China Virus: చైనా కొత్త వైరస్ గురించి భారత్ కీలక ప్రకటన..
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:35 AM
చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) గురించి భారత్ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఎలాంటిది, దీని వ్యాప్తి ఇండియాలో ఉంటుందా లేదా అనే విషయాలను ప్రకటించారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ కూడా పాటించాలన్నారు.
చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ (ChinaVirus) హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) గురించి భారత్ అప్రమత్తమైంది. ఇది "జలుబు కలిగించే ఇతర శ్వాసకోశ వైరస్ లాగా" ఉందని పేర్కొంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు. ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని, ప్రధానంగా యువత, వృద్ధులలో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అతుల్ గోయల్ స్పష్టం చేశారు.
దగ్గినా, తుమ్మినా ప్రత్యేకంగా
చైనాలో ఇటీవల HMPV వ్యాప్తికి సంబంధించిన నివేదికల నేపథ్యంలో డాక్టర్ గోయల్ కూడా భారతదేశంలో అసాధారణ పరిస్థితి లేదని సూచించారు. మేము డిసెంబర్ 2024 డేటాను విశ్లేషించామని, అలాంటి మార్పులు లేవన్నారు. చలికాలంలో శ్వాసకోశ వైరస్ సోకడం సహజమేనని, ఈ సమయంలో ఆసుపత్రులను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ గోయల్ సాధారణ ప్రజలను కోరారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఇతరులకు దూరంగా ఉండాలన్నారు. దగ్గినా, తుమ్మినా ప్రత్యేకంగా రుమాలు లేదా టవల్‌ను ఉపయోగించాలన్నారు. సాధారణ జలుబు లేదా జ్వరం లక్షణాల కోసం సాధారణ మందులు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
చికిత్స అందుబాటులో లేదు
hMPVకి ప్రస్తుతం నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదని. దీని వ్యాప్తిని నిరోధించడానికి భద్రతా చర్యలను అనుసరించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గోయల్ అన్నారు. అదనంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) శ్వాస సంబంధిత, ఇన్ఫ్లుఎంజా కేసులను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ పరిస్థితిపై వారు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
WHO ఆదేశం..
చైనాలో పెరుగుతున్న hMPV వ్యాప్తి నేపథ్యంలో COVID-19 మాదిరిగానే ఇది కూడా మహమ్మారిగా వచ్చే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు. అయినప్పటికీ చైనా మాత్రం వారి పారదర్శకతను సమర్థించుకుంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాధి మూలం గురించి మరింత డేటా, సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది. తద్వారా ప్రపంచ స్థాయిలో దీని గురించి మరింత అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. భారతదేశంలో HMPV కేసులలో పెద్ద పెరుగుదల కనిపించనప్పటికీ, శ్వాసకోశ సంక్రమణకు సాధారణ నివారణ చర్యలను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.