Share News

అధికారమే భావజాల బాంధవ్యం!

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:13 AM

రాజకీయ కసరత్తులకు పురస్కారాలు ఉన్న పక్షంలో స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు నితీశ్‌ కుమార్‌ నిస్సందేహంగా అందరికంటే ముందంజలో ఉంటారు; మొదటి మూడు స్థానాల్లో ఏదో ఒక దానిలో...

అధికారమే భావజాల బాంధవ్యం!

రాజకీయ కసరత్తులకు పురస్కారాలు ఉన్న పక్షంలో స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు నితీశ్‌ కుమార్‌ నిస్సందేహంగా అందరికంటే ముందంజలో ఉంటారు; మొదటి మూడు స్థానాల్లో ఏదో ఒక దానిలో ఉండేందుకు చంద్రబాబు నాయుడు పోటీ పడతారు. నరేంద్ర మోదీకి నిన్న, మొన్న గట్టి ప్రత్యర్థులుగా ఉన్న ఈ నాయక ద్వయం నేడు ఆయన నమ్మకమైన మిత్రులుగా మారిపోయారు. ఇదొక సమూల మార్పు. పార్లమెంటులో వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందేందుకు జనతాదళ్‌ (యునైటెడ్‌), తెలుగుదేశం పార్టీలు సంపూర్ణ మద్దతునివ్వడమే అందుకొక తిరుగులేని నిదర్శనం. గత పది నెలల్లో పరిస్థితులు ఎంతగా మారిపోయాయి! జూన్‌ 2024 నాటి పరిస్థితులను గుర్తు చేసుకోండి. సార్వత్రక ఎన్నికలు ముగిసాయి. నరేంద్ర మోదీకి మెజారిటీ లభించలేదు. నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు నాయుడు బీజేపీకి అవసరమైన సంఖ్యాధిక్యతను సమకూర్చేందుకు సమ్మతించారు–షరతులతోనే సుమా! మరి వారే ఇప్పుడు నరేంద్ర మోదీ ఆధిపత్యాన్ని ఎటువంటి మినహాయింపులు లేకుండా అంగీకరిస్తున్నారు.

అధికార రాజకీయాలలో మనుగడను కాపాడుకునేందుకు సైద్ధాంతిక నిబద్ధతలకు ఎంత సులువుగా తిలోదకాలు ఇవ్వడం జరుగుతుందనేదానికి నితీశ్‌ కుమార్‌ రాజకీయమే ఒక తిరుగులేని ఉదాహరణ. నరేంద్ర మోదీ 2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు ఆయనపై మొట్టమొదట తిరుగుబాటు చేసింది బిహార్‌ ముఖ్యమంత్రే కాదూ? మోదీ ఉన్నతిని ప్రతిఘటించిన నితీశ్‌ కుమార్‌ ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఒక ‘మతతత్వ’ శక్తికి వ్యతిరేకంగా, దానిని సమర్థంగా అడ్డుకోగల ఒక లౌకికశక్తిగా తనను తాను ఆయన నిలుపుకున్నారు. అయితే 2002 గుజరాత్‌ మారణ కాండ నాటి నుంచి రగులుతున్న సైద్ధాంతిక ఘర్షణతో పాటు, పెరుగుతున్న వైయక్తిక పోటీ కారణంగానే ఆనాడు ఎన్డీఏ నుంచి నితీశ్‌ నిష్క్రమించారని చెప్పక తప్పదు. 2013లో ‘సద్భావన యాత్ర’ సందర్భంగా టోపీ పెట్టుకునేందుకు మోదీ నిరాకరించడంపై నితీశ్‌ ఇలా ప్రతిస్పందించారు: ‘దేశాన్ని పరిపాలించేందుకు ప్రతి ఒక్కరినీ మీతో కలుపుకోవాలి.. అందుకు కొన్ని సందర్భాలలో టోపీ ధరించాల్సి ఉంటుంది... మరికొన్ని సమయాలలో నుదుట తిలకం పెట్టుకోవాల్సి ఉంటుంది.’ నితీశ్‌ అలా తన ‘మృదు’ రాజకీయ లౌకికవాదాన్ని నిర్వచించారు. మోదీ బ్రాండ్‌ హిందూత్వ, తన లౌకికవాదం మధ్య వ్యత్యాసాన్ని ఆయన ఆ విధంగా చాటి చెప్పారు.


నితీశ్‌, మోదీ నాయకత్వ శైలులు పరస్పర విరుద్ధ మైనవి. పన్నెండు సంవత్సరాల అనంతరం, ఈ పరస్పర విరుద్ధాల ఘర్షణలో విజేతగా మోదీ వెలుగొందుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని నిర్మించి, దాని నాయకుడుగా ప్రధానమంత్రి నాయకత్వాన్ని సవాల్‌ చేసిన నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు మోదీ దర్బార్‌లో ఒక సామంతుడుగా ఉన్నారు! క్షీణిస్తున్న ఆరోగ్యంతో నిస్సహాయుడైపోయిన నితీశ్‌ మోదీ మహాశక్తిని కనీసమాత్రంగానైనా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మోదీకి పూర్తి మద్దతుదారుగా మారిపోయారు. అయితే ముస్లింల సంక్షేమం పట్ల తమ నాయకుడి నిబద్ధతలో ఎటువంటి మార్పులేదని నితీశ్‌ అనుయాయులు వాదిస్తున్నారు. అయితే ఇవన్నీ పసలేని మాటలే. జనతాదళ్‌(యు) రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల్లో ఆ సంక్షేమ సంకల్పాలకు అంతకంతకూ ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీకి నితీశ్ కుమార్‌ ఒక ఆవశ్యక మిత్రుడు. ఒక ఉపయోగకరమైన రాజకీయ చిహ్నం. వచ్చే నవంబర్‌లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో తమ బలాన్ని పెంపొందించుకునేందుకు నితీశ్‌ మద్దతు అవసరం చాలా ఉంది.


చంద్రబాబు నాయుడి రాజకీయ పరిణామం భిన్నమైనది. అదొక క్లిష్టమైన అధ్యయన అంశం. బీజేపీకి చెప్పుకోదగిన ప్రజాబలం లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి. పరిపాలనా ప్రజ్ఞ ఉన్న నాయకుడు. రాజకీయ అనుభవమూ అపారంగా ఉన్న నేత. బీజేపీపై ఏ మాత్రం ఆధారపడవలసిన అవసరం లేకుండానే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొనసాగగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నది. మరి ఇదే నాయకుడు 2019లో నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రిని ఒక ‘ఉగ్రవాది’ అని కూడా ఆ చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు మొదటి నుంచీ కేంద్రంతో ‘ఒప్పందాల ఆధారితమైనవిగానే ఉన్నాయి. 1990ల నాటి సంకీర్ణ రాజకీయాల యుగంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి, వాజపేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారు, ఆ ప్రభుత్వాలను నిలబెట్టిందీ చంద్రబాబే. ఇప్పుడు అవశేష ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కూడా కేంద్రంతో ఇప్పుడూ గతంలో వలే ఒక ‘ఒప్పందం’ కుదుర్చుకున్నారు. ఆర్థిక వనరులు కొరవడిన ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ఠ స్థాయిలో ఆర్థిక సహాయమందించాలన్నదే చంద్రబాబు షరతు. ఆ ఆర్థిక తోడ్పాటు కోసమే వివాదాస్పద చట్టం విషయంలోనూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి గట్టి దన్నుగా నిలిచారు.

నితీశ్‌, నాయుడు ఇరువురూ ఒక విధంగా రాజకీయ మనుగడను ఒక కళగా రూపొందించారు, సాధన చేస్తున్నారు. సమయానుకూలంగా, రాజకీయ అవసరాలకు తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకుని పట్టువిడుపులతో వ్యవహరించడం వల్ల అధికారంలో సుదీర్ఘకాలం కొనసాగడం సుసాధ్యమవుతుందనేది ఇరువురి అనుభవ పాఠం. అయితే నితీశ్‌, నాయుడి రాజకీయ ఎంపికలు సమకాలీన రాజకీయాలకు ఆధారంగా ఉన్న లౌకిక–మతతత్వ విభజనపై ఒక ఇబ్బందికరమైన ప్రశ్నార్థకాన్ని ఉంచుతున్నాయి. దృఢ విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించడం కాకుండా స్వప్రయోజనాలు సాధించుకోవడమే ప్రధానమైపోయిన మన రాజకీయ వ్యవస్థలో నిబిడీకృతంగా ఉన్న కాపట్యాలను అవి బహిర్గతం చేస్తున్నాయి. నిర్వివాదమైన ఒక రాజకీయ సత్యాన్ని ఆ ఇరువురి దృక్పథాలు పునరుద్ఘాటిస్తున్నాయి: ‘నిర్దిష్ట అంశాలపై మీ వైఖరి ఏమిటి అనే దానిపై మీ అధికార భవితవ్యం అనేది ఆధారపడి ఉన్నది’. ఈ రాజకీయ ప్రక్రియలో లౌకిక రాజ్యాంగ విలువలు క్రమంగా నిరర్థకమైపోయాయి. ఇండియా కూటమితో ఉన్నప్పడు ‘లౌకికవాది’ అయిన నితీశ్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలిపిన తరువాత మతతత్వవాది ఎలా అయ్యారు? చంద్రబాబుకూ ఈ ప్రశ్న వర్తిస్తుంది.


ఈ నేపథ్యంలో మనకు మిగిలింది అవకాశవాద ‘లౌకిక’ రాజకీయాలే. సూక్ష్మ తేడాలతో అందరూ ఈ సంకుచిత రాజకీయాలనే అనుసరిస్తున్నారు. అయినా రాజకీయాలలో మత ప్రమేయాన్ని వ్యతిరేకిస్తుంటారు. స్వీయ ప్రయోజనాలకు మతతత్వవాదులతో రాజీ పడేందుకు వెనుకాడరు. అధికార లబ్ధే కదా అందరి పరమ ధ్యేయం! మత ప్రమేయం లేని, మతతత్వ రాజకీయాలను సమయానుకూలంగా సమరీతిలో ఆచరించడాన్ని ఒక కళగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్‌ పరిపూర్ణత సాధించింది. షాబానో కేసు సందర్భంలో ఇస్లామిక్‌ ఛాందసవాదుల ఒత్తిళ్లకు లొంగిపోయి, వారు అభిలషించిన విధంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ ఆ తరువాత హిందూత్వ వాదులను సానుకూలం చేసుకునేందుకు బాబ్రీ మసీదు గేట్లు తెరిపించింది. పర్యవసానంగా జరిగిందేమిటో మనకు తెలిసిన చరిత్రే. ఇక సోషలిస్టులు, విస్తృత జనతా పరివార్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకతే ఊపిరి. ఆ జాతీయ రాజకీయ పక్షాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించే ఈ సోషలిస్టులు లౌకిక రాజకీయాలకు నిష్ఠగా నిబద్ధమయ్యారా? కాంగ్రెస్‌ అధికారంలో లేకుండా చేయడమే వారి లక్ష్యం. అందుకు బీజేపీతో జట్టు కట్టేందుకు సోషలిస్టులు, ఇతర జనతా పరివార్‌ ఎప్పుడూ వెనుకాడలేదు. ఇక ముందూ వెనుకాడబోరని నిశ్చితంగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే మొదలైనవి గతంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నాయి. ఎందుకు? కేంద్రంలో అధికారం చెలాయించేందుకే సుమా! వామపక్షాలు మాత్రమే మతోన్మాద రాజకీయాలను స్థిరవైఖరితో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే అవి ఇప్పుడు ఇంచుమించు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోయాయి ప్రజాదరణ కోల్పోతున్నాయి. జాతీయ పాలకపక్షాన్ని, దాని ఆధిపత్య కథనాలను ఎంతమాత్రం సవాల్‌ చేయగల పరిస్థితిలో లేవు.


ఈ శోచనీయ పరిస్థితుల్లో, అవును, ఈ శోచనీయ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక అజేయశక్తిగా ఆవిర్భవించింది. లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ ఇప్పుడు ఇస్లామిక్‌ మతాచరణలను ‘సంస్కరించే’ కర్తవ్య పాలనకు పూనుకున్నది. ఇతర మతాలు అన్నిటినీ నిరాదరించే, తరచు వాటి పట్ల విద్వేషాన్ని వెళ్లగక్కే హిందూత్వ మెజారిటేరియన్‌ ప్రపంచ దృక్ఫథాన్ని సంఘటితం చేస్తూనే ‘పేద’ ముస్లింల ప్రయోజనాల పరిరక్షణ గురించి ఆరాటపడుతోంది. బీజేపీ సర్వాధికారాన్ని సమర్థంగా ఎదుర్కోగల వారు బలహీనపడ్డారు. లేదా తమ ప్రత్యర్థితో పూర్తిగా రాజీపడ్డారు. ఏ విధంగాను ప్రతిఘటించలేకపోతున్నారు. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా రూపొందించిన కొత్త వక్ఫ్‌ చట్టంలో కీలక సవరణలు తెచ్చేందుకు తమ నాయకులు చొరవ తీసుకున్నారని నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు వాదిస్తున్నారు. అవునా? భారత లౌకిక ప్రజాస్వామ్య దర్పణం పూర్తిగా పగిలిపోయింది. నితీశ్‌, నాయుడు ఇరువురూ చెల్లాచెదురుగా పడిపోయిన గాజు ముక్కలలో అప్పుడప్పుడూ తమను తాము క్షణకాలం పాటు చూసుకోవలసిన అవసరమున్నది. విరూపమైన ప్రతిబింబాలు వారికొక వాస్తవాన్ని గుర్తుచేస్తాయి. సకల మతాల సమానత్వాన్ని సూత్రబద్ధంగా సమర్థించిన తామిరువురూ మత వివక్షా రాజకీయాలు రాజ్యమేలేందుకు ఎంతగా దోహదం చేస్తోందీ పగిలిన లౌకిక ప్రజాస్వామ్య అద్దం ముక్కలు వారికి స్పష్టంగా ఎరుకపరుస్తాయి.


తాజా కలం: 2013లో నితీశ్‌ కుమార్‌ ఎన్డీఏ నుంచి నిష్క్రమించినప్పుడు ఆయనను తొట్ట తొలుత ఇంటర్వ్యూ చేసిన అవకాశం నాకు లభించింది. ఎన్డీఏ నుంచి ఎందుకు వైదొలిగారు అన్న ప్రశ్నకు ఆయన వెన్వెంటనే ఇలా ప్రతిస్పందించారు: ‘‘ఒక ‘నియంత’తో కలిసి పనిచేయలేను.’’ మరి ఇప్పుడు తన దయనీయ పరిస్థితి గురించి నితీశ్‌ ఎటువంటి వివరణ ఇస్తారో?!

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 05:13 AM