IMD Predictions: ఎండలు మండుతుంటే.. అక్కడ వర్షాలు..మరి హైదరాబాద్‌లో
ABN , Publish Date - Apr 13 , 2025 | 08:20 AM
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..

ఢిల్లీ: వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగానే సీజన్‌లు కూడా మారుతున్నాయి. ఓ దశాబ్దం క్రితం వరకు కూడా వేసవి కాలం అంటే.. ఏప్రిల్ నెలాఖరుకు ప్రారంభం అయ్యేది. కానీ గత కొన్నేళ్లుగా మాత్రం.. మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ ఏడాది అయితే ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండే ఎండా కాలంలో భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులు జనాలను భయపెడుతున్నాయి.
బిహార్‌లో భారీ వర్షాల కారణంగా 20 మందికి పైగా మృతి చెందారు. ఇక నిన్నటి వరకు ఢిల్లీలో దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా దేశరాజధాని, దాని పరిసర ప్రాంతాలు మోస్తరు వర్షాలు, దుమ్ము తుపానుతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. శుక్రవారం ఢిల్లీలో 35.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా కన్నా చాలా తక్కువ అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఐఎండీ కీలక ప్రకటన..
ఈ క్రమంలో భారతీయ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆదివారం నాడు ఢిల్లీలో 36-38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 19-21 డిగ్రీలు నమోదయ్యే అవకాశ ఉందని వెల్లడించింది. నేడు ఆదివారం నాడు ఢిల్లీలో చాలా వరకు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
దేశ వ్యాప్తంగా చూసుకుంటే.. ఆదివారం నాడు బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 50-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. తెలిపింది. మధ్యప్రదేశ్, మేఘాలయ, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాలకు వస్తే.. రెండు రాష్ట్రాల్లో భానుడు ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్య ప్రతాపం మొదలవుతుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితెలు నెలకొని ఉంటున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన ఐఎండీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని ఎండ తీవ్రత బాగా ఉంటుందని పేర్కొంది. వర్షాలు పడే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. జనాలు ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని.. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: రూ.5 వేలు పెరిగిన బంగారం..గోల్డ్‌ను బీట్ చేసిన వెండి
Russian Missile Strike: మిత్రదేశమైన భారత ఫార్మా సంస్థ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి..ఎందుకిలా..