India IST Now : ఇక నుంచి భారత్‌లో.. వన్ టైమ్.. వన్ నేషన్..
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:09 PM
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా.. అదే తరహాలో వన్ టైమ్.. వన్ నేషన్.. తప్పనిసరి చేస్తూ కొత్త ముసాయిదా విడుదలు చేసింది.

ఒక పక్క దేశంలో ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే తరహాలో ఒకే దేశంలో ఒకే సమయం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశం మొత్తం ఒకే సమయం పాటించాలనే నిబంధనతో కొత్త ముసాయిదా విడుదల చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైం (IST) ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న సమయపాలనను ప్రామాణీకరించడానికి దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని తప్పనిసరి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అన్ని అధికారిక, వాణిజ్య ప్లాట్‌ఫారమ్‌లలో భారతీయ ప్రామాణిక సమయాన్ని (IST) తప్పనిసరిగా ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర నియమాలను రూపొందించింది.
భారతదేశం నేషనల్ టైం కీపర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్- నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (CSIR-NPL) వన్ టైం వన్ నేషన్ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం మన దేశం 82°33′E గుండా వెళుతున్న రేఖాంశం ఆధారంగా IST సమయాన్ని లెక్కిస్తోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, IST-I రేఖాంశాలు 68°7′E , 89°52′E మధ్య పడే ప్రాంతాలను కవర్ చేస్తూనే, IST-II 89°52′E, 97°25′Eల మధ్య ప్రాంతాలను కవర్ చేస్తూ ఒకే సమయాన్ని లెక్కిస్తుంది. ఇందులో అన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు అండమాన్, నికోబార్ దీవులు కూడా ఉంటాయి. ఇలా రెండు టైం జోన్లను అనుసరించడం వల్ల ఇంధన వినియోగ పొదుపు సంవత్సరానికి 20 మిలియన్ కిలోవాట్లు సాధించవచ్చని అంచనా.
వన్ టైమ్.. వన్ నేషన్.. ఎందుకంటే..
సూర్యుడు భారతదేశానికి పశ్చిమాన కంటే తూర్పున దాదాపు రెండు గంటలు ముందుగా ఉదయిస్తాడు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఈశాన్య ప్రాంతాల్లో కంటే పనిగంటలు ముందుగా మొదలై త్వరగా ముగుస్తాయి. ఇప్పటి వరకూ ఒకే IST టైం జోన్ ప్రకారం సమయాన్ని లెక్కగట్టడం వల్ల ఆయా ప్రాంతాల్లో వెలుతురు లేక ఇంధన ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, IST-I, IST-II లుగా టైం జోన్లు విడదీశారు. దీనివల్ల భారతదేశంలోని చాలా ప్రాంతాలకు, ఈశాన్య ప్రాంతాలకు మధ్య తేడా గంట మాత్రమే ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా.. ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం వాణిజ్యం, రవాణా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, చట్టపరమైన ఒప్పందాలు, ఆర్థిక కార్యకలాపాలతో సహా అన్ని రంగాలలో IST తప్పనిసరి. ఐఎస్‌టీ కాకుండా ఇతర టైమ్ జోన్లను ప్రస్తావించడం నిషేధం. ఖగోళ శాస్త్రం, నావిగేషన్ మరియు శాస్త్రీయ పరిశోధన వంటి ప్రత్యేక విభాగాలకు మినహాయింపులు ఉంటాయి. వ్యూహాత్మక, నాన్-స్ట్రాటజిక్ ప్రాంతాలకు నానోసెకండ్ కచ్చితత్వంతో కచ్చితమైన సమయం అవసరం కావడమే కారణం. వీటి కోసం ముందుగా ప్రభుత్వ అనుమతిని పొందాలి.
వినియోగదారుల వ్యవహారాల విభాగం, నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహకారంతో పటిష్ఠమైన సమయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14లోగా ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ కోరుతోంది.