Viral Video: భార్య రీల్స్ పిచ్చి.. భర్త ఉద్యోగం ఊస్ట్..
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:31 PM
భార్య రీల్స్ పిచ్చి ఓ భర్త కొంపముంచింది. ఉన్నతాధికారుల చేత చీవాట్లు తినడమే కాక.. పాపం సస్పెన్షన్ వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరో బాధ. మరి ఇంతకు ఏం జరిగిందంటే..

చండీగఢ్: సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. మనుషుల్లో చాలా మార్పు వచ్చిందనే మాట వాస్తవం. సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. జాగ్రత్తగా వాడితే.. ఎంత లాభమో.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అదే స్థాయిలో నష్టాలు తప్పవు. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్, నెట్ బ్యాలెన్స్ అందుబాటులోకి రావడంతో.. చాలా మంది సోషల్ మీడియాలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పిచ్చిలో పడి కొందరు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటుండగా.. చాలా మంది ఇతరులను, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య సోషల్ మీడియా పిచ్చి.. భర్త ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆ వివరాలు..
పోలీసు అధికారి భార్య ఒకరు.. నడి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ.. వాహనదారులకు ఇబ్బంది కలిగించిన వీడియో ఒకటి రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. చండీగఢ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అయ్యింది. విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. వారు దీనిపై స్పందించి.. సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
అజయ్ కుందు అనే వ్యక్తి సెక్టార్ 19 పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల అనగా మార్చి 22న అజయ్ భార్య జ్యోతి కుందు తన ఇన్‌స్టాలో ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. అది కాస్త వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు అజయ్‌ని సస్పెండ్ చేశారు. భార్య డ్యాన్స్ చేస్తే భర్తపై చర్యలు తీసుకుంటారా.. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.
నా భర్త పోలీసు అధికారి.. ఇక నన్ను ఆపేదేవరు అని భావించిన జ్యోతి.. నడి రోడ్డు మీద.. వాహనాలను ఆపి మరి డ్యాన్స్ చేస్తూ.. వీడియో తీసుకుంది. ఆమె వీడియో రికార్డింగ్ పూర్తయ్యేవరకు.. వాహనదారులు అలానే నిలిచిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జ్యోతితో పాటు ఆమె మరదలు కూడా ఉంది. వీరి చేష్టలతో విసిగిపోయిన ఓ వ్యక్తి.. పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఇద్దరు తమ డ్యాన్స్ వీడియో కోసం వాహనాలు ఆపి.. ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేయడమే కాక.. రోడ్డు మీద ఉన్న వాళ్ల అనుమతి లేకుండానే.. వారిని వీడియో, ఫొటోలు తీసి.. వారి వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలిగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి పరిశీలించగా.. జ్యోతి చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు ఆమె మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాక జ్యోతి భర్త.. అజయ్‌ను సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై పాతికేళ్లు.. పెళ్లి రోజు నాడే అంతులేని విషాదం..
రూ.50 లక్షలు పోగొట్టుకొని.. చివరకు విగతజీవిగా..