Weight Loss: బరువు తగ్గడానికి 30-30-30 పద్ధతి సరైనదేనా..
ABN , Publish Date - Feb 25 , 2025 | 07:11 AM
సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి ఎన్నో చిట్కాలు ఉంటాయి. అందులో ఒకటి 30-30-30 పద్ధతి. అయితే, బరువు తగ్గడానికి ఈ చిట్కా మంచిదా.. చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి కొంత మంది చాలా కష్టపడతారు. వాకింగ్, డైట్ వంటివి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి కనిపించే ప్రతి చిట్కాలను ట్రై చేస్తారు. ఇటీవల వైరల్ అవుతున్న 30-30-30 పద్ధతిని చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పద్ధతిలో 30 గ్రాముల ప్రోటీన్, 30 నిమిషాల నడక, 30 నిమిషాల మితమైన వ్యాయామం ఉంటాయి. అయితే, ఈ 30-30-30 పద్ధతి ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
30-30-30 ఎలా పని చేస్తుంది?
అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. 30-30-30 నియమం ప్రకారం అల్పాహారంలో 30 గ్రాముల ప్రోటీన్ చేర్చాలి. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇందులో లీన్ మాంసం, గుడ్లు, పాలు, గింజలను చేర్చడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. అలాగే, దీనితో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లను కూడా తీసుకోవాలి.
30 నిమిషాల నడక
బరువు తగ్గాలని అనుకునే వారు వాకింగ్ క్రమం తప్పకుండా చేయాలి. ఉదయాన్నే 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా త్వరగా బరువు తగ్గుతారు.
30 నిమిషాల వ్యాయామం
మీరు ప్రతిరోజూ సరిగ్గా 30 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఆరోగ్యంలో పెద్ద మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. 30 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఇది అధిక బరువు సమస్యలను నివారించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది.
నిపుణులు ఏమంటున్నారంటే..
అధిక ప్రోటీన్ (30%) కండరాల మరమ్మత్తు, సరైన జీవక్రియకు సహాయపడుతాయి. ఇది అతిగా తినే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు (30%) కణాల పనితీరు, హార్మోన్ల ఉత్పత్తికి ముఖ్యమైనవి. అవి మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. కార్బోహైడ్రేట్లు (30%) శక్తిని అందిస్తాయి. మెదడు పనితీరుకు ఇవి కీలకమైనవి. కానీ, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లపై (తృణధాన్యాలు, కూరగాయలు వంటివి) దృష్టి పెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తినడం చాలా ముఖ్యం. 30-30-30 డైట్ ని సరిగ్గా పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: పెరిగిన ఉష్ణోగ్రత.. కర్నూలులో 38.2 డిగ్రీలు