Donald Trump : ట్రంప్ ఎఫెక్ట్..యూఎస్‍లో పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్న భారతీయ విద్యార్థులు..
ABN, Publish Date - Feb 09 , 2025 | 03:54 PM
అమెరికాలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తర్వాత డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పటికే వేల మంది భారతీయులను యూఎస్ నుంచి వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాత్కాలిక, విద్యార్థి వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఈ దెబ్బకు భారతీయ విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం మానేస్తున్నారు.

అమెరికా వెళ్లి పై చదువులు చదివి అక్కడే స్థిరపడాలనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడా కల పీడకలగా మారిపోయింది. వలస విధానంపై కఠినమైన వైఖరి అవలంబించడమే అందుకు కారణం. అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి మరీ అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో 205 మంది భారతీయులను వెనక్కి పంపించారు. ఇంకో 18 వేల మందిని పంపేందుకు జాబితా కూడా సిద్ధం చేశారు. వలసదారులకూ పార్ట్ టైం జాబ్ విషయంలో కొత్త నిబంధనలు విధించారు. ఈ చర్యలతో భారతీయ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం మానేస్తున్నారు.
పెరిగిన వీసా తిరస్కరణలు..
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వీసా తిరస్కరణలు పెరిగాయి. అలాగే అమెరికా అంతటా పని ప్రదేశాలలో వలసదారుల పరిశీలన, ప్రశ్నించడం కూడా పెరిగింది. ఈ కారణంగానే అమెరికాలో చదువుకోవాలని ఆలోచిస్తున్న చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు యూఎస్ అంటే వెనకడుగు వేస్తున్నారు.
గతేడాది నుంచి యూఎస్‌కు తగ్గిన వలసలు..
గత ఏడాది కాలంగా అమెరికా భారతీయ విద్యార్థులకు జారీ చేసే F-1 విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ డేటా విశ్లేషణ ప్రకారం, జనవరి నుంచి సెప్టెంబర్ 2024 వరకు 64,008 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. 2023లో అయితే ఇదే వ్యవధిలో 1,03,495 వీసాలు జారీ చేశారు. మొత్తంగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లో 38 శాతం తగ్గుదల కనిపించింది. అమెరికాలో జాబ్ మార్కెట్ తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణం. యూఎస్ కంపెనీలు ప్రస్తుతం స్థానిక ప్రజలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విదేశీ విద్యార్థులను పక్కన పెడుతోంది. ఈ పరిస్థితులపై అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగం దొరకడం కష్టమైందని, పరిస్థితులు చాలా దారుణంగా మారాయని ఆవేదన చెందుతున్నారు.
పని ప్రదేశాలలో పెరిగిన నిఘా..
అమెరికాలో ప్రస్తుతం అన్ని కార్యాలయాలు, పని ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థలు వలసదారులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. గుర్తింపు కార్డులు, చెల్లుబాటు అయ్యే పత్రాలను ప్రతి చోటా పరిశీలిస్తూనే ఉండటం భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. చదువులు, ఖర్చులకు అవసరమయ్యే డబ్బు సమకూర్చుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులకు కఠిన విధానాలు అడ్డుగా మారాయి. దర్యాప్తు సంస్థల కఠినమైన వైఖరి కారణంగా వారు తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Grand Canyon : చంద్రుడిపై పది నిమిషాల విధ్వంసం!
Donald Trump : మా జోలికి వస్తే ఊరుకోం..
India-US Relations : అమెరికా నుంచి మరో 487 మంది!
Updated Date - Feb 09 , 2025 | 03:54 PM