మధుమేహం ఉన్నవారు చెరుకురసం తాగొచ్చా..
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:19 PM
షుగర్.. నియంత్రణలో లేకపోతే... మనిషిని దెబ్బతీసే వ్యాధుల్లో ఇదీ ఒకటి. అయితే.. ఈ మధుమేహం ఉన్నవారు చెరుకురసం తాగొచ్చా.. లేదా అన్నదానిపై వైద్య నిపుణులు స్పష్టత ఇస్తునంనారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి మరీ..

చెరుకు రసం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి? మధుమేహం ఉన్న వారు కూడా తీసుకోవచ్చా?
- లత కర్నాటి, కృష్ణాపురం
సాధారణంగా ఎండాకాలంలో ఉపశమనం కోసం చెరుకు రసం తాగుతుంటాం. తాజా చెరుకు రసంలో కనీసం పదిహేను శాతం చక్కెర ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు ఉంటాయి. ఇందులో పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చెరుకు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వింటుంటాం. అయితే అధిక శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు, కాలేయానికి సంబంధించిన అనారోగ్య కారణాలతో కొవ్వు పదార్థాలు తినకూడని వారందరూ శక్తి కోసం రోజూ చెరుకురసం తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి రక్తపోటు ఉన్నవారు అపుడప్పుడు తాగవచ్చు. అయితే ఒక్క గ్లాసు చెరుకురసంలో నాలుగైదు స్పూన్లకు మించి చక్కెర ఉంటుంది. కాబట్టి ఈ ద్రావకాన్ని తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
తెలుగు ఇళ్లల్లో తరచుగా ఉప్మా చేసుకుంటాం. ఉప్మాలో ఎంత వరకు పోషకాలు ఉంటాయి?
- అమర్, గుంతకల్లు
ఉప్మా సాధారణంగా తెల్ల గోధుమ రవ్వ లేదా ఎర్ర గోధుమ రవ్వతో తయారు చేస్తారు. తెల్ల రవ్వను గోధుమల పైపొట్టు, పోషకాలు ఉండే జెర్మ్ భాగాన్ని తొలగించిన తరువాత మిల్లు పట్టడం ద్వారా తయారు చేస్తారు. ఈ భాగాలు తొలగించడం వల్ల మైదా పిండిలా అనిపిస్తుంది. ఈ తెల్ల గోధుమ రవ్వలో కూడా పిండి పదార్థాలు, కొద్దిగా ప్రొటీన్ తప్ప పెద్దగా విటమిన్లు, ఖనిజాలు మొదలైన పోషకాలు ఉండవు. ఎర్ర గోధుమ రవ్వ తయారీలో గోధుమ గింజలను నూకగా చేస్తారు. పోషకాలు ఉండే జెర్మ్ భాగం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ రవ్వలో పిండి పదార్థాలతో పాటు పీచు పదార్థాలు, వివిధ బీ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
తెల్ల గోధుమ రవ్వకంటే ఎర్ర గోధుమరవ్వ గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే రక్తంలో గ్లూకోజు నియంత్రణకు కూడా ఈ గోధుమరవ్వే మంచిది. ఎప్పుడైనా ఓసారి ప్రత్యేక సందర్భాల్లో తెల్ల గోధుమ రవ్వ వాడినా తరచూ ఉప్మా తయారీకి ఎర్ర గోధుమరవ్వే సరైన ఎంపిక. ఇంకా రవ్వతో పాటు ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉపయోగిస్తే పీచు పదార్థాలు, విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి. అయితే నూనె మాత్రం తక్కువగా ఉపయోగించాలి.
మార్కెట్లో ఈ మధ్య వివిధ రకాల ఖర్జూరాలు లభిస్తున్నాయి కదా. పోషకాల విలువలు అన్నిట్లో ఒకేలా ఉంటాయా లేక మారతాయా? ఇంపోర్టెడ్ రకాలు తీసుకొంటే ఆరోగ్యానికి మంచిదా? రోజుకు ఎన్ని ఖర్జూరాలు తీసుకోవచ్చు?
- ఇఫ్రా, హైదరాబాద్
ఖర్జూరాల మార్కెట్లో ఎక్కువగా మైడ్జుల్, డీగ్లాత్, అజ్వా, ఓమాని మొదలైన రకాలు విరివిగా లభిస్తున్నాయి. వీటన్నింటిలో పోషక విలువల్లో కొంత తేడాలు ఉంటాయి. కానీ, అన్నింటిలోనూ పిండిపదార్థాలు ఎక్కువే. ముఖ్యంగా, ఎక్కువ వాడకంలో ఉండే ఓమని, మైడ్జుల్ రకాలలో డెబ్బై ఐదు శాతం మించి పిండి పదార్థాలు ఉంటాయి. అధిక మొత్తంలో ఈ ఖర్జూరాలను తిన్నప్పుడు రక్తంలో చక్కర స్థాయి పెరిగేందుకు ఇవి కారణమవుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఖర్జూరాల రకమేదైనా ఒకటి లేదా రెండుకు మించి తీసుకోకపోవడం మంచిది. ఖర్జ్జూరాల్లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. కానీ ఒకటి లేదా రెండు తీసుకున్నప్పుడు ఈ ఖనిజాలు శరీరానికి సరిపడే మొత్తంలో అందవు. కాబట్టి ఖనిజాల కోసం ఖర్జూరాలపై ఆధారపడకుండా మిగిలిన ఆహారంలో ఇవి అందేలా చూసుకోవాలి. సాధారణంగా మన దేశంలో దొరికే ఖర్జ్జూరాల్లో అధిక శాతం ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి దిగుమతి చేసుకునేవే ఉంటాయి. ఎటువంటి రకమైన ఖర్జూరాలైనా ఆ పండ్ల పరిమాణాన్ని బట్టి రోజుకు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్