‘మహా’ బుల్డోజర్
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:50 AM
ఏదో ఒక నేరంలో నిందితుడో, దోషో అయినంతమాత్రాన నోటీసులు ఇవ్వకుండా, స్పందించడానికి తగినంత సమయం ఇవ్వకుండా, చట్టాలూ నిబంధనలూ పాటించకుండా నేరుగా బుల్డోజర్లతో పోయి వారి నివాసాలను నేలమట్టం...

ఏదో ఒక నేరంలో నిందితుడో, దోషో అయినంతమాత్రాన నోటీసులు ఇవ్వకుండా, స్పందించడానికి తగినంత సమయం ఇవ్వకుండా, చట్టాలూ నిబంధనలూ పాటించకుండా నేరుగా బుల్డోజర్లతో పోయి వారి నివాసాలను నేలమట్టం చేయడం అన్యాయం, అంతకుమించి రాజ్యాంగ విరుద్ధం అని నాలుగు నెలలక్రితమే సుప్రీంకోర్టు గట్టిగా చెప్పినా, ఈ ఆదేశాలను బేఖాతరుచేసి, మళ్ళీ అదే దుర్నీతితో వ్యవహరిస్తున్న సదరు రాష్ట్రాలను, అధికారులను ఏం చేయాలి? కూల్చివేతల విషయంలో కాస్తంత మానవీయంగా ఉండండి అని సుప్రీంకోర్టు సోమవారం మళ్ళీ చెప్పింది. ఇలా పలుమార్లు చెప్పాల్సివస్తుండటం న్యాయస్థానానికి ఆగ్రహమో, అసహనమో కలిగించవచ్చును కానీ, ఒకవర్గంమీద ప్రత్యేకంగా కక్షతీర్చుకోవడానికీ, మరోవర్గం ఓట్లుపెంచుకోవడానికీ కూల్చివేతలను ఒక విధానంగా అమలుచేస్తున్న పాలకులకు సుప్రీం చీవాట్లు అవమానం కలిగించవు. నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నిర్మాణాలను నాశనం చేయాల్సిన సందర్భంలోనూ పద్ధతులు పాటించాల్సిందేనని న్యాయస్థానం అంటోంది. కానీ, ఈ బుల్‌డోజర్ న్యాయంలో జరుగుతున్నదల్లా ముందుగా ఇళ్లను కూల్చివేయడం, ఆ తరువాత వాటిని అక్రమకట్టడాలనీ, దురాక్రమణలనీ ముద్రవేయడం. బుల్‌డోజర్ బాబాగా ప్రసిద్ధిచెందిన యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తర్‌ప్రదేశ్ ఈ విషయంలో, ఆయన పార్టీకి చెందిన మిగతా పాలకులకు మార్గదర్శి కూడా.
మిగతా ఘనకార్యాలను పక్కనబెడితే, 2021లో ప్రయాగ్‌రాజ్‌లో యూపీ పోలీసులు అతీఖ్ అహ్మద్ అనే గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్‌ను ఎన్‌కౌంటర్ చేశారు, అతడికే చెందినవేనంటూ కొన్ని ఇళ్ళూవాకిళ్ళను కూడా అధికారులు కూల్చివేశారు. అలా కూల్చివేసినవి గ్యాంగ్‌స్టర్‌వి కావు, మావి అని ఇద్దరు వితంతువులతో సహా కొందరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసుపోవడంతో, వారంతా సుప్రీంకోర్టుకు వచ్చారు. ముందురోజు రాత్రి నోటీసులు ఇచ్చి మర్నాడు ఉదయాన్నే కూల్చివేయడంలో వీసమెత్తు న్యాయమైనా ఉందా? అని ద్విసభ్యధర్మాసనం అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. జవాబు చెప్పుకోవడానికి కూడా గడువు ఇవ్వకుండా ఇంత నిర్దయగా ఇళ్ళను కూల్చివేస్తుంటే సహించం, భరించం అంటూ ఆగ్రహించింది. ఇక, బీజేపీ ఏలుబడిలో ఉన్న మరో రాష్ట్రం–మహారాష్ట్రలో అమలయిన బుల్‌డోజర్ న్యాయం మరీ విచిత్రమైనది.
ఫిబ్రవరి 23న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంలో ఒక ఇంట్లోనుంచి ఒక పిల్లవాడు పాకిస్థాన్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు చేశాడంటూ కొందరు స్థానికులు ఆరోపించడంతో ఆ ఇంట్లోవారిని పోలీసులు అరెస్టుచేశారు. కొద్దిగంటల్లోనే ఆ పిల్లవాడిని వదిలిపెట్టి, తల్లిదండ్రులు ఇద్దరూ నిర్బంధంలో ఉండగానే, వారి ఇంటినీ, పాత ఇనుము–చెత్త దుకాణాన్ని అధికారులు ఆగమేఘాలమీద కూల్చివేశారు. ఈ విధ్వంసం ముగిసిన మర్నాడే దంపతులు ఇద్దరూ మేజిస్ట్రేట్ బెయిల్‌మీద బయటకు వచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ న్యాయస్థానానికి విన్నవించుకుంటూ, గత ఏడాది నవంబరు 13న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈ చర్యలు ఉల్లంఘిస్తున్నాయని సదరు బాధితుడు న్యాయమూర్తులకు గుర్తుచేశాడు. తన ఆస్తిని పునరుద్ధరించి, తగిన పరిహారం ఇప్పించవలసిందిగా ప్రార్థించాడు. ఒకపక్క ఈ కేసుల్లో సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తున్న క్షణాల్లోనే, నాగపూర్‌లో ఒక ఇంటిని బుల్‌డోజర్ కూల్చేసింది. మార్చి 17న జరిగిన మతహింసకు కారకుడున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటిని మునిసిపల్ అధికారులు మార్చి 20న అక్రమ నిర్మాణమని ప్రకటించి, 24న కూల్చేశారు. నోటీసులమీద నోటీసులు ఇవ్వాలి, కనీసం పదిహేను రోజులు గడువు ఉండాలి అంటూ నవంబరులో దేశవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలను విడుదలచేసిన సుప్రీంకోర్టు, వారంలోనే బుల్‌డోజర్ న్యాయాన్ని అమలు చేసిన కనీసం రెండుకేసుల్లో అధికారులు, పాలకులను ఎలా శిక్షిస్తుందో చూడాలి. 142వ అధికరణ ద్వారా సంక్రమించిన విశేషాధికారాలను వినియోగించుకుంటూ, గీసిన గీతదాటి దూకుడుగా వ్యవహరించే అధికారులమీద ధిక్కరణ చర్యలు తీసుకుంటాననీ, బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వీరి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తాననీ 95 పేజీల ఆ తీర్పులో న్యాయమూర్తులు బుల్డోజర్ ఘాతుకాలను నిలువరించేందుకు చేసిన ఆ ప్రయత్నం వృధాపోకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News