Share News

‘కంచ’ దాటిన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:08 AM

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇంత వివాదాస్పదంగా, ఉద్రిక్తంగా మారడానికి కారణాలు ఏమిటి? ఈ భూములకు సంబంధించిన అసలు వాస్తవాలు ఏమిటి? చినికి చినికి గాలివానగా మారిన ఈ వ్యవహారంపై అటు న్యాయ వ్యవస్థ, ఇటు ప్రభుత్వం వ్యవహరించిన తీరు...

‘కంచ’ దాటిన వ్యాఖ్యలు

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్‌ రేసు నిర్వహణ కోసం ఐఎంజీ భారత్‌ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. ఇందుకోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీకి చెందిన 400 ఎకరాలను తీసుకుంది. ఈ 400 ఎకరాలకు బదులుగా మరోచోట 397 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ వర్సిటీకి కేటాయించింది. అంటే ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఈ 400 ఎకరాలతో సెంట్రల్‌ యూనివర్సిటీకి సంబంధం లేదనుకోవాలి. ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ఈ 400 ఎకరాలను ఎవరూ కొనవద్దని, కాదూ కూడదూ అని ఎవరైనా కొంటే తాము మూడేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్‌ హెచ్చరించడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయించిన తర్వాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని ఆయనకు తెలియదా? ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిన విషయం మరచిపోతే ఎలా?

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇంత వివాదాస్పదంగా, ఉద్రిక్తంగా మారడానికి కారణాలు ఏమిటి? ఈ భూములకు సంబంధించిన అసలు వాస్తవాలు ఏమిటి? చినికి చినికి గాలివానగా మారిన ఈ వ్యవహారంపై అటు న్యాయ వ్యవస్థ, ఇటు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సమర్థనీయంగా ఉందా? కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత, ప్రతిష్ఠపై ప్రభావం చూపవా? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములు, ఇతర అంశాలలో గోటితో పోయే దానిని గొడ్డలి దాకా ఎందుకు తెచ్చుకుంటోంది? ఈ భూముల విషయమై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు ఆందోళన చేశారు? ఈ భూములకు, యూనివర్సిటీకి సంబంధం ఉందా? ఇత్యాది ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని సుమోటోగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అక్కడ చెరువు వద్ద నిర్మించే జైలులో ఉండాల్సి వస్తుందని హెచ్చరించడం కూడా జరిగింది. అయితే, సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులలో ఈ వ్యాఖ్యలు ఏవీ లేవు. ఈ నెల 16 వరకు ఆ భూములలో ఎలాంటి పనులూ చేపట్టకూడదని మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ లోపుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమకు సమగ్ర నివేదిక అందివ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషాన్ని కలిగించాయి. అయితే ఆయా కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తాయా? లేక కీడు చేస్తాయా? అన్న దానిపై న్యాయవాద వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చట్టాలను మాత్రమే సమీక్షించాలా? లేదా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జోడించవచ్చా? అన్న దానిపై కూడా న్యాయ నిపుణులలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ, మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండటంతో సామాన్య ప్రజానీకం ప్రభావితం అవుతున్నారు. సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. కేసులను సుమోటోగా తీసుకుంటున్న విషయంలో కూడా ప్రజలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కంచ గచ్చిబౌలి వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ప్రతివాది అయిన ప్రభుత్వం అభిప్రాయం కూడా తెలుసుకోకుండా తదుపరి పనులపై ఈ నెల 16 వరకు స్టే విధించింది. సదరు భూములలో చెట్లు కొట్టివేయడానికి పర్యావరణ శాఖ నుంచి అనుమతి పొందారా? అని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిజమే– అమలులో ఉన్న చట్టం ప్రకారం చెట్లు కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే, ఏ సందర్భంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి అనుమతులు పొందడం లేదు. గతంలో జాతీయ రహదారుల నిర్మాణం సందర్భంగా చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది. అప్పుడు కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆ తర్వాత అందరూ మరచిపోయారు. ఇలాంటి చట్టం ఒకటి ఉందని చాలా మంది ప్రభుత్వ అధికారులకు కూడా తెలియదు. తెలిసినా పట్టించుకోరు. అందుకే వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు విద్యుత్‌ శాఖ అధికారులు రహదారులకు ఇరువైపులా ఉండే చెట్ల కొమ్మలను అడ్డదిడ్డంగా నరికి వేస్తుంటారు. ఇది సర్వసాధారణం. పర్యావరణ శాఖ అధికారులు కూడా చట్టం అమలు గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఏ హైకోర్టో లేదా సుప్రీంకోర్టో స్పందించినప్పుడు మాత్రమే అది ఒక వార్త అవుతోంది. న్యాయస్థానాలు కూడా ఎప్పుడో ఒకసారి స్పందిస్తుంటాయి.


జగన్‌ హయాంలో పచ్చదనంపై వేటు

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యటనకు బయలుదేరిన ప్రతిసారీ రహదారులపై చెట్లను నరికిపారేసేవారు. ఈ వ్యవహారంపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయినా ఏ న్యాయస్థానమూ పట్టించుకోలేదు. పర్యావరణ ప్రియులు కూడా స్పందించలేదు. రహదారులపై ఉన్న చెట్లను ముఖ్యమంత్రి భద్రత పేరిట నరికివేయడం తప్పు కాదన్నట్టుగా అధికారులు భావించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లలేదు కాబోలు! అప్పుడు ఏ న్యాయమూర్తి కూడా సుమోటోగా విచారణ చేపట్టలేదు. విశాఖపట్నంలో రుషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని, సీఆర్‌జడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండను తవ్వుతున్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి మాత్రం ఒక కమిటీని నియమించింది. మామూలుగా ఇలాగే జరుగుతుంది. కానీ, కొన్ని సందర్భాలలో మాత్రం న్యాయస్థానాలు ఇప్పటిలా స్పందిస్తాయి. అంటే, ధర్మాసనంలో కూర్చున్న వారిని బట్టి కొన్నిసార్లు ఇన్‌స్టంట్‌ న్యాయం లభిస్తుందన్న మాట! న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలన్నది విస్తృత అభిప్రాయం. సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది. అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు మాత్రమే అమలవుతాయి. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు ప్రజలపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. తాజా వివాదంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నారు. ఆమె కెరీర్‌ ఆసాంతం వివాదరహితంగా సాగింది. గతంలో ఏ హోదాలో కూడా ఆమె కోర్టు ధిక్కరణకు పాల్పడిన రికార్డు లేదు. తన పనేదో తాను చేసుకుపోతుంటారు. అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సముచితమా? లేదా? అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలి. నిబంధనలు, చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ మౌనంగా ఉండకూడదు. అలా అని వివాదం పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న చెరువు సమీపంలో నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారు అని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించని పక్షంలో అక్కడ కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం జైలును నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తున్నదా? అలా ఆదేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంటుందా? సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు తుది ఆదేశాలలో లేకపోవడం గమనార్హం.


వ్యాఖ్యలు.. వివాదాలు!

ఏదేమైనా తుది ఆదేశాలలో, తీర్పులలో కనిపించని వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాఖ్యలు పరిధి దాటుతున్నాయి. కానీ, సామాన్య ప్రజలు మాత్రం ఆ వ్యాఖ్యలను న్యాయస్థానాల తీర్పులో భాగంగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ, విశ్వసనీయత మసకబారిపోయే ప్రమాదం లేకపోలేదు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను కాపాడటానికి న్యాయస్థానాలే చొరవ తీసుకోవాలి.

అసలు వివాదం...

ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల పూర్వాపరాల్లోకి వద్దాం! ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్‌ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. ఇందుకోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీకి చెందిన 400 ఎకరాలను తీసుకుంది. ఈ 400 ఎకరాలకు బదులుగా మరోచోట 397 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ వర్సిటీకి కేటాయించింది. అంటే ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఈ 400 ఎకరాలతో సెంట్రల్‌ యూనివర్సిటీకి సంబంధం లేదనుకోవాలి. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయి. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూముల కేటాయింపుపై విచారణకు ఆదేశించింది. దీంతో ఆ‌ వ్యవహారం అటకెక్కింది. ఆ తర్వాత ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ వివాదం న్యాయస్థానానికి చేరుకుంది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సదరు భూమి ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాలను వనరుల సమీకరణలో భాగంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది.


అయితే, ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల వివాదం ముదిరింది. విక్రయించాలనుకున్న 400 ఎకరాల చుట్టూ ముందుగా ఫెన్సింగ్‌ వేసి భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకొని ఉండాల్సింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఈ భూములపై వివాదం నడవడం వల్ల అందులో చెట్లు పెరిగాయి. దీంతో వన్యప్రాణులు కూడా అక్కడ చేరాయి. ఏ భూమి అయినా నిరుపయోగంగా పడి ఉంటే అడవిలా మారడం సహజం. ఈ భూమిని విక్రయానికి అనుగుణంగా చదును చేయాలనుకున్న అధికార యంత్రాంగం అందులో వన్యప్రాణులు ఉన్నాయా? లేవా? అన్నది ముందుగా నిర్ధారించుకోవాల్సింది. అలా చేయకుండా హడావిడిగా డజన్లకొద్దీ జేసీబీలతో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే పెరిగి ఉన్న చెట్లను కూల్చివేశారు. నిజానికి హైదరాబాద్‌ నగరంలో జింకలు, నెమళ్లకోసం ప్రత్యేక పార్కులు ఉన్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో వందల సంఖ్యలో నెమళ్లు ఉన్నాయి. జింకలకోసం వనస్థలిపురం, మొయినాబాద్‌ రోడ్డు ప్రారంభంలో, రింగు రోడ్డు సమీపంలో మరో పార్కు ఉంది. వివాదాస్పద భూముల్లో జింకలు, నెమళ్లు ఉన్న విషయం నిజమైతే వాటిని ఈ పార్కులకు తరలించి ఆ తర్వాత భూమిని చదును చేసి ఉండాల్సింది. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వివాదం ఇంతదూరం వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.


పథకాల కోసం అమ్మకాలు

ఇక భూముల అమ్మకం సమర్థనీయమా? కాదా? అంటే ఎవరి వాదన వారికి ఉంటోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడటం మన రాజకీయ పార్టీలకు పరిపాటే. హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకోసం భూములను అమ్మే ప్రక్రియకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అప్పుడు ఇళ్ల స్థలాలను మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు విక్రయించారు. తర్వాత రాష్ట్రం విడిపోయి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ భూములను విక్రయించారు. ఈ విధంగా వందల, వేల కోట్ల రూపాయలు సమీకరించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికల సందర్భంగా ఇస్తున్న అలవికాని హామీల అమలుకోసం ప్రభుత్వ భూములను విక్రయించడం వాంఛనీయం కాదు. అయినా అన్ని పార్టీలకూ ఈ పాపంలో భాగం ఉంది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ 400 ఎకరాలను విక్రయించడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిజానికి కేసీఆర్‌ హయాంలో ఈ భూముల వివాదం పరిష్కారమై ఉంటే అప్పుడే సదరు భూమిని వేలం వేసేవారు. విశ్వవిద్యాలయాలకు వందల వేల ఎకరాలు అవసరమా? మనం రాచరికంలో ఉన్నామా? అని అప్పట్లో కేసీఆర్‌ ప్రశ్నించారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇకనైనా ఇలాంటి సున్నితమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. లేనిపక్షంలో ప్రతిపక్షాల చేతికి ఆయుధాలు ఇచ్చిన వారవుతారు. ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ఈ 400 ఎకరాలను ఎవరూ కొనవద్దని, కాదూ కూడదూ అని ఎవరైనా కొంటే తాము మూడేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్‌ హెచ్చరించడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయించిన తర్వాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని ఆయనకు తెలియదా? ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిన విషయం మరచిపోతే ఎలా? కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు కోకాపేట వద్ద పెద్ద మొత్తంలో భూములు విక్రయించారు. అప్పుడు ఈ అమ్మకాన్ని ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. అలా అని సదరు భూముల్ని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదా? తాము చేసేది సంసారం– ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం వల్లనే ప్రతిదీ వివాదం అవుతోంది. దీంతో ప్రజలు కూడా ఏది మంచి? ఏది చెడు? ఏది న్యాయం? ఏది అన్యాయం? అనేది తేల్చుకోలేక స్పందించడం మానేశారు.


‘ట్రంపరి తనం’...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విషయమే తీసుకుందాం. ఆయన ఒక అగ్ర దేశాధినేతగా కాకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. సుంకాల విషయంలో ఆయన తన రాజకీయ జాణతనాన్ని ప్రదర్శిస్తున్నారు. వివిధ దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఆయన ఎడా పెడా సుంకాలు విధిస్తున్నారు. నిజానికి ఈ సుంకాల భారాన్ని అమెరికన్లే భరించాలి. దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగితే ఆ భారం ప్రజలపైన పడుతుంది కదా? అయితే తన చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా ‘అమెరికాకు విముక్తి కల్పిస్తున్నాను. దోపిడీ నుంచి కాపాడుతున్నాను’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటిస్తున్నారు. అమెరికన్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలు అధిక పన్నులు వసూలు చేస్తున్నది వాస్తవమే. దీనివల్ల ఆయా దేశాల్లో వాటి ధరలు అధికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. స్వదేశీ కంపెనీలను కాపాడుకోవడానికి ఆయా దేశాలు ఈ పన్నుల శాతాన్ని నిర్ణయిస్తాయి. ఒకప్పుడు మన దేశంలో రక్షిత ఆర్థిక వ్యవస్థ ఉండేది. అప్పుడు స్వదేశీ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టలేదు. తర్వాత స్వేచ్ఛా వాణిజ్య విధానం అమలులోకి వచ్చింది. అంబాసిడర్‌ కారునే ఉదాహరణగా తీసుకుందాం! రక్షిత ఆర్థిక విధానం అమలులో ఉన్నప్పుడు దేశ ప్రజలకు అంబాసిడర్‌ కారు మాత్రమే దిక్కుగా ఉండేది. కార్లను దిగుమతి చేసుకోవాలంటే 300 శాతానికి పైగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. స్వేచ్ఛా వాణిజ్య విధానం అమల్లోకి వచ్చాక అంబాసిడర్‌ కార్లు.. టెక్నాలజీ విషయంలో దిగుమతి చేసుకున్న కార్లతో పోటీపడలేక కనుమరుగయ్యాయి. ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగితే పెరగవచ్చుగానీ ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. ఫార్మా ఎగుమతులపై కూడా సుంకాలు వేయబోతున్నట్టు ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. పర్యావరణ చట్టాల కారణంగా అమెరికా వంటి దేశాలలో మందుల కంపెనీలు ఆయా ఉత్పత్తులను చేపట్టలేని స్థితి. ఈ కారణంగానే మన దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందింది. ఫార్మా ఉత్పత్తుల వల్ల నీరు, భూమి కలుషితం కాకుండా కాపాడుకున్నందుకుగాను అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు ఫార్మా కంపెనీలపై తక్కువ పన్నులు విధించింది. ఇప్పుడు సుంకాలు పెంచితే దాని భారం ప్రజలే భరించాలి. ఈ చర్యలన్నీ అంతిమంగా అమెరికాకు నష్టం చేయవచ్చు. అయితే, తన నిర్ణయాల వల్ల అన్ని దేశాలు దారికొస్తున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక దేశాలు అమెరికాను తమ పెద్దన్నగా గుర్తించి గౌరవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో సుంకాలు తక్కువగా విధించడం కూడా ఒక కారణం. వివిధ రూపాలలో అమెరికా నుంచి సహాయం పొందుతున్న దేశాలన్నీ ఆమెరికాను పెద్ద దిక్కుగా అంగీకరించాయి. ఇప్పుడు అమెరికాకు పోటీగా చైనా ఎదుగుతోంది. ట్రంప్‌ చర్యల వల్ల వాణిజ్య యుద్ధం ముదిరితే ఇప్పటి వరకు అమెరికా పంచన ఉన్న దేశాలు చైనా వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ట్రంప్‌ విధించిన సుంకాలకు పోటీగా చైనా కూడా 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య కూడా అమెరికన్లకు నష్టం కలిగిస్తుంది. ట్రంప్‌ చర్యల వల్ల ఆయనకు బలమైన మద్దతుదారుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ కూడా భారీగా నష్టపోతున్నారు.


పిచ్చితనం కాదు... అది రాజకీయం!

డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు చూస్తుంటే ఆయన మన దేశంలోని రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోరనిపిస్తోంది. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం మన రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే విధానం అందిపుచ్చుకున్నారు. నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ మేడిపండు చందంగా ఉంది. దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తున్నానంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రయత్నం ట్రంప్‌ చేస్తున్నారు. తాము ఇంతకాలం నిజంగానే దోపిడీకి గురయ్యామని అమెరికన్లు ఆయన ప్రచారాన్ని నిజంగా నమ్మితే భవిష్యత్తులో తమపై పడబోతున్న భారాన్ని ఇప్పట్లో గుర్తించలేరు. చాలామంది ట్రంప్‌ను ‘మెంటల్‌’ అని నిందిస్తున్నారు. అయితే ఆయన పిచ్చివాడు కాదు. ఫక్తు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. మన నాయకుల వలె ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి పిచ్చివాళ్లను చేస్తున్నారు. ట్రంప్‌ చర్యలు అంతిమంగా అమెరికాకు మంచి చేస్తాయా? కీడు చేస్తాయా? అన్నది కాలమే చెప్పాలి. ఆయన మొదలెట్టిన వాణిజ్య యుద్ధం ముదిరితే అది ప్రపంచ మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే వివిధ దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఈ పతనం ఇలాగే కొనసాగితే బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. అప్పుడు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అమెరికా ఇప్పటికే ఆర్థిక మాంద్యం అంచున ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారులు లాభాలు మాత్రమే చూస్తారు. ప్రభుత్వాధినేతలు ప్రజల హితాన్ని చూస్తారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్‌, మస్క్‌ వంటి వ్యాపారవేత్తలు అధికారంలోకి వచ్చారు. అందుకే వారు ప్రతి దానినీ లాభాల కోణంలోనే చూస్తున్నారు. అగ్రరాజ్యంగా తాము చెలామణి అవడానికి కారణాలు ఏమిటి? అగ్రరాజ్యం బాధ్యతలు ఏమిటి? అని గుర్తించలేకపోతున్నారు. అమెరికా తన విధానాలను సవరించుకోని పక్షంలో ఇప్పటి వరకు మిత్ర దేశాలుగా ఉన్నవారు సైతం శత్రు దేశాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. అదే సమయంలో ప్రస్తుతం అమెరికాకు ప్రత్యర్థిగా ఉన్న చైనా కొత్త మిత్రులను చేరదీసి మరింత బలపడవచ్చు. అమెరికా భవిష్యత్తు మాత్రమే కాదు, ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది డొనాల్డ్‌ ట్రంప్‌ చేతుల్లోనే ఉంది!

ఆర్కే

ఇవి కూడా చదవండి..

Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు

Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ

Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటీ

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

For National News And Telugu News


2-ad.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - Apr 06 , 2025 | 08:35 AM