే కారణంగా కనిపిస్తోంది.
కమ్యూనిస్టులు అలా... కాంగ్రెస్ ఇలా...
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బలంగా ఉండిన కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా బలహీనపడిపోవడానికి కారణమేమిటి? ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించడానికి నిరాకరిస్తూ తుప్పు పట్టిన భావజాలాన్నే కొనసాగించడం వల్లనే కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతింటున్నాయన్న విషయం కమ్యూనిస్టులకు తప్ప అందరికీ అర్థమవుతోంది. సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన మావోయిస్టులనే తీసుకుందాం! ఒకప్పుడు దోపిడీకి గురైన ప్రజలు మావోయిస్టులను ఆశ్రయించి, ఆదరించేవారు. ఇప్పుడు సమాజంలో శ్రమ దోపిడీ అనే మాట పెద్దగా వినపడటం లేదు. ఫలితంగా మావోయిస్టుల అవసరం జనానికి లేకుండా పోయింది. ప్రపంచీకరణ కారణంగా కష్టపడే వారికి ఉపాధి అవకాశాలకు కొదవ ఉండటం లేదు. జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. ఫలితంగా మావోయిస్టులు బలహీనపడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ శాంతి చర్చల మంత్రం జపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మావోయిస్టులు చరిత్ర పుటలకే పరిమితం అవుతారు. కమ్యూనిస్టుల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది. దళిత, మైనారిటీ సంక్షేమం కోసం పోరాడటమే తమ లక్ష్యంగా భావించిన కమ్యూనిస్టులు కాలక్రమంలో మెజారిటీ ప్రజలకు దూరమయ్యారు. యువతరానికి పూర్తిగా దూరమయ్యారు. సమస్యలు ఎదురైనప్పుడు కమ్యూనిస్టులను ఆశ్రయించిన దళిత, మైనారిటీలు ఎన్నికల సమయంలో మాత్రం వారికి ముఖం చాటేసేవారు. ‘బూర్జువా’ పార్టీలకే ఓటు వేసేవారు. ఈ పరిణామాన్ని గుర్తించి, తమ విధానాలను సంస్కరించుకోవడానికి నిరాకరించిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఇలా మిగిలారు. విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులు వాడిన పడికట్టు పదాలనే వాడుతోంది. ప్రజలకు దూరమైన కమ్యూనిస్టులను అనుకరించాలని అనుకోవడమే ఆ పార్టీ భావదారిద్య్రంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్... నాడు, నేడు
దేశానికి స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం అనుసరించిన విధానాలు ఏమిటి? ఇప్పుడు ఆ పార్టీ యువ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే పొంతనే ఉండటం లేదు. తొలి తరం కాంగ్రెస్ నాయకత్వం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించింది. ఆ తర్వాత దశలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే పేదల సంక్షేమం చేపట్టవచ్చని నమ్మారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యం ఇచ్చేదన్న అభిప్రాయం ఉండేది. ఈ కారణంగా మెజారిటీ ప్రజలు క్రమంగా ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ... సమాజంలో బడుగు బలహీనవర్గాలను కలుపుకొంటే దళిత, మైనారిటీల జనాభా 90 శాతం ఉండగా, దేశ సంపదలో 90 శాతం మాత్రం పది శాతం ఉన్న కార్పొరేట్ శక్తుల చేతిలో ఉందని విమర్శించారు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగి, మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ నాయకుడి నోట ఇటువంటి మాటలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు. ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ అనుసరించిన విధానాలను కూడా రాహుల్‌గాంధీ అధ్యయనం చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దళిత, మైనారిటీలతోపాటు బడుగు, బలహీనవర్గాల వారి అభ్యున్నతిని కాంక్షించని వారు ఉండరు. అలాగే ఆ వర్గాలవారు రాజకీయంగానూ ఎదగాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. ప్రధానమంత్రి మోదీ స్వయంగా తాను బీసీని అని చెప్పుకోవడం దేనికి సంకేతం? కాంగ్రెస్‌లో ఒకప్పుడు బ్రాహ్మణులు అధికంగా కనిపించేవారు. ఉత్తరాది రాష్ట్రాలలో బ్రాహ్మణ నాయకత్వమే ఉండేది. కాలక్రమంలో బ్రాహ్మణులు కనుమరుగై ఇతర అగ్రవర్ణాలవారు నాయకత్వం వహించే స్థితికి ఎదిగారు. ఇప్పుడు క్రమంగా బడుగు బలహీనవర్గాలవారు నాయకత్వ స్థానాలను అందుకుంటున్నారు. ఇదొక సహజ ప్రక్రియ. బ్రాహ్మణ ఆధిపత్యం పోవడానికి ఎవరూ కారణం కాదు. అలాగే బడుగు బలహీనవర్గాల వారు నాయకత్వ స్థానాల్లోకి రావడానికి కూడా ప్రత్యేకంగా ఎవరూ కారణం కాదు. సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణం. గ్రామాలలో భూమి ఎవరి ఆధీనంలో ఉంటే వారికే రాజకీయ అధికారం లభించడం సహజమని అంటారు. ఒకప్పుడు భూమి బ్రాహ్మణుల వద్ద ఉండేది. వారు పట్టణాలకు వలస వెళ్లిన తర్వాత ఇతర అగ్రవర్ణాల చేతుల్లోకి భూమి వెళ్లింది. దీంతో రాజ్యాధికారం వారికి దక్కింది. ఇప్పుడు క్రమంగా భూమి బలహీనవర్గాలు, దళితుల చేతుల్లోకి వెళుతోంది. ఈ క్రమంలో అతి త్వరలోనే రాజ్యాధికారం బలహీనవర్గాలు, దళితులకు అందబోతోందని అనుకోవాలి. ఈ పరిణామం పరిపక్వం చెందక ముందే సామాజిక న్యాయం పేరిట కొన్ని పార్టీలు రాజకీయ విన్యాసాలు చేసి విఫలమయ్యాయి. తెలుగు రాష్ర్టాలలో ఇది చూశాం. సామాజిక న్యాయం పేరిట బీసీలకు, దళితులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చినంత మాత్రాన విజయం వరించదు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న తెలుగుదేశం పార్టీ బీసీ నినాదాన్ని అందిపుచ్చుకుంది. బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయినా అగ్రవర్ణానికి చెందిన కేసీఆరే అధికారంలోకి వచ్చారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్–రేవంత్‌రెడ్డి మధ్యనే పోటీ జరిగింది. ఎన్నికల్లో నిజానికి ఫలానా ఫార్ములానే పని చేస్తుందని చెప్పలేం. ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి ప్రజలు ఓటేస్తారు. ఉత్తరాదిలో ఉన్నంతగా దక్షిణాదిలో కులాల ప్రాబల్యం కనిపించదు. సామాజిక న్యాయంతో పాటు పేదలు–పెత్తందారుల మధ్య యుద్ధం అని ప్రకటించిన జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఘోరంగా ఓడిపోయారు కదా? ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాలలో ఒకప్పుడు బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవారు. కాల క్రమంలో ఆ వర్గంవారు భారతీయ జనతా పార్టీ వైపు జరిగారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, పోకడలను ఆకళింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయవలసిన రాహుల్‌గాంధీ ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తూ భారతీయ జనతా పార్టీని విజయపథంలో నిలబెడుతున్నారు. ‘75 ఏళ్ల వయసులో కూడా ప్రధాని మోదీ యువతను ఆకర్షించడానికి కారణం ఏమిటి? 50లలో నేను యువతను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాను?’ అని రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా! ఒక సమర్థుడికి, ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజలు సమర్థుడినే ఆదరిస్తారు. రాహుల్‌గాంధీని ప్రజలు మంచివాడుగానే గుర్తిస్తున్నారు గానీ సమర్థుడిగా అంగీకరించడం లేదు. ఈ ఇరువురిలో ప్రధాని మోదీనే సమర్థుడిగా గుర్తించి ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ ప్రజలకు చేరువ అవుతుండగా, కాంగ్రెస్ పార్టీ దూరమవుతోంది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా, యువతరం మనోభావాలతో పొంతన లేకుండా రాహుల్‌గాంధీ ఆలోచనలు ఉండటం కాంగ్రెస్ పార్టీకి శాపంగా పరిణమిస్తోంది.
కాలానుగుణంగా మారాలి...
ప్రపంచీకరణ వల్ల ప్రజల ఆలోచనలు మారిపోయాయి. ప్రపంచ మానవాళి మెరుగైన జీవితాలను కోరుకుంటోంది. కార్పొరేట్ శక్తులకు ఈ పరిణామం సహజంగానే ఉపకరిస్తోంది. వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు కూడా తమ పిల్లలు వ్యవసాయం చేయాలని కోరుకోవడం లేదు. చిన్నదో పెద్దదో పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో నివసించడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో కార్పొరేట్ రంగానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ మాట్లాడటం వలన ప్రయోజనం ఏమిటో తెలియదు. బడుగు బలహీనవర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నా ఆర్థికాభివృద్థి సాధించాలి కదా? దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది, పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగలమన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్‌గాంధీ విస్మరిస్తే ఎలా? దేశంలో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ... ఆయన అవే విధానాలను అందిపుచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? ఎన్నికల్లో ఆయన విజయాలు అందుకోవడానికి కారణం ఏమిటి? అని అధ్యయనం చేయకుండా కాలం చెల్లిన పాత చింతకాయ పచ్చడి వంటి నినాదాలను అందిపుచ్చుకోవడం అవివేకం అవుతుంది. ఈ వర్గం, ఆ వర్గం అన్న తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం ఉండి కూడా యువతరం ఎందుకు తమకు దూరమవుతోందో గుర్తించే ప్రయత్నం చేయాలి కదా? గుజరాత్ ప్లీనరీలో ఈ దిశగా చర్చలు జరపకుండా ప్రధాని మోదీని తిట్టిపోయడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏమిటి? స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర గురించి నేటి తరంలో ఎంత మందికి తెలుసు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాల గురించి కూడా తెలియదే! పార్టీకి దూరమైన మెజారిటీ ప్రజలతో కనెక్టయ్యే ప్రయత్నం చేయకుండా, కాంగ్రెస్ పార్టీ అందరిదీ అన్న భావనకు దూరంగా జరిగిపోవడమే ఆ పార్టీకి శాపమైంది. అందరి పార్టీగా ఉండాల్సిన పార్టీని కొందరి పార్టీగా రాహుల్ గాంధీ మార్చుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రధాని మోదీ ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముస్లిం మైనారిటీల పట్ల భారతీయ జనతా పార్టీ వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలకు చేరువవడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. ఇటీవల నిర్వహించిన కుంభమేళానే ఇందుకు నిదర్శనం. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా, మైనారిటీలను మినహాయిస్తే అన్ని వర్గాల ప్రజలు కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు. ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీ మతతత్వ విధానాలను అనుసరిస్తుందన్న విమర్శ ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు ఆ పార్టీ వైపే చూస్తున్నారు. మెజారిటీ ప్రజలు అంటే అందులో బడుగు బలహీనవర్గాలవారు కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకుల ఆలోచనా ధోరణులు మారుతున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెజారిటీ ఆమెరికన్లను ఆకర్షించగలిగారు. వివిధ దేశాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించి రాహుల్‌గాంధీ తనను తాను సంస్కరించుకోని పక్షంలో ఆ పార్టీ సమీప భవిష్యత్‌లో అధికారంలోకి రాలేదు. ప్రపంచ దేశాల అనుభవాలను అటుంచితే మన దేశంలో వచ్చిన, వస్తున్న మార్పులనైనా అధ్యయనం చేసే ప్రయత్నం ఆయన వెంటనే చేయాలి. దళిత, మైనారిటీలకు అండగా నిలబడటం వేరు, ఆ వర్గాలకు మాత్రమే పరిమితమైన పార్టీగా కుదించుకుపోవడం వేరు. ఈ తేడాను రాహుల్‌గాంధీ గుర్తించాలి. ప్రజల ఆలోచనలకు దూరంగా వెళ్లిపోవడం వల్ల కమ్యూనిస్టుల వలె కాంగ్రెస్ కూడా బలహీనపడిపోయే ప్రమాదం ఉంది.
సెంటిమెంటు అస్త్రం
కాంగ్రెస్ పార్టీ విషయం అలా ఉంచి, తెలుగునాట చోటుచేసుకుంటున్న పరిణామాల విషయానికి వద్దాం! ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో, తెలంగాణలో కేసీఆర్ అండ్ కో తమ పాత కుయుక్తులతో అటు కూటమి ప్రభుత్వాన్ని, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అండ్ కో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలంగాణ సెంటిమెంటును రగిలించేందుకు వాడుకోవాలని చూస్తున్నారు. కంచ గచ్చిబౌలి వివాదమైనా, మరొకటైనా చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం మొదలెట్టారు. ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి దక్కినా, ప్రభుత్వానికి దక్కినా చంద్రబాబుకు గానీ, మరొకరికిగానీ ఒరిగేదేమీ ఉండదు. అయినా తెలంగాణకు నష్టం జరగబోతోందంటూ పిచ్చి ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘ఆంధ్రా’ పత్రికలు అంటూ మీడియాకు ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టే ప్రయత్నం మొదలెట్టారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన మీడియానే అప్పుడూ ఉంది – ఇప్పుడూ ఉంది. ఇంతకాలంగా తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా లాభపడిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు మళ్లీ అదే పాత అస్ర్తాన్ని బయటకు తీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తమ దురహంకార పోకడలను తెలంగాణ సమాజం తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టిన వాస్తవాన్ని గుర్తించకుండా మళ్లీ సెంటిమెంట్‌పై ఆధారపడాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతిరోజూ మూడు నాలుగు గంటలపాటు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వ్యాఖ్యలను చూస్తున్నారు. యూట్యూబ్‌లో మనం ఎటువంటి వీడియోలు చూస్తే అటువంటివే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తమకు అనుకూలంగా ఉండే పోస్టులను చూసుకుంటూ వారు మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చిన్న హోటల్ నడుపుకొన్న కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో విశేష ప్రచారం లభించింది. తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? ఈ కోవలోనే బర్రెలక్క, జ్యోతిష్యుడు వేణుస్వామి, పూసలమ్మే మోనాలిసా, అలేఖ్య పచ్చళ్లు... ఇలా చెప్పుకొంటూ పోతే ఎంతో మందికి సోషల్ మీడియాలో విశేష ప్రచారం కల్పించారు. ఇప్పుడు వారి అడ్రస్ వెదుక్కోవాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాతో అట్లుంటది అని కేసీఆర్, కేటీఆర్ తెలుసుకుంటే వారికే మంచిది. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రాజేయాలని అనుకోవడం కూడా విఫలయత్నమే అవుతుంది. తనను నెత్తిన పెట్టుకున్న తెలంగాణ సమాజమే గత ఎన్నికల్లో తనను కిందకు విసిరేయడానికి కారణం ఏమిటో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా సెంటిమెంటును తిరిగి రగిలించాలనుకుంటే అది వారి ఇష్టం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా నేల విడిచి సాము చేస్తే ఆయాసమే మిగులుతుంది.
మళ్లీ అవే కుట్రలు...
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమలు చేసిన కపట నాటకాలకు, కుట్ర సిద్ధాంతాలకు మళ్లీ తెర తీశారు. తన స్వభావానికి ఏ మాత్రం సరిపడవని తెలిసి కూడా ఆయన నోటివెంట ఇటీవలి కాలంలో విలువలు, విశ్వసనీయత, పత్రికా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వంటి పదాలు వినిపిస్తున్నాయి.
బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయి వంటి కుట్ర సిద్ధాంతాలను తెరమీదకు తెచ్చి గతంలో లాభపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలను తాను ప్రయాణించిన హెలికాప్టర్‌పైకి ఉద్దేశపూర్వకంగా ఉసిగొల్పి విండ్ షీల్డ్‌కు నష్టం చేయించారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు హాని తలపెట్టిందని ఆ వెంటనే ప్రచారం మొదలెట్టారు. అధికారంలోకి రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను, కుట్ర సిద్ధాంతాలను పరిశీలిస్తే జగన్‌రెడ్డి వల్ల ఎవరికైనా హాని ఉంటుందేమోగానీ.. ఇతరుల వల్ల ఆయనకు ఎటువంటి హానీ ఉండదని చెప్పవచ్చు. గొడ్డలి వేటు వల్ల ఒళ్లంతా గాయాలై రక్తం మడుగులో వివేకానంద రెడ్డి శవంగా పడివున్నప్పటికీ గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసినవారు మున్ముందు ఇంకెన్ని నాటకాలకు తెరలేపుతారో వేచి చూడాలి. సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులను బట్టలూడదీసి నిలబెట్టి, ఉద్యోగాలు లేకుండా చేస్తానని జగన్‌రెడ్డి బెదిరించడం కూడా వివాదాస్పదం అయింది. రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు... అధికారులను, పోలీసులను ‘మేం అధికారంలోకి వస్తే’ అని బెదిరించడం పరిపాటే. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇలా బెదిరించినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అందుకు ఆయన ట్రాక్ రికార్డ్ కారణం. అదే జగన్‌రెడ్డి విషయంలో తేలికగా తీసుకోలేని పరిస్థితి. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎదురైన అనుభవాలు ఇందుకు కారణం.
ఈ కారణంగానే జగన్‌రెడ్డి 2.0 పాలన వస్తుందంటే భయపడే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. జగన్‌రెడ్డి పాలనను ప్రజలు మరచిపోలేరు కనుకే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారన్న భావన వస్తేనే ఉలిక్కిపడుతున్నారు. కూటమి శ్రేణులు కూడా ఈ కారణంగానే సొంత ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకంగా ప్రవర్తించిన వారిపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? అని నిలదీస్తున్నారు. కూటమి శ్రేణులు, తెలుగు తమ్ముళ్ల ఆవేదనలో అర్థం లేకపోలేదు. పోలీసుల అదుపులో ఉన్న తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించడం, శుక్రవారం నాడు సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడిన విధానం గమనిస్తే తెలుగు తమ్ముళ్ల ఆక్రోశంలో అర్థం ఉందని అంగీకరించక తప్పదు. నాడు చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కల్యాణ్ కుటుంబాన్ని, మరెందరో మహిళలను అవమానించిన వారిని ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి సత్కరించగా, ఇప్పుడు జగన్ భార్య భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే సొంత పార్టీ కార్యకర్తను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు చేయించారు. ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడాను ప్రజలు అర్థం చేసుకోలేరా? కిరణ్ ముఖానికి పోలీసులు ముసుగు ఎందుకు వేశారో తెలియదు. కొన్ని కేసులలో విచారణ ప్రక్రియలో భాగంగా జరిగే ‘ఐడెంటిఫికేషన్ పరేడ్’లో నిందితులను సాక్షులు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే... అంతకుముందు వారిని ముసుగు వేసి తెస్తారు. ఇక్కడ కిరణ్ తాను తప్పు చేశానని స్వయంగా అంగీకరించినందున ముసుగు అవసరం లేదు. పోలీసుల ఓవరాక్షన్ ఇది. గోరంట్ల మాధవ్‌తో పాటు అరెస్టు చేసిన వారికి కూడా అనవసరంగా ముసుగులు వేశారు. ఇలా చేయడం గుంటూరు పోలీసుల తప్పిదమే. చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆక్షేపించని తెలుగు తమ్ముళ్లు... పోలీసులు ఆయన ముఖానికి ముసుగు వేసి అవమానించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో పార్టీ నాయకత్వంపై తిరగబడినంత పని చేశారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్ల నుంచి ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ పాలనలో చోటుచేసుకున్న దుశ్చర్యలే ప్రస్తుత వైషమ్యాలకు కారణం!
ఆర్కే
ఇవి కూడా చదవండి..