Share News

Railway Safety: తొక్కిసలాటల నివారణకు.. 60 రైల్వేస్టేషన్లలో హోల్డింగ్‌ జోన్లు

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:30 AM

దేశంలో అత్యంత రద్దీగా ఉండే 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో హోల్డింగ్‌ జోన్లను ఏర్పాటు చేయడం. రైల్వే స్టేషన్లలోని మెట్లమార్గాలను ఖాళీగా ఉంచాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన పెంచడం.

Railway Safety: తొక్కిసలాటల నివారణకు.. 60 రైల్వేస్టేషన్లలో హోల్డింగ్‌ జోన్లు

తమ రైలు వచ్చే దాకా ప్రయాణికులు అక్కడే

ఢిల్లీ దుర్ఘటన నేపథ్యంలో చర్యలు: అశ్వినివైష్ణవ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో.. మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగా మూడు ముఖ్యమైన చర్యలు తీసుకోనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం వెల్లడించారు. అవి..దేశంలో అత్యంత రద్దీగా ఉండే 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో హోల్డింగ్‌ జోన్లను ఏర్పాటు చేయడం. రైల్వే స్టేషన్లలోని మెట్లమార్గాలను ఖాళీగా ఉంచాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన పెంచడం. రద్దీ నిర్వహణకు సంబంధించి స్పష్టమైన నిబంధనావళి రూపొందించి రైల్వే స్టేషన్‌ సిబ్బందికి పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వడం...ఈ మూడింటిలో ప్రధానమైనది హోల్డింగ్‌ జోన్ల ఏర్పాటు. అంటే.. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు తమ రైలు వచ్చేదాకా కూర్చోవడానికి చేసే ఏర్పాటు. సంబంధిత రైలు వచ్చాక ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతిస్తారన్నమాట.


దీనివల్ల ప్లాట్‌ఫామ్‌పై రద్దీ పెరిగిపోవడం, తొక్కిసలాటలు జరగడం వంటి సమస్యలు ఉండవు. ఇకపై న్యూఢిల్లీ, ఆనంద్‌విహార్‌, లఖ్‌నవూ, వారాణసీ, పట్నా, ముంబై, సూరత్‌, బెంగళూరు తదితర 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో దీన్ని అమల్లోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

g.jpg

ఛాత్‌ పూజ సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దీన్ని అమలు చేయగా అది విజయవంతమైందని.. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో కూడా ఇలా హోల్డింగ్‌ ఏరియాలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలను ఇచ్చిందని అశ్వినివైష్ణవ్‌ తెలిపారు. అలాగే.. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు మెట్లపై కూర్చోకుండా ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను రైల్వే శాఖ చేపట్టనుంది. ఇందుకోసం ఆర్నెల్లపాటు ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహించనుంది. ప్రయాణికులతోపాటు.. ప్లాట్‌ఫామ్‌పై ఉండే స్టేషన్‌ సిబ్బంది, దుకాణదారులకు కూడా అవగాహన కల్పించనుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రద్దీ నిర్వహణకు సంబంధించి.. ఇప్పటికే ఉన్న నిబంధనలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, సమగ్రమైన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Updated Date - Feb 18 , 2025 | 05:30 AM