Gaza: గాజా ఏఐ వీడియో షేర్ చేసిన ట్రంప్.. బాంబుల మోత టూ బంగారం..
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:12 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా స్ట్రిప్ విషయంలో తాజాగా ఒక ఏఐ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ప్రస్తుతం గాజా, తర్వాత తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత గాజా ఎలా ఉంటుందనే విషయాలను చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump), గాజా స్ట్రిప్‌ను "స్వాధీనం చేసుకుంటామని" ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆయన విషయంలో యుద్ధంలో దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని పాలస్తీనియన్లకు వేరే చోట పునరావాసం కల్పించిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రకటనతో పాటు ట్రంప్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా గాజా నేపథ్యంలో రూపొందించిన ఏఐ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో "గాజా 2025" అనే పదంతో మొదలవుతుంది. ఆ క్రమంలో అందులో దెబ్బతిన్న భవనాలు, శిథిలాలు, ప్రజలు నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో వాట్ నెక్ట్స్ అని వచ్చిన తర్వాత.. గాజాలో సహజమైన బీచ్‌లు, నైట్‌క్లబ్‌లు, ఎత్తైన భవనాలు, చెట్లతో ఉన్న అందమైన రోడ్లు, స్పోర్ట్స్ కార్లతో విలాసవంతమైన తీరప్రాంత నగరం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఆ క్రమంలో ట్రంప్ బంగారు వర్ణంలో ఉన్న చిత్రం కూడా కనిపిస్తుంది. దీంతో గాజా భవిష్యత్తు కూడా బంగారు మయం అవుతుందని వీడియో ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ట్రంప్ ముఖంతో ఉన్న బంగారు బెలూన్ ఓ పిల్లాడు పట్టుకోగా, బీచ్‌లో పడవలు, డబ్బు కురుస్తున్న దృశ్యాలున్నాయి. అంతేకాదు ట్రంప్ భారీ బంగారు విగ్రహం కూడా వీడియోలో చూపించబడింది.
ఈ వీడియోలో టెస్లా CEO ఎలోన్ మస్క్‌ను కూడా చూపించారు. ముందు ఏమి లేనట్లుగా చూపించి, తర్వాత డబ్బు కురుస్తున్న స్థాయికి చేరుకున్నట్లుగా చూపించారు. ఆ క్రమంలో ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు షార్ట్స్‌లో కాక్‌టెయిల్స్ తాగుతున్న దృశ్యాలు కూడా ఉండటం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే రెండు లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నమ్మలేకపోతున్నానని ఓ వ్యక్తి అనగా, ఇంకో వ్యక్తి మాత్రం ఇది నిజం కాదని వ్యాఖ్యానించారు. గాజా అమ్మకానికి లేదని, ఇది పాలస్తీనియన్లదని మరో వినియోగదారు కామెంట్ చేశారు.
గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వందలాది మంది మరణించారు. దీంతోపాటు ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఈ వీడియోకు ట్రంప్ క్యాప్షన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 4న నెతన్యాహుతో కలిసి జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మేము గాజాను సొంతం చేసుకుంటామన్నారు. ఆయుధాలను కూల్చివేసే బాధ్యతను కూడా తీసుకుంటామన్నారు. టర్కీ ఈ ప్రతిపాదనను ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఫ్రాన్స్ మధ్యప్రాచ్యాన్ని అస్థిర పరిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News