RG Kar Victim: సీఎం మమతా బెనర్జీపై వైద్యురాలి తండ్రి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:29 PM
RG Kar Victim: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యురాలు హత్యాచార ఘటనలో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో మృతురాలి తండ్రి స్పందించారు.

కోల్‌కతా, జనవరి 21: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైదురాలిపై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్‌రాయ్‌కు సిల్దా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ.. సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అందులోభాగంగా సిల్దా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. టీఎంసీ ప్రభుత్వం మంగళవారం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది.
అలాంటి వేళ.. మృతురాలు తండ్రి మంగళవారం కోల్‌కతాలో స్పందించారు. ఆ క్రమంలో సీఎం మమతా బెనర్జీపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. అప్పటి కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌తోపాటు పలువురు సాక్షాలను తారుమారు చేశారని అరోపించారు. అందుకే ఈ కేసులో కోర్టుకు సరైన ఆధారాలను సీబీఐ అందజేయలేదన్నారు. అందుకే నిందితుడికి కోర్టు యావజీవ ఖైదు విధించిందని పేర్కొన్నారు.
కోర్టు తీర్పు వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందర పడి ఏమీ చేయనవసరం లేదన్నారు. ఇప్పటికి వరకు ఆమె చేసింది చాలన్నారు. ఇకపై ఏం చేయనవసరం లేదంటూ సీఎం మమతా బెనర్జీకి హత్యాచార మృతురాలి తండ్రి సూచించారు. అయితే తమకు ఇంకా సిల్దా కోర్టు ఆర్డర్ కాపీని అందలేదని చెప్పారు. బుధవారం ఆ ఆర్డర్ కాఫీ తమకు అందుతోందన్నారు. అనంతరం ఈ వ్యవహారంలో తాము ఏం చేయాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు సిల్దా తీర్పును సవాల్ చేస్తూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు అనుమతించింది. సిల్దా ట్రయిల్ కోర్టు జడ్జి జస్టిస్ అనిర్బన్ దాస్.. ఈ కేసులో నిందితుడికి మరణించే వరకు జైలులోనో ఉంచాలని తీర్పు వెలువరించారు. అలాగే రూ. 50 వేల జరిమానా సైతం విధించారు. ఈ నగదు చెల్లించని పక్షంలో మరో ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
Also Read: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
2024, అగస్ట్ 9వ తేదీ అర్థరాత్రి కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిగా పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను గుర్తించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించిన 120 మంది సాక్షులను సైతం విచారించింది.
Also Read: జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
దీంతో ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు యావజ్జీవ ఖైదు విధిస్తూ.. సిల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ఇంకోవైపుఈ హత్యాచార ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతోన్నాయి. ఈ హత్యాచారం ఘటన జరగడం.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పే క్రమంలో ఆసుపత్రి ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే వారు ఆసుపత్రికి చేరుకొన్న వెంటనే..కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదు.
ఇక హత్యాచార ఘటన జరిగిన తర్వాత.. సంఘటన స్థలంలో పలు ఆధారాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఇలా ఒక్కటే కాదు.. పలు ఆరోపణలతోపాటు విమర్శలు సైతం వచ్చాయి. ఇక ఇదే కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అదీకాక.. ఈ హత్యాచార ఘటన అనంతరం కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన్ని మరో కాలేజీ ఆసుపత్రికి ప్రిన్సిపల్‌గా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. ఈ వ్యవహరంపై తీవ్ర ఆరోపణలు గుప్పుమన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.
For National News And Telugu News