Share News

సహకార రుణవ్యవస్థ రెండంచెల విధానం అవశ్యం

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:55 AM

భారతదేశంలో సహకార రుణ వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మూడంచెల సహకార రుణ వ్యవస్థ, మరికొన్ని రాష్ట్రాలలో రెండంచెల సహకార రుణ వ్యవస్థ అమలులో...

సహకార రుణవ్యవస్థ రెండంచెల విధానం అవశ్యం

భారతదేశంలో సహకార రుణ వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మూడంచెల సహకార రుణ వ్యవస్థ, మరికొన్ని రాష్ట్రాలలో రెండంచెల సహకార రుణ వ్యవస్థ అమలులో ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకు అనే మూడు దొంతరల విధానం కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉంది. నాబార్డ్ నుంచి రాష్ట్ర సహకార బ్యాంకులకు, అక్కడి నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు, వాటి నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, చివరగా రైతుకు వ్యవసాయ రుణం అందించబడుతోంది.

ప్రతి దొంతరలోనూ 1 లేక 2శాతం వడ్డీ మార్జిన్ వేసుకుని రుణాలు అందిస్తుంటాయి. అందువల్ల, వ్యవసాయ రుణాల వడ్డీలు రైతాంగానికి తలకు మించిన భారంగా తయారయ్యాయి. ఫలితంగా ‘స్వల్ప వడ్డీరేట్లు లేదా పావలా వడ్డీకే వ్యవసాయరుణాలు’ అన్న విధానాలకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. తద్వారా అధిక వడ్డీల భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడింది.


మరికొన్ని రాష్ట్రాలలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రాష్ట్ర సహకార బ్యాంకు అనే రెండు దొంతర్ల వ్యవస్థ అమలులో ఉంది. ఈ విధానంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లేవు. వాటి స్థానంలో, రాష్ట్ర సహకార బ్యాంకు బ్రాంచీలు పని చేస్తూ, స్వల్ప వడ్డీరేట్లకే వ్యవసాయ రుణాలు అందిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని సహకార వ్యవసాయ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా సంస్థాగత మార్పులు తీసుకురావాలని గత 50 ఏళ్లుగా అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. 1972లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో సహకార బ్యాంకు ఉద్యోగుల జాతీయ సదస్సు హైదరాబాదులో జరిగింది. మొదటి దశలో– సహకార రుణ వ్యవస్థలో దీర్ఘకాలిక రుణాలను అందించే సహకార వ్యవసాయాభివృద్ధి బ్యాంకులను, పంట రుణాలు లాంటి స్వల్పకాలిక రుణాలను అందించే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను విలీనం చేయాలని, తద్వారా సింగిల్ విండో విధానాన్ని అమలు జరపాలని ప్రభుత్వాలకు ఆ సదస్సు విజ్ఞప్తి చేసింది. రెండవ దశలో– జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను రద్దుచేసి, రాష్ట్ర సహకార బ్యాంకు బ్రాంచీలుగా మార్చాలని, తద్వారా రెండంచెల విధానాన్ని అమలులోకి తీసుకురావాలని జాతీయ సదస్సు డిమాండ్ చేసింది.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 1987 ఏప్రిల్ 1 నుంచి ‘సింగిల్ విండో’ విధానాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమల్లోకి తీసుకువచ్చారు. అంటే సహకార వ్యవసాయాభివృద్ధి బ్యాంకులను రద్దు చేసి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులలో విలీనం గావించారు. అప్పటి నుంచి, పంట రుణాలు లాంటి స్వల్పకాలిక రుణాలతో పాటు, దీర్ఘకాలిక రుణాలను సైతం ఒకే చోట నుంచి పంపిణీ చేస్తున్నారు. అయితే ‘రెండంచల విధానం అమలు’ అనే లక్ష్యం అలాగే మిగిలిపోయింది.

ఈ లక్ష్యసాధన కోసం, జాతీయ స్థాయిలో ఏఐబీఈఏ నాయకత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి. మన రాష్ట్రంలో సైతం వేలాదిమంది రైతులు, ఉద్యోగులతో ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. లక్షలాది ప్రజల నుంచి సంతకాల సేకరణ జరిగింది. వివిధ రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధుల, మేధావుల, సహకారవేత్తల మద్దతుతో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను రద్దుచేసి, రాష్ట్ర సహకార బ్యాంకు బ్రాంచీలుగా విలీనం చేయడం ద్వారా, రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనీ, తద్వారా వ్యవసాయ రుణాల వడ్డీభారం నుంచి రైతాంగానికి విముక్తి కల్పించడమేగాక, సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి దోహదపడాలన్న డిమాండ్‌కు సర్వత్రా ఆమోదం లభించింది. అయితే రాష్ట్ర విభజన అంశం ముందుకు రావడం వల్ల, ఈ విషయం మరుగున పడిపోయింది.


ఇప్పటికైనా సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే, రెండంచెల విధానాన్ని అమలు జరపటం తప్ప మరో మార్గం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి స్వల్ప వడ్డీరేట్లకు, సకాలంలో, అధిక మొత్తాలలో వ్యవసాయ రుణాలను సజావుగా అందించాలంటే ఈ మార్పులు అవశ్యం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రద్దు కావడం వల్ల, వ్యవసాయ రుణాల పంపిణీలో జాప్యం తగ్గుతుంది. మూడు దొంతరల మధ్య సమన్వయం కంటే, రెండు దొంతర్ల మధ్య సమన్వయం తేలిక. పాలన నేరుగా రాష్ట్ర సహకార బ్యాంకు పరిధిలోకి వస్తుంది. దాంతో అవినీతి లేదా నిర్వాహక లోపాలు నివారించటం సులువు. నిధుల అందుబాటు వేగంగా ఉంటుంది. రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి నేరుగా పీఏసీఎస్‌కు, ఆ వెంటనే రైతాంగానికి రుణాలు అందుతాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ సరళంగా ఉంటుంది. బ్యాంకు పాలనా పరిధి రాష్ట్రమంతటికీ విస్తరించటం వల్ల, ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను సమర్థంగా అందించవచ్చు. ప్రజల విశ్వాసం చూరగొనవచ్చు. కార్యకలాపాల నిర్వహణలో, అనవసర కాలయాపన, ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండదు. డిజిటల్ లావాదేవీలు వేగంగా, సులభంగా జరుగుతాయి. రాష్ట్ర సహకార బ్యాంకుకు ‘షెడ్యూల్డ్’ హోదా లభిస్తుంది. కనుక, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరింపజేసి, ఆ ప్రజల అవసరాలు తీర్చటంలో రెండంచెల విధానం ఉత్తమం.


సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైనది నిరంతర రాజకీయ జోక్యం. సహకార సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడం, రుణాల మంజూరు, వసూళ్లలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అనేక బ్యాంకులు సంక్షోభంలోకి వెడుతున్నాయి. రెండంచెల విధానం వల్ల, అడ్డగోలు రాజకీయ జోక్యాన్ని నివారించటం సాధ్యమవుతుంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు బ్యాంకులకు స్వతంత్రత లభిస్తుంది. కామన్ అకౌంటింగ్ సిస్టం, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర సహకార బ్యాంకు ఒక సమిష్టి వేదికగా వ్యవహరిస్తుంది.

రెండంచెల విధానం బ్యాంకుల అభివృద్ధికి దోహదం చేస్తుందని, రైతాంగానికి సమర్థంగా సేవలు అందిస్తుందని అనేక కమిషన్లు సిఫారసు చేశాయి. కైధాన్ కమిటీ (1958), భావేకమిటీ (1975), రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ హజారే కమిటీ (1975), బ్రహ్మాండం కమిటీ (1995), శివాజీరావు పాటిల్ ఆధ్వర్యంలోని సహకార వ్యవస్థపై ఉన్నతస్థాయి కమిటీ (2009), చౌదరి కమిటీ (1999), ప్రకాష్ బక్షి కమిటీ (2012), ఇంకా అనేక ఉన్నతస్థాయి కమిటీలు రెండంచెల విధానానికి మొగ్గుచూపాయి. ఖర్చులు తగ్గించాలంటే దొంతర్లను తగ్గించాల్సిందేనని నరసింహన్ కమిటీ తేల్చి చెప్పింది. ఇంకా ఖుస్రో, డాక్టర్ వైద్యనాధన్, కపూర్ కమిటీలు సైతం ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా, సహకార బ్యాంకింగ్‌లో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని సిఫారసు చేశాయి.


సిఎస్‌ రంజిత్ కమిటీ సిఫారసు మేరకు కేరళలో, వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం రెండంచెల విధానాన్ని అమలులోకి తెచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్, చండీఘర్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, త్రిపుర రాష్ట్రాలలో రెండంచెల విధానం అమలులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాలలో రెండంచెల విధానం అమలు దిశగా ఉన్నతస్థాయి కమిటీలను నియమించారు. రెండంచెల విధానం అమలు జరపాలనుకునే రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం, సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే, రెండంచెల విధానం అమలుకు చర్యలు చేపట్టాలి.

వెలుగూరి రాధాకృష్ణమూర్తి

ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 01:55 AM