Share News

Chiken V/s Fish: చికెన్ వర్సెస్ చేప.. ఏది ఆరోగ్యకరం..

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:54 PM

చాలా మంది చికెన్, చేపలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెండింటిలోనూ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

Chiken V/s  Fish: చికెన్ వర్సెస్ చేప.. ఏది ఆరోగ్యకరం..
Chicken

చాలా మందికి శాఖాహారం కంటే మాంసాహారమంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ఆదివారాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చికెనో, మటనో కచ్చితంగా ఉండి తీరాల్సిందే. మాంసాహారాల్లో చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్డు, రొయ్యలు ఇలా పలు రకాలు ఉంటాయి. అయితే, వీటిలో చాలా మంది ఎక్కువగా చికెన్, చేపలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఈ రెండింటిలోనూ మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఆరోగ్య ప్రయోజనాలు:

చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే శరీర పెరుగుదల బాగుండడంతో పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు. డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని చికెన్ చాలా వరకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చికెన్ తింటే చాలా మంచిదని సూచిస్తున్నారు. అయితే, చికెన్‌ను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్‌ను ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌కు బదులుగా నాటుకోడి తింటే మంచిదని చెబుతున్నారు. కోడి మాంసంలో విటమిన్ బి3, జింక్, సెలీనియం, ఐరన్‌లు అధికంగా ఉంటాయి.


చేపల ఆరోగ్య ప్రయోజనాలు

సాధారణంగా సీ ఫుడ్ చాలా ఆరోగ్యకరం. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు ఎంతగానో సహాయపడుతాయి. దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. వారానికి రెండు సార్లు సీ ఫుడ్ తింటే హెల్తీగా ఉంటారు. సముద్ర చేపలు తింటే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా, కళ్లు బాగా కనిపిస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తింటే ఎముకల అరుగుదల తగ్గడంతో పాటు రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది.


చేప - చికెన్.. ఏది బెస్ట్?

చికెన్, చేప రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఈ రెండూ మన ఆరోగ్యానికి మంచివే. అందుకే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే చెప్పడం కష్టం. అయితే, చికెన్‌లో ఐరన్, జింక్, సెలీనియంలు అధికంగా ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా-3 మెండుగా ఉంటాయి.

చికెన్, చేప ఈ రెండూ కూడా ప్రోటీన్లకు మంచి వనరులు. కాబట్టి మీకు ఏ పోషకాలు ఎక్కువగా కావాలో ఆ ఆహారాన్ని బాగా తీసుకోండి. కానీ, తరచుగా మాత్రం ఎక్కువగా తినకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read: మార్కెట్లోకి నిషేధిత చైనా యాప్స్.. ఎంతకు తెగించార్రా

Updated Date - Feb 12 , 2025 | 02:04 PM