Hijab Law: హిజాబ్ అమలుపై డ్రోన్లతో నిఘా
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:28 AM
ఐక్యరాజ్యసమితి శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నట్టు ఒక ఆంగ్ల వార్తాసంస్థ తెలిపింది. కఠినమైన డ్రెస్ కోడ్ పాటించని మహిళలను గుర్తించి, శిక్షించేందుకు ఇరాన్ డిజిటల్ సాధనాలపై ఆధారపడటం ఎక్కువైంది.

నిర్బంధం పెంచిన ఇరాన్
టెహ్రాన్, మార్చి 15: హిజాబ్ చట్టాల అమలును ఇరాన్ తీవ్రతరం చేసింది. దీని కోసం అత్యాధునిక నిఘా సాంకేతికతల వినియోగాన్ని పెంచింది. డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్, మొబైల్ యాప్ తదితరాలను ప్రభుత్వం దీని కోసం వినియోగిస్తోంది. ఐక్యరాజ్యసమితి శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నట్టు ఒక ఆంగ్ల వార్తాసంస్థ తెలిపింది. కఠినమైన డ్రెస్ కోడ్ పాటించని మహిళలను గుర్తించి, శిక్షించేందుకు ఇరాన్ డిజిటల్ సాధనాలపై ఆధారపడటం ఎక్కువైంది. ముఖ్యంగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకొని అసమ్మతిని అణచివేసేందుకు కృత్రిమమేధ, ఇతర నిఘా పరికరాలపై ఆధారపడుతోంది. 2024 సెప్టెంబరు నుంచి అంబులెన్సులు, ట్యాక్సీలు, ప్రజారవాణా వాహనాల్లోనూ హిజాబ్ అమలును తప్పనిసరి చేశారు. అమీర్‌కబీర్ యూనివర్సిటీలో హిజాబ్ ధరించని విద్యార్థినులను గుర్తించేందుకు నిఘా కెమెరాలతోపాటు ప్రవేశ ద్వారం వద్ద ఫెషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రతిపాదిత ‘హిజాబ్ అండ్ చాస్టిటీ’ చట్టాన్ని 2024 డిసెంబరులో ఇరాన్ నిలిపివేసినప్పటికీ, పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని ఐరాస నివేదిక స్పష్టం చేసింది.