Bengaluru: వర్క్ ఫ్రం కారు..
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:08 AM
‘వర్క్ ఫ్రం హోం అనేది మీ ఇష్టం..కానీ, వర్క్ ఫ్రం కార్ కుదరదంటే కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జరిమానా విధించారు.

ట్రాఫిక్ జాంలో కారు నుంచే ఆఫీసు పని
బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్వాకం
గుర్తించి జరిమానా విధించిన పోలీసులు
బెంగళూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ‘వర్క్ ఫ్రం హోం అనేది మీ ఇష్టం..కానీ, వర్క్ ఫ్రం కార్ కుదరదంటే కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జరిమానా విధించారు. బెంగళూరు నగరం హెచ్‌ఎ్‌సఆర్ లే అవుట్‌లోని ఓ కంపెనీ కార్యాలయం నుంచి ఆర్‌టీ నగర్‌లోని తన ఇంటికి ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కారులో బయలుదేరారు. హెచ్‌ఎ్‌సఆర్ లే అవుట్, బీటీఎం లే అవుట్ నుంచి ఆర్‌టీ నగర్‌కు వచ్చే మార్గమంతా ప్రతి సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఎలాగూ ట్రాఫిక్‌లో ఆగుతాం కదా అని భావించిన ఆమె.. కారు డ్రైవింగ్ చేస్తూనే లాప్‌టాప్ ఆపరేట్ చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ఆర్‌టీ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారును ట్రాక్ చేసి గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆమెకు బుధవారం రూ.1000 జరిమానా విధించారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే జరిమానాతో పాటు ఇతర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. దీనిపై ట్రాఫిక్ డీసీపీ సిరిగౌరి స్పందిస్తూ... కారు డ్రైవింగ్ చేస్తూ వర్క్ చేయడం సరికాదని ట్వీట్ చేశారు. కాగా, డ్రైవింగ్ చేస్తూ లాప్‌టాప్ వినియోగించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యాజమాన్యాల ఒత్తిడి కారణంగానే ఉద్యోగులు ఇలా వ్యవహరిస్తున్నారని కొందరు సమర్థించగా.. మరి కొందరు వ్యతిరేకించారు.