Similarities in Jagan and Kejriwal:: కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు.. నిజమెంత

ABN, Publish Date - Feb 09 , 2025 | 08:23 PM

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?

Similarities in Jagan and Kejriwal:: కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు.. నిజమెంత
Jagan and Kejriwal

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి తర్వాత ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్‌తో పోల్చడం ఎక్కువుగా చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో తలదూర్చడంతోపాటు, అవినీతి కారణంగా గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ఈ ఏడాది ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూశాయని చాలామంది పోలుస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అసలు పోలిక ఉందా.. జగన్‌ లక్షణాలు కేజ్రీవాల్‌లో నిజంగానే ఉన్నాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ఐదేళ్లలోనే ప్రజల విశ్వాసం కోల్పోయారనే విషయం తెలిసిందే. ఆప్ దాదాపు 12 ఏళ్లు ఢిల్లీని పాలించింది. కేజ్రీవాల్ పదేళ్లకుపైగా సీఎంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఆప్ ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం రాజకీయంగా ఇద్దరి లక్షణాలు ఒకేలా ఉన్నాయనడంలో వాస్తవం లేకపోలేదు. నిర్ణయాల విషయంలో, తనను చూసి మిగతా అభ్యర్థులను గెలిపించాలని ఇద్దరు నేతలు ప్రచారం చేశారు. ఇలా ఇద్దరిలో ఒకే విధమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


సంక్షేమ పథకాలపై ఫోకస్..

ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సమయంలో కేజ్రీవాల్ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉచిత పథకాలు తనను గెలిపిస్తాయని, పేద, మధ్య తరగతి ప్రజలు తన వెంటే ఉంటారని కేజ్రీవాల్ ఆశించారు. రెండు పర్యాయాలు కేజ్రీవాల్ ప్లాన్ వర్కౌట్ అయింది. మూడోసారి మాత్రం కేజ్రీవాల్‌ను ప్రజలు విశ్వసించలేదు. ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి ఢిల్లీ అభివృద్ధిని పక్కనపెట్టేశారు. రహదారుల పరిస్థితి ఢిల్లీలో అధ్వానంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఢిల్లీలో అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ ఓటమికి గల కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. జగన్ సైతం ఇదే తరహా ఆలోచన చేశారు. ఏపీ అభివృద్ధిని పక్కనపెట్టి.. బటన్ నొక్కడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విషయంలో ఇద్దరు నేతల ఆలోచన ఒకేలా ఉందని చెప్పుకోవచ్చు.


ఏకపక్ష నిర్ణయాలు

జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏకపక్షంగా ఉండేవి. ఎవరితో చర్చించేవారు కాదు. తనను ఎవరైనా కాదంటే పక్కనపెట్టేవారు. ఎవరూ సలహాలు ఇచ్చినా స్వీకరించేవారు కాదు. పార్టీలో ఇతర నేతల ఎదుగుదలను అడ్డుకునేవారు. ఈ తరహా లక్షణం కేజ్రీవాల్‌లో ఉందని ఆయనను దగ్గర నుంచి పలువురు నాయకులు చెప్పిన సందర్భాలున్నాయి. ఆప్ నుంచి బయటకు వచ్చిన నేతలు కేజ్రీవాల్‌పై ఇవే తరహా ఆరోపణలు చేశారు. ఇలా చూసుకుంటే పలు అంశాల విషయంలో జగన్ లక్షణాలు కేజ్రీవాల్‌లో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 09 , 2025 | 08:24 PM