India Laser Weapon: భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:29 AM
భారత దేశంలో తొలిసారి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ)ని విజయవంతంగా పరీక్షించింది డీఆర్‌డీవో. ఇది డ్రోన్ల, క్షిపణుల వంటి లక్ష్యాలను 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో ధ్వంసం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది

లేజర్ పుంజాలతో డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ
దేశంలో తొలిసారి అత్యంత అధునాతన
డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్.. ఎంకే-2(ఏ) ప్రయోగం
కర్నూలులో పరీక్షలు నిర్వహించిన డీఆర్‌డీవో
30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో విధ్వంసం
నిఘా సెన్సార్లకు అడ్డుకట్ట, తొలి ప్రయోగం
సక్సెస్.. డీఈడబ్ల్యూ దేశాల సరసన భారత్
ఇదో గేమ్ చేంజర్: డీఆర్‌డీవో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భారత్ అమ్ముల పొదిలో అధునాతన ఫ్యూచరిస్టిక్ ‘స్టార్ వార్స్’గా పేర్కొంటున్న లేజర్ అస్త్రాలు త్వరలోనే చేరనున్నాయి. లేజర్ పుంజాలతో శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విధ్వంసం చేయగల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించి.. విజయం సాధించింది. ఏపీలోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఆదివారం.. ఎంకే-2(ఏ)ను వినియోగించి లేజర్ పుంజాలతో డ్రోన్ల సమూహాలను, ఫిక్స్‌డ్ వింగ్ యూఏవీలను ధ్వంసం చేసింది. ఈ లేజర్ పుంజాలు అత్యంత శక్తిమంతమైనవని, ఎలాంటి లక్షిత డ్రోన్స్‌నైనా ధ్వంసం చేస్తాయని డీఆర్‌డీవో తెలిపింది. ఈ అధునాతన వ్యవస్థ భారత సైనిక దళాలకు ‘గేమ్ చేంజర్’గా మారనుందని పేర్కొంది. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో డీఆర్‌డీవో కూడా ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించింది. ‘‘కర్నూలులో నిర్వహించిన వెహికల్ మౌంటెండ్ లేజర్ ఎనర్జీ డైరెక్టెడ్ వెపన్(డీఈడబ్ల్యూ) ల్యాండ్ వెర్షన్ ప్రయోగం విజయవంతం అయింది.
ఫిక్స్‌డ్ వింగ్ యూఏవీ, డ్రోన్ల్ సమూహాన్ని డీఈడబ్ల్యూ ఎంకే-2(ఏ) ధ్వంసం చేసింది. అదేవిధంగా నిఘా సెన్సార్ వ్యవస్థను పనిచేయకుండా చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థలు ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్టయింది’’ అని డీఆర్‌డీవో తన ‘ఎక్స్’ ఖాతాలో వివరించింది. ప్రయోగానికి సంబంధించిన వీడియోను(డీఈడబ్ల్యూ ఎంకే-2(ఏ) లేజర్ పుంజాలు లక్ష్యాన్ని బూడిద చేసిన దృశ్యం)కూడా పంచుకుంది. ‘‘ఇప్పటి వరకు ఇలాంటి వ్యవస్థను ప్రదర్శించిన దేశాల్లో రష్యా, అమెరికా, చైనా ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది. దీనిని బట్టి మనం 4 లేదా ఐదో స్థానంలో ఉన్నాం’’ అని డీఆర్‌డీవో చైర్మన్ సమీర్ తెలిపారు. ఇది మనకు ‘స్టార్ వార్స్’ సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈప్రయోగంలో డీఆర్‌డీవోకు చెందిన పలుల్యాబ్‌లు, పరిశ్రమల సహకారం ఉందన్నారు. ‘‘తాజా ప్రయోగం స్టార్ వార్స్ సాంకేతికతలో ఒకటి మాత్రమే’’ అని పేర్కొన్నారు.
మెరుపు వేగం!
దేశీయంగా రూపొందించిన ఎంకే-2(ఏ) డీఈడబ్ల్యూ లేజర్ అస్త్రం.. సుదూర లక్ష్యాలను కూడా మెరుపు వేగంతో సమర్థవంతంగా ఛేదించగలదని డీఆర్‌డీవో తెలిపింది. అదేవిధంగా డ్రోన్ల సమూహాలను, శత్రు నిఘా సెన్సార్లకు కూడా అడ్డుకట్ట వేయనుందని పేర్కొంది. ఇది మెరుపు వేగం, ఖచ్చితత్వంతో కేవలం సెకన్ల వ్యవధిలోనే లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం ఉంది. ఈ అస్త్రం రూపకల్పనలో డీఆర్‌డీవోకు చెందిన సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) హైదరాబాద్, ఎల్‌ఆర్‌డీఈ, ఐఆర్‌డీఈ, డీఎల్‌ఆర్‌ఎల్ సహా వివిధ విద్యాసంస్థలు, పరిశ్రమలు భాగస్వామ్యం పంచుకున్నాయి. ఈ ఆయుధ వ్యవస్థతో మందుగుండు సామగ్రి వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గుతుంది.
ఎలా పనిచేస్తుంది?
లేజర్ అస్త్రం ఎంకే-2(ఏ) డీఈడబ్ల్యూ.. రాడార్ లేదా అంతర్నితమైన ఎలక్ట్రో ఆప్టిక్ (ఈవో) వ్యవస్థ ద్వారా లక్ష్యాలను గుర్తిస్తుంది. ఆ వెంటనే కాంతి వేగంతో దూసుకుపోయి.. 30 కిలో వాట్స్ సామర్థ్యంతో కూడిన లేజర్ పుంజాలను ప్రయోగించడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. శత్రు డ్రోన్ల స్ట్రక్చర్‌ను నాశనం చేయడంతోపాటు వార్‌హెడ్‌ను విధ్వంసం చేస్తుంది. మానవ రహిత వైమానిక వ్యవస్థలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు డ్రోన్ ఆధారిత యుద్ధాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో లేజర్ అస్త్రం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For National News And Telugu News