Palestinians: తూర్పు ఆఫ్రికాకు పాలస్తీనియన్లు!
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:25 AM
ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు నిర్ధారించినట్టు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. వీటిలో సోమాలీల్యాండ్ ప్రత్యేక దేశంగా ఇంకా గుర్తింపు పొందలేదు. ఇది సోమాలియా నుంచి విడిపోయిన ప్రాంతం. పాలస్తీనా ప్రజలను ఇక్కడికి తరలించేందుకు అంగీకరిస్తే..

తరలించే ప్రయత్నాల్లో అమెరికా, ఇజ్రాయెల్
న్యూఢిల్లీ, మార్చి 15: పాలస్తీనా ప్రజలను తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి తరలించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీని కోసం సూడాన్, సోమాలియా, సోమాలిల్యాండ్ దేశాలతో రహస్యంగా దౌత్య చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు నిర్ధారించినట్టు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. వీటిలో సోమాలీల్యాండ్ ప్రత్యేక దేశంగా ఇంకా గుర్తింపు పొందలేదు. ఇది సోమాలియా నుంచి విడిపోయిన ప్రాంతం. పాలస్తీనా ప్రజలను ఇక్కడికి తరలించేందుకు అంగీకరిస్తే.. ప్రత్యేక దేశంగా గుర్తింపు విషయంలో సాయం చేస్తామని అమెరికా హామీ కూడా ఇచ్చినట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, అమెరికా చేసిన ఆ ప్రతిపాదనను తిరస్కరించామని సూడాన్ అధికారులు తెలిపారు. సోమాలియా, సోమాలిల్యాండ్ అధికారులు మాత్రం ఆ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదన్నారు. కాగా, ఈ మూడూ అంతర్యుద్ధాలతో అతలాకుతలమవుతున్న దేశాలే కావడం గమనార్హం. గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి మొదట్లో ప్రకటించిన విషయ తెలిసిందే.