Share News

Republic Day function: స్కూల్‌లో జెండా ఎగరవేస్తుండగా ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:24 PM

Republic Day function: స్కూల్‌లో జెండా ఎగరవేసేందుకు వేదిక మీదకు వెళ్లిన ప్రిన్సిపాల్ పరిస్థితి చూసి స్థానికులు, విద్యార్థులు ఆందోళన చెందారు.

Republic Day function: స్కూల్‌లో జెండా ఎగరవేస్తుండగా ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు
Headmaster Sanjay Kumar

పాట్నా, జనవరి 27: స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా వైన్ షాపులు మూసి ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం సైతం అమలవుతోంది. వాటిలో బిహార్ ఒకటి. అలాంటి రాష్ట్రంలో ఓ ప్రధాన ఉపాధ్యాయుడు మద్యం తాగి.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ.. నడవ లేక.. తూలి పడి పోతున్నాడు. దీంతో స్థానికులు వెంటనే స్పందించారు. ప్రధాన ఉపాధ్యాయుడు పీకల దాక మద్యం సేవించినట్లు వారు గుర్తించారు. దీంతో ఆయనపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఎమ్మెల్యే అయితే.. సదరు ప్రధాన ఉపాధ్యాయుడిపై నిప్పులు చెరిగారు. ఈ ఘటన బిహార్‌లో ముజఫర్‌పూర్‌ జిల్లాలోని మినాపూర్‌లో జనవరి 26వ తేదీన చోటు చేసుకొంది.

గణతంత్ర దినోత్సవం రోజు.. పుట్‌గా తాగి వచ్చిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడికి బ్రిత్ ఎనలైజర్ పరీక్షను నిర్వహించారు. అలాగే వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. నివేదిక అందిన వెంటనే సంజయ్ కుమార్‌పై చర్యలు ఉంటాయని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.


అయితే సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఐదు నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో నిస్సహాయ స్థితిలో మద్యం సేవించాల్సి వచ్చిందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి సైతం నిధులు విడుదల చేయడం లేదని ఆయన వాపోయారు. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని, పాఠశాలను ఎలా నిర్వహించేదని ప్రధాన ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ ప్రశ్నించారు. మరి మద్యం సేవించడానికి నీకు నగదు ఎలా వచ్చిందంటూ స్థానికులు ప్రశ్నించగా.. సన్నిహితులు కొంత మంది తనకు మద్యం ఇప్పించారని సమాధానమిచ్చారు. అయినా తనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మద్యం మత్తులో ప్రధాన ఉపాధ్యాయుడు ప్రశ్నించారు.

Also Read: టెన్త్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేలల్లో ఖాళీలు


మరోవైపు ప్రధాన ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే రాజీవ్ కుమార్ మండిపడ్డారు. బిహార్‌లో మద్య పాన నిషేధం అమలవుతోందన్నారు. అలాంటి వేళ.. సంజయ్ కుమార్ వ్యవహారం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అతడిని కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో మద్య పాన నిషేధం అమలులో ఉందని.. ఈ విషయం అందరికి తెలుసునన్నారు. కానీ మద్యం మాత్రం అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పారు.

Also Read: ప్రధాని మోదీకి పేద ప్రజల కంటే ‘వారే’ ముఖ్యం


గణతంత్ర దినోత్సవం రోజు.. మద్యం తాగి ప్రధాన ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ అడ్డంగా బుక్ కావడంతో.. రాష్ట్రంలో మద్య పాన నిషేధంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే 2016లో నాటి సీఎం నితీష్ కుమార్.. బిహార్‌లో మద్య పాన నిషేధం విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకోవైపు రాష్ట్రంలో చట్టవిరుద్దంగా మద్యం తయారు చేయడం.. వాటి విక్రయాల వల్ల బిహార్‌లో విషాదాలు చోటు చేసుకొంటున్న సంఘటనలు పలు సందర్భాల్లో జరిగిన సంగతి వెల్లువెత్తుతోన్న సంగతి అందరికి తెలిసిందే. అదీకాక.. నెలల తరబడి ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు అందక పోవడంతో వారు పడుతోన్న సమస్యలపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సైతం జరుగుతోంది.

For National News And Telugu News

Updated Date - Jan 27 , 2025 | 05:36 PM