PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:54 PM
అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీ: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణలో అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ప్రధాని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రధాని మోదీ మండిపడ్డారు. హర్యానా రాష్ట్రంలో హిసార్ ఎయిర్‌పోర్టుని ప్రధాని మోదీ ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రధాని మోదీ అన్నారు. అంబేడ్కర్ జీవించి ఉన్నప్పుడు, ఆ పార్టీ ఆయన్ను పదే పదే అవమానించిందని మండిపడ్డారు. రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేసిందని ఆగ్రహించారు. వ్యవస్థ నుంచి ఆయన్ను దూరంగా ఉంచేందుకు కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ మరణం తర్వాత, ఆయన జ్ఞాపకాలను తుడిచిపెట్టడానికి ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాసాహెబ్ సమానత్వం కోసం నిలబడ్డారని, కానీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసిందని ఆరోపించారు. అందుకే వక్ఫ్ సవరణ చట్టం-2025ను వ్యతిరేకిస్తూ మత ఛాందసాన్ని పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చారని ప్రధాని మోదీ ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గాలకు చేరాయో లేదో తెలుసుకునే విషయాన్ని సైతం కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారం పొందేందుకు రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ మార్చిందని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రధాని.. రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారని విమర్శించారు. రాజ్యాంగం గురించి హస్తం పార్టీ నేతలు పదేపదే మాట్లాడతారని, కానీ దాన్ని ఎప్పుడూ అమలు చేయలేదని చురకలు అంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ
భార్యపై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..