Rural Debt Burden: రుణమాఫీ చుట్టూ ఎందుకంత లొల్లి
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:11 AM
2021 నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ (NSSO) నివేదిక ప్రకారం, తెలంగాణలో 91% గ్రామీణ రైతు కుటుంబాలు అప్పుల భారంతో బాధపడుతున్నాయి. రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబాల సగటు రుణభారం రూ. 1,52,000 ఉండగా, వ్యవసాయ కుటుంబాలు 2 ఎకరాలు 6 గుంటల భూమి పైన ఆధారపడి ఉంటాయి

భారత ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ (NSSO) 2021లో ఇచ్చిన ‘వ్యవసాయ కుటుంబాలు & భూకమతాల వాస్తవిక పరిస్థితులు–2021’ అనే నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 91శాతం గ్రామీణ రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సగటు రుణభారం రూ.1,52,000. ఇది కూడా జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గ్రామాల్లో కుటుంబాల సంఖ్య సుమారు 49లక్షలు కాగా అందులో 26 లక్షల 55 వేలు (54శాతం) వ్యవసాయ కుటుంబాలుగా పేర్కొన్నారు. దీని ప్రకారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడి ఉన్న కుటుంబాల సంఖ్య కేవలం 26 లక్షల 55 వేలు మాత్రమే. ఇందులో 90 శాతం షెడ్యూలు కులాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్లే. అదేవిధంగా తెలంగాణలో ప్రతి వ్యవసాయ కుటుంబ సగటు భూ విస్తీర్ణం 2 ఎకరాల 6 గుంటలు. దీని ప్రకారం తెలంగాణలో వాస్తవంగా గ్రామాల్లో నివసిస్తూ మొత్తం వ్యవసాయ కుటుంబాలు సాగు చేస్తున్న నికర విస్తీర్ణం 57 లక్షల 8 వేల 250 ఎకరాలు మాత్రమే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ సంఖ్యను భూమి యాజమాన్య పాస్‌బుక్‌లతో పోల్చి దాదాపుగా 68లక్షలుగా చెప్తున్నారు. ఇది కేవలం భూ యజమానుల పాస్ బుక్‌ల సంఖ్య మాత్రమే. అంతేకాకుండా గ్రామాల్లో నివాసం లేని, వ్యవసాయేతర వృత్తులలో పనిచేస్తూ పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న భూ యజమానుల కుటుంబాలను కూడా వ్యవసాయ కుటుంబాలుగా పరిగణిస్తూ వ్యవసాయ కుటుంబాల సంఖ్యను అధికంగా చూపిస్తున్నారు. వాస్తవానికి భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ (NSS) నివేదిక ఇచ్చిన నిర్వచనం ప్రకారం, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం అంటే సొంతభూమి ఉండి ఆయా కుటుంబ సభ్యులు ఒకే ఇంటిలో ఉంటూ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న కుటుంబం.
గ్రామాలలో భూమి ఉండి, ఆయా కుటుంబాలు వ్యవసాయేతర వృత్తులలో స్థిరపడి పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను వ్యవసాయ కుటుంబాలుగా పరిగణించరు. దీనిని బట్టి చూస్తే భారత ప్రభుత్వం గానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గానీ వ్యవసాయదారులకు ఇచ్చే ఏ లబ్ధి పథకమైనా గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకు మాత్రమే దక్కాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భూమి లేకుండా కౌలుదారులుగా వ్యవసాయం చేస్తున్న కుటుంబాలకు కూడా ఈ ఫలితాలు అందాలి. ఐతే కౌలుదారులకు గ అధికమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆదాయపన్ను చెల్లించే కుటుంబాలను రుణమాఫీ పథకం నుండి మినహాయించారు. దీనివలన గ్రామాలలో భూమి ఉన్నప్పటికీ ఆయా కుటుంబాలు వ్యవసాయేతర వృత్తులలో స్థిరపడి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చి పట్టణ, నగరాల్లో ఉన్న చాలా కుటుంబాలకు ఈ రుణమాఫీ పథకం వర్తించలేదు. వాస్తవానికి రుణమాఫీ పథకం వ్యవసాయేతర ఆదాయ వనరులపై ఆధారపడ్డ కుటుంబాలకు భూమి ఉన్నప్పటికీ వర్తింపచేయడం సబబు కాదు. ఈ నేపథ్యంలో తొలుత అంచనా వేసిన రూ. 31వేల కోట్ల రుణమాఫీ కంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గిన మాట వాస్తవం. దీని అర్థం, అర్హత ఉన్న ప్రతి వ్యవసాయ కుటుంబానికి రుణమాఫీ పథక ఫలాలు అందాయి. అందలేదన్న ప్రతిపక్షాల విమర్శ అర్థరహితం. అయితే గ్రామీణ ప్రాంతాలలో కొన్ని వ్యవసాయ కుటుంబాలకు రుణమాఫీకి పూర్తిగా అర్హత ఉన్నప్పటికీ కొన్ని సాంకేతికపరమైన లోపాలతో రుణమాఫీ ఫలాలు అందలేదన్న మాట వాస్తవం. ఈ సంఖ్య ఎంత అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రుణ విముక్తి పొందిన గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సంఖ్య దాదాపు 25 లక్షలు. అనగా భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఓ, 2021 నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 95 శాతం గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు ఈ రుణమాఫీ పథకం ద్వారా రుణ విముక్తి జరిగినట్లు అయింది.
అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇంకా 40 శాతం వ్యవసాయ కుటుంబాలకి రుణమాఫీ పథకం ఫలాలు అందలేదు అనేది అవాస్తవం. ఒకవేళ నూటికి నూరు శాతం గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు రెండు లక్షల పంట రుణం, వడ్డీ బకాయిల నుండి రుణ విముక్తి చేయాలనుకున్నా ఇంకా మిగిలి ఉన్న గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సంఖ్య 1,55,000లకు మించదు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో దాదాపు 95శాతం పైగా వ్యవసాయ కుటుంబాలకు ఏకకాలంలో రుణముక్తి కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రైతులలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే సంఘటన. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి గణాంకాలను విశ్లేషించినట్లయితే తెలంగాణ గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో 2007 నాటికి 80 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉండేవి. ఆ సంఖ్య నానాటికీ పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. అయితే, నాలుగు సమాన విడతలుగా నాలుగేళ్ళలో రుణమాఫీ చేయడం ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఎందుకంటే ఈ విడతల వారి రుణమాఫీ ద్వారా అదనపు వడ్డీ భారం రైతాంగం మీద పడడమే గాక, ఆ తర్వాత బ్యాంకు నుంచి కొత్త రుణాన్ని పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారు. అదేవిధంగా 2018లో తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్లీ లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పింది. అయితే ఇది 2023 నవంబర్ నాటికి అరకొరగా మాత్రమే అమలు చేసి దాదాపు తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేయకుండానే అధికారం నుండి వైదొలగవలసి వచ్చింది. అంటే 2014 నుండి 2023 వరకు నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి విడతలవారీగా ఒకసారి, అరకొరగా మరొకసారి చేసి దాని ప్రయోజనాలను పూర్తిస్థాయిలో రైతులకు అందకుండా చేసింది.
అందువల్లనే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రైతు సంక్షోభం, రైతు ఆత్మహత్యలు ఆగలేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడం వలన దాదాపు 95శాతం గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు రుణ విముక్తి పొందాయి. ఈ రుణ విముక్తి అన్నదాతల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. అంతేకాకుండా మున్ముందు అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ రుణ విముక్తితో అన్నదాతలకు కొత్త అప్పులు బ్యాంకుల నుండి లభించే అవకాశం సులభమైనది. తద్వారా, అన్నదాతలు అప్పుల కోసం వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. బ్యాంకులు ఇచ్చే కొత్త అప్పుల ద్వారా సకాలంలో పెట్టుబడులు కుదిరి వ్యవసాయ ఉత్పత్తులను అధికం కావడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. n ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వ్యవసాయ ఆర్థికవేత్త