ధరిత్రికి ట్రంప్ తాపం!
ABN , Publish Date - Apr 04 , 2025 | 02:05 AM
‘ఇది శక్తి పరివర్తన (శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడడానికి మారడం)కు సమయం కాదు, ఇది శక్తి జోడింపు (కొత్త ఇంధన వనరులు, సాంకేతికతల అభివృద్ధి)కు తరుణమిది’ అని అమెరికా...

‘ఇది శక్తి పరివర్తన (శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడడానికి మారడం)కు సమయం కాదు, ఇది శక్తి జోడింపు (కొత్త ఇంధన వనరులు, సాంకేతికతల అభివృద్ధి)కు తరుణమిది’ అని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శికి క్రిస్ రైట్ ఉద్ఘాటించారు. గత నెల హ్యుస్టన్‌లో ఒక అంతర్జాతీయ ఇంధన సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇంధన కంపెనీల అధిపతులు ఆ రంగ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఆ వార్షిక అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న నాకు మన ప్రపంచం మారిపోయిందన్న వాస్తవం అవగతమయింది. అయినప్పటికీ వాతావరణ మార్పును తిరస్కరిస్తున్న విధానాలు ఎందుకు ప్రాబల్యం పొందుతున్నాయో అర్థం చేసుకోవలసి ఉన్నది. విధ్వంసకర వాతావరణ మార్పు ప్రభావాలను అరికట్టేందుకు శ్రద్ధ చూపకపోతే మానవాళి భవిష్యత్తు ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విపత్కర వాతావరణ వాస్తవాలను గుర్తించకుండా ఊహాలోకంలో ఉండిపోతే ఎలా? ట్రంప్ ప్రభుత్వ ఇంధన విధానం అమెరికా, ఇతర సంపన్న పాశ్చాత్య సమాజాలలో గానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల సమాజాలలో గానీ భారీ మార్పులకు దారితీయదు.
అమెరికా విధానాలలో మార్పుకు కారణాలు ఏమిటి? మొదటిది అమెరికా ప్రభుత్వం 36 లక్షల కోట్ల డాలర్లకు పెరగడం. రక్షణ రంగంపై చేస్తున్న వ్యయాల కంటే వడ్డీ చెల్లింపులకే ఎక్కువగా ఖర్చు చేయవలసివస్తోంది! ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు మార్గం పునః పారిశ్రామికీకరణే గానీ పారిశ్రామిక కార్యకలాపాలను, సామర్థ్యాన్ని తగ్గించుకోవడం ఎంత మాత్రం కాదని క్రిస్ రైట్ స్పష్టం చేశారు. ఈ కారణంగా ఆన్ షోర్ తయారీ (దేశంలోనే సరుకులను ఉత్పత్తి చేయడం)కి అగ్ర ప్రాధాన్యమిస్తున్నారు. మరి దేశంలో పెరిగే పారిశ్రామిక కార్యకలాపాలకు మరింత అధికంగా విద్యుత్ అవసరమవుతుంది. రెండో కారణం అనేక కొత్త రంగాలలో చైనా అగ్రగామిగా పురోగమించడం. సరఫరా గొలుసుల నుంచి విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేయడం, సౌర శక్తి ఉత్పాదనలోను చైనా తిరుగులేని రీతిలో అగ్రగామిగా ఉన్నది. కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్య పోటీలో ఎట్టి పరిస్థితులలోను చైనాకంటే వెనుకబడి పోకూడదని ట్రంప్ ప్రభుత్వం సంకల్పించుకున్నది. మరి ఈ పోటీలో నెగ్గాలంటే ఇంధన సాంద్ర డేటా సెంటర్‌లను ఇంతకు ముందు కంటే మరింత వేగవంతంగా నిర్మించుకోవలసి ఉన్నది. అమెరికాలో ఇప్పుడు 5000 డేటా సెంటర్‌లు ఉన్నాయి. ఇవి అమెరికాలోని మొత్తం గ్రిడ్ –ఆధారిత విద్యుత్‌లో 3 శాతాన్ని వినియోగించుకుంటున్నాయి. ఈ విద్యుత్ వినియోగం త్వరలోనే మరింత భారీ స్థాయిలో పెరిగిపోయే అవకాశమున్నది. ఈ దశాబ్దం తుది సంవత్సరాల నాటికే డేటా సెంటర్‌లు వినియోగించుకునే విద్యుత్ 8 నుంచి 12 శాతం మేరకు పెరిగిపోయే అవకాశమున్నది. ఇందుకు విద్యుదుత్పత్తిని గణనీయంగా పెంచవలసిన అవసరమున్నది.
మరి విద్యుదుత్పత్తిని భారీ స్థాయిలో పెంచేందుకు వనరులు ఏమిటి? విద్యుత్ సరఫరాకు సౌరశక్తి, పవనశక్తి మొదలైన పునరుత్పాదక వనరులపై ఆధారపడే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రభుత్వం తెగేసి చెప్పుతోంది. అమెరికాకు అవసరమైన విద్యుత్‌లో కేవలం 3 శాతాన్ని మాత్రమే పునరుత్పాదక వనరుల ద్వారా సమకూరుతుందని క్రిస్ రైట్ చెప్పారు. ఆ తరహా విద్యుదుత్పత్తికి భారీ పెట్టుబడులు పెట్టి నప్పటికీ ప్రయోజనం లేకపోయిందని కూడా ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో శక్తి పరివర్తన అనేది జరిగేది కాదని ఆయన ముక్తాయించారు. అయితే గత ఏడాది అమెరికాలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పాదన అధిగమించింది. అమెరికాకు అవసరమైన విద్యుత్‌లో 15 నుంచి 17 శాతం మేరకు పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా ఉత్పత్తి అవుతోంది.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టకముందు అధికారంలో ఉన్న జోబైడెన్ ప్రభుత్వం దూరదృష్టి లేకుండా వాతావరణ మార్పును నిరోధించేందుకు ప్రాధాన్యమిచ్చి అందుకనుగుణమైన ఇంధన విధానాలను అనుసరించిందని, ఈ కారణంగానే విద్యుత్ వ్యయం భారీగా పెరిగిపోయిందని ట్రంప్ ప్రభుత్వ అధికారులు విమర్శిస్తున్నారు. విద్యుదుత్పత్తికి శిలాజ ఇంధనమైన సహజ వాయువును గరిష్ఠంగా వినియోగించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం సంకల్పించింది (బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని కూడా విరివిగా చేపట్టే ఆలోచన కూడా చేస్తున్నారు). మరి సహజ వాయువును విద్యుదుత్పత్తికి వినియోగించుకోవడమంటే హరిత గృహ వాయువుల ఉద్గారాలు పెరిగిపోవడం ఖాయం. అయితే కార్బన్ మోనాక్సైడ్ (పరిసరాలను కలుషితం చేసే వాయువు)లా కార్బన్ డై ఆక్సైడ్ కాదని కాలుష్యకారక వాయువు కాదని క్రిస్ రైట్ అన్నారు. ఒకటి మాత్రం వాస్తవం: అమెరికా ప్రణాళికలలో వాతావరణ మార్పును నిరోధించేందుకు ప్రాధాన్యం లేదు.
సహజ వాయువును పెద్ద ఎత్తున ఎగుమతి చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వమున్నది. దీనివల్ల భారత్ లాంటి దేశాలలో విద్యుదుత్పత్తికి బొగ్గు బదులు సహజ వాయువు వినియోగం అధికమవుతుందని, తద్వారా కాలుష్యకారక వాము ఉద్గారాలు తగ్గతాయని, వాతావరణ మార్పును అరిట్టేందుకు దోహదం జరుగతుందని ట్రంప్ ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు (బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిలో కంటే సహజవాయువు ఆధారిత విద్యుదుత్పత్తిలో ఉద్గారాలు తక్కువగా ఉంటాయి). సహజవాయువు ఉత్పత్తి, వినియోగం ద్వారా మిథేన్ ఉద్గారాలను తగ్గించేందుకు పెట్టుబడులు పెట్టే విషయం కూడా పరిశీలనలో ఉన్నది. అయితే ట్రంప్ ప్రభుత్వంలో వాతావరణ మార్పునిరోధాన్ని గట్టిగా పట్టించుకునే అధికారి ఒక్కరూ లేరు అన్నది వాస్తవం. అణు విద్యుదుత్పత్తిని ఇతోధికంగా పెంచే విషయమై అమెరికా మళ్లీ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఉదజని విద్యుత్ (హైడ్రోజన్ పవర్)ను అభివృద్ధిపరుచుకునే ప్రణాళికలు ఏవీ సఫలం కాలేదు. దీంతో బ్రౌన్ ఎనర్జీపై ఆధారపడడానికి ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకున్నది.
ఇక్కడే అసలు సమస్య ఉంది. 2030 సంవత్సరం నాటికి తమ హరిత గృహ వాయువుల ఉద్గారాలను 50 శాతం మేరకు తగ్గిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఆ హామీ సంగతి ఏమోగానీ అమెరికాలో ఆ ఉద్గారాలు మరింతగా పెరిగిపోయే అవకాశం స్పష్టంగా ఉన్నది. దీనివల్ల గ్లోబల్ కార్బన్ బడ్జెట్‌లో అమెరికా వాటా మరింతగా పెరిగిపోవడం ఖాయం. నిజానికి శిలాజ ఇంధనాల వాడకాన్ని అమెరికా లాంటి దేశాలు సత్వరమే పూర్తిగా తగ్గించుకోవాలి. అందుకు మారుగా వాటి వినియోగాన్ని మరింతగాపెంచుకోవడానికి అమెరికా సంసిద్ధమయిది. మానవాళికి వాతావరణ మార్పు విపత్తును నివారించాలంటే ప్రపంచ ఉష్టోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండాలి. అమెరికా బ్రౌన్ ఎనర్జీ విధానంతో ఆ లక్ష్య సాధన దాదాపుగా అసాధ్యం. ముంచుకువస్తోన్న ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలనే నేను ఇది రాస్తున్నాను. వాస్తవాలను విస్మరించి గాలి మేడలు కట్టుకోకూడదు. చారిత్రకంగా గరిష్ఠంగా కాలుష్యకారక వాయు ఉద్గారాలకు, ఏటా హరిత గృహ వాయువుల ఉద్గారంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న అమెరికా బ్రౌన్ ఎనర్జీ విధానం (శిలాజ ఇంధనాలను అథ్యధికంగా వినియోగించుకోవడం) పర్యవసానాలు భయానకంగా ఉంటాయి.. మనం ఏమి చేయాలి?
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News