Share News

కీర.. సమ్మర్ కూలర్

ABN , Publish Date - Apr 13 , 2025 | 08:18 AM

మనలో కీర దోసకాయ అంటే తెలియని వారుండరు. అయితే.. దానివల్ల ఒరగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. ప్రస్తుత వేసవి సీజన్ వచ్చేసింది. ఈ వేసవిలో కీరదోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కీర.. సమ్మర్ కూలర్

ఎర్రటి ఎండల్లో సహజంగానే దాహార్తిని తీర్చేవాటి వైపు మనసు లాగుతుంది. చల్లదనాన్నిచ్చే పండ్లు, పానీయాలు, ఆహారపదార్థాలు తీసుకోవాలనిపిస్తుంది. వాటన్నింటిలో అతి చవకైనది, అందరికీ అందుబాటులో ఉండేది కీరదోస. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కీరను పచ్చిగా లేదా సలాడ్ల రూపంలో తీసుకునేందుకు ఇష్టపడతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా లభించే ఈ కీర... ఎక్కడైనా సరే, ఒక్కమాటలో చెప్పాలంటే... సమ్మర్‌ కూలర్‌...

మండే ఎండల్లో కీరదోస చూడగానే మనసును చల్లదనం చుట్టేస్తుంది. వేసవి తాపం తీరినట్టుగా అనిపిస్తుంది. పచ్చిగానే కాకుండా, కీరను సలాడ్‌గా లేదంటే చట్నీ చేసుకుని తినొచ్చు. ఎలా తిన్నా శరీరానికి కావాల్సిన నీరు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 47 లక్షల టన్నుల కీర పండుతోందని లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా పండిస్తున్న దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది. 81.6 శాతం కీరదోస పంట ఒక్క చైనాలోనే సాగవుతోంది. ఆ తరువాతి స్థానాల్లో టర్కీ, రష్యా ఉన్నాయి. కీరదోసను మూడు వేల ఏళ్ల క్రితమే మనదగ్గర పండించారని చెబుతారు. భారత ఉపఖండంలో అతి పురాతన పంటగా దీనికి గుర్తింపు ఉంది. అయితే కొంతమంది పరిశోధకులు మాత్రం ఆఫ్రికా, ఈజిప్టు నుంచి ఇతర దేశాలకు విస్తరించిందని చెబుతారు.


ఎన్నో రకాలు...

మామిడి, పుచ్చకాయల్లో అనేక రకాలున్నట్టే కీరదోస కాయల్లో కూడా అనేక రకాలున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో సైజులో లభిస్తాయి. కొన్ని చోట్ల పొడవుగా పొట్లకాయలా కనిపిస్తే, మరి కొన్నిచోట్ల చిన్నగా, దొండకాయల్లాగా ఉంటాయి. వాటిలో కొన్ని...

విత్తనాల్లేని కీర: ఈ రకాన్ని ‘ఇంగ్లీష్‌ కుకుంబర్‌’ అని, ‘సీడ్‌లెస్‌ కుకుంబర్‌’ అని అంటారు. ఇందులో విచిత్రంగా విత్తనాలు ఉండవు. పొడవుగా, సన్నగా ఉంటాయి. మిగతావాటితో పోల్చితే కాస్త తియ్యగా ఉంటాయి. వీటిని పొట్టు తీయకుండానే తినొచ్చు. సలాడ్స్‌, శాండ్‌విచ్‌లోకి బాగుంటాయి.

పర్షియన్‌ కీర: ఇవి చిన్నగా ఉంటాయి. ఐదారు అంగుళాల పొడవు పెరుగుతాయి. పొట్టు పలుచగా ఉంటుంది. సలాడ్స్‌లోకి, స్లైసెస్‌లాగా కట్‌ చేసుకుని తినడానికి బాగుంటుంది. వీటితో చట్నీ కూడా తయారుచేసుకోవచ్చు.


ఊరగాయ స్పెషల్‌: ఈ కీరను ‘కిర్బీ కీరదోస’ అని, ‘పిక్లింగ్‌ కీర’ అని పిలుస్తారు. ఇవి ఇంగ్లీష్‌ కుకుంబర్‌ కంటే చిన్నగా, కాస్త మందంగా ఉంటాయి. వీటిని ఊరగాయల తయారీకి ఎక్కువగా వాడతారు.

book2.2.jpg

లెమన్‌ కీర: పసుపు రంగులో ఉండే కీరదోస ఇది. కొద్దిగా నిమ్మరుచిని కలిగి ఉంటాయి. సలాడ్స్‌, సూప్స్‌లో వీటిని ఎక్కువగా వాడతారు. రీఫ్రెషింగ్‌ స్నాక్స్‌గానూ ఉపయోగిస్తారు.

స్నేక్‌ కీర: ఈ రకాన్ని ‘ఆర్మేనియన్‌ కుకుంబర్‌’ అని, ‘స్నేక్‌ కుకుంబర్‌’, ‘స్నేక్‌ మెలన్స్‌’ అని... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మిగతా కీరదోసలతో పోలిస్తే ఇవి రూపంలో, రుచిలోనూ భిన్నంగా ఉంటాయి. పొడవుగా, లేత ఆకుపచ్చ రంగులో... తియ్యగా, రీఫ్రెషింగ్‌ రుచితో ఉంటాయి. సలాడ్స్‌లో ఎక్కువగా వాడతారు.


జపనీస్‌ కీర: సన్నగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొద్దిగా స్వీట్‌ ఫ్లేవర్‌ ఉంటుంది. జపనీస్‌ వంటకాలలో, సలాడ్స్‌లో వాడతారు. రకరకాల డిషెస్‌లో గార్నిష్‌ కోసం ఉపయోగిస్తుంటారు.

స్లైసెస్‌ కీర: ఈ కీరాను సలాడ్స్‌, బర్గర్స్‌, శాండ్‌విచ్‌లలో వాడతారు. తాజా రుచిని కలిగి, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. 7 నుంచి 8 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి.

విదేశీ రకం: బీట్‌ ఆల్ఫా కుకుంబర్‌... మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి దిగుమతి అయిన కీర రకం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ కీరదోసకి మంచి గిరాకీ ఉంది. మీడియం సైజులో ఉంటాయి. స్వీట్‌గా, క్రంచీగా ఉంటుంది. సలాడ్స్‌లో విరివిగా వాడతారు. స్నాక్స్‌గానూ తీసుకుంటారు. పచ్చడి తయారుచేసుకోవడానికి ఈ రకం బాగా నప్పుతుంది.

గెర్కిన్‌ కీరా: చిన్నగా, క్రంచీగా ఉంటాయి. ప్రత్యేకంగా ఊరగాయ తయారీ కోసమే వాడతారు. 3 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. పుల్లగా ఉండే చట్నీ తయారుచేసుకోవడానికి ఇవి బాగా పనికొస్తాయి.


నీరు, పోషకాలు పుష్కలం...

కీరదోసలో నీటితో పాటు అనేక పోషకాలుంటాయి. కీరదోస చేసే మేలు ఏమిటంటే...

- వేసవిలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. కీరలో 96 శాతం నీరు ఉంటుంది. సమ్మర్‌ డైట్‌లో భాగం చేసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.

- కీరలో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ఉండేలా సహాయపడుతుంది.

book2.3.jpg

- వాపును తగ్గించడంలో కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. అంతర్గతంగా ఉన్న వాపును, కండరాల నొప్పిని తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.

- ఆరోగ్యంగా ఉండాలంటే డీటాక్సిఫికేషన్‌ చాలా అవసరం. కీరలో ఉన్న డైయూరిటిక్‌ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్‌ బయటకు పోయేలా చేస్తాయి.

- కీరలో ఉన్న యాంటీఆక్సిడెంట్‌ మిశ్రమాలు చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉండేలా సహాయపడతాయి.


- కీరదోసలో ఉన్న రకరకాల యాంటీ ఆక్సిడెంట్లు... టానిన్స్‌, పాలీఫెనాల్స్‌, ఫ్లావనాయిడ్స్‌ ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ వల్ల కణాలు దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి.

- కీరలో యాంటీ క్యాన్సర్‌ గుణాలున్న మిశ్రమాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మిశ్రమాలను కుకుర్బిటాసిన్లు అని అంటారు. క్యాన్సర్‌ కణాలు తిరిగి ఉత్పత్తి కాకుండా నిరోధించడంలో కుకుర్బిటాసిన్లు సహాయపడతాయి.

- మధుమేహం ఉన్నవారు కూడా కీరా తినొచ్చు. రోజూ కీరా తింటే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయి.

- బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు రోజూ రాత్రి కీరదోస మాత్రమే తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. కీరదోస తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది.

- కీరదోస విత్తనాలు కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ నిర్ణీత స్థాయిలో ఉండేలా సహాయపడతాయి. కీరజ్యూస్‌లో ఉండే ప్లాంట్‌ స్టెరోల్స్‌ అనే మిశ్రమం చెడు కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు తోడ్పడుతుంది.


- కీర దోస గుజ్జును చేతులకు, పాదాలకు పట్టించడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. అలాగే చర్మంపై చేరిక మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి.

- కీరా నోటి దుర్వాసనను పోగొడుతుంది. పొట్టలో ఏర్పడే అధిక వేడి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అయితే రోజూ కీరా తింటే పొట్టలో వేడి తగ్గి నోటి దుర్వాసన పోతుంది.

- కీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి తగిన తేమను అందిస్తాయి. కీర సౌందర్యసాధనంగా కూడా పనికొస్తుంది.

.


కేరాఫ్‌ నాగాలాండ్‌...

నాగాలాండ్‌లో కీరదోసను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేశంలోనే నాణ్యమైన కీరదోస నాగాలాండ్‌లో పండుతోంది. హార్టికల్చర్‌ డిపార్టుమెంట్‌ అధికారులు ఏటా ఇక్కడ రెండు రోజుల పాటు కుకుంబర్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకకి వివిధ గ్రామాల నుంచి కీరదోస సాగు చేసే రైతులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ ఫెస్టివల్‌ దోహదపడుతుందని అధికారులు అంటున్నారు.

కొరియన్‌ రెసిపీ

సాధారణంగా కీరదోసను సలాడ్‌, స్నాక్స్‌గా తీసుకుంటారు. అయితే దీనితో చేసే కొరియన్‌ రెసిపీ చాలా ఫేమస్‌. పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు: కీరదోస, రైస్‌ వెనిగర్‌, ఉల్లిపాయలు, నువ్వుల నూనె, పంచదార, మిర్చి ఫ్లేక్స్‌, తేనె, సోయాసాస్‌.

తయారీ విధానం: కీరదోసను గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలియబెట్టుకుని అరగంట పక్కన పెట్టాలి. తరువాత అందులో వెనిగర్‌, సోయాసాస్‌, తేనె, నువ్వుల నూనె, ఉల్లిపాయలు, పంచదార, మిర్చీ ఫ్లేక్స్‌ వేసి బాగా కలిపి సర్వ్‌ చేయాలి.


కుకుంబర్‌ ఫెస్టివల్‌...

రష్యాలోని సుజ్దల్‌ పట్టణంలో ఏటా ‘కుకుంబర్‌ ఫెస్టివల్‌’ జరుగుతుంది. ఇక్కడ కీర అధికంగా పండుతుంది. జూలైలో జరిగే ఈ ఫెస్టివల్‌ను చూడటం కోసం పర్యాటకులు అక్కడికి వెళ్తారు. ఉత్సవంలో భాగంగా స్థానిక రైతు కుటుంబాలకు చెందిన వారందరూ కుకుంబర్‌ గ్రౌండ్‌లో కలుసుకుంటారు. రకరకాల పోటీల్లో పాల్గొంటారు. ఫెస్టివల్‌లో భాగంగా కీరతో చేసిన రకరకాల వంటలు నోరూరిస్తాయి. వాటిలో కీర జామ్‌ రుచి అదుర్స్‌.

గిన్నిస్‌ రికార్డు

యూకేలోని సౌంతాప్టన్‌లో నివసించే సెబాస్టియన్‌ సుస్కి అనే వ్యక్తి 3 అడుగుల 8 అంగుళాల కీరదోసను పండించడం ద్వారా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కారు. దీని బరువు 7.7 కిలోలు.

50గ్రా కీరదోసలో....

92.5 గ్రా నీరు, 1.1 గ్రాముల ఫైబర్‌, 3.6 గ్రాముల కార్బోహైడ్రేట్‌, 0.7గ్రాముల ప్రోటీన్‌, ఇంకా విటమిన్‌ కె, పొటాషియం, క్యాల్షియం ఉంటాయి


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 08:18 AM