USAID: యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్.. ప్రధాన మంత్రి సలహాదారు కామెంట్
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:31 PM
భారత్‌లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు అందాయన్న వార్తపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ స్పందించారు. చరిత్రలో యూఎస్ఏఐడీ అతిపెద్ద కుంభకోణమని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లో అభివృద్ధికార్యకలాపాలకు ఆర్థికసాయం అందించే అమెరికా విభాగం యూఎస్ఏఐడీ చరిత్రలో అతిపెద్ద స్కామ్ అని ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారు సంజీవ్ సన్యాల్ అభివర్ణించారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల యూఎస్ఏఐడీ నిధులను రద్దు చేస్తున్నట్టు అమెరికా పొదుపు చర్యల శాఖ డోజ్ తాజాగా ప్రకటించడంపై సన్యాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు (National News).
అమెరికా డోజ్ శాఖ ప్రకటన భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే స్పందించిన బీజేపీ భారత రాజకీయ వ్యవహారాల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ కూడా స్పందించారు. చరిత్రలో యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్ అని అన్నారు. ఈ నిధులు భారత్‌లో ఎవరికి చేరాయో తనకు తెలుసుకోవాలని ఉన్నట్టు వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో తరచూ భూకంపాలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు!
ఈ ఉదంతంపై మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కూడా స్పందించారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు పంపించిందన్న వార్తల్లో వీసమెత్తు నిజం కూడా లేదని అన్నారు. ‘‘2012లో ఈసీఐ ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందున్న వార్తలు మీడియాలో వచ్చాయి. అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘంలో నేను ఉన్నాను’’ అని ఆయన చెప్పారు.
శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు కోసం 2012లో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ (ఐఎఫ్ఈఎస్) సంస్థతో కేంద్ర ఎన్నికల కమిషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వివరించారు. ఇలా అనేక సంస్థలతో ఎమ్ఓయూలు ఉంటాయని చెప్పారు. ఇక ఐఎఫ్ఈఎస్‌తో ఎమ్ఓయూలో నిధుల ప్రస్తావన లేనేలేదని స్పష్టం చేశారు.
Mohan Bhagwat : హిందూ మతమే బాధ్యతాయుత సమాజం
భారత్‌కు డోజ్ శాఖ నిధుల రద్దుపై బీజేపీ జాతీయ ప్రతినిధి అమిత్ మాల్వీయ ఆదివారం స్పందిస్తూ.. విదేశీ శక్తులు వ్యవస్థాగత స్థాయిలో భారత సంస్థల్లోకి చొరబడ్డాయని ఆరోపించారు. ప్రపంచంలో వివిధ అంశాలను ప్రభావితం చేసేందుకు బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ ప్రయత్నాలపై కూడా ఫైరయ్యారు. భారత ఎన్నికల ప్రక్రియ ఆయన నీడలోకి వచ్చేసిందని వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. భారత వ్యవస్థల్లోకి దేశ ప్రయోజనాలు వ్యతిరేకించే విదేశీ శక్తులు చొరబడేందుకు సహకరించినట్టు దీని ద్వారా క్రమంగా స్పష్టమవుతోంది. భారత్‌ను బలహీనం చేసేందుకు ఈ శక్తులు యత్నించాయి’’ అని కామెంట్ చేశారు. ఇక పొదుపు చర్యల్లో భాగంగా డోజ్ శాఖ ప్రధానంగా యూఎస్ఏఐడీని టార్గెట్ చేస్తోంది. ఆ సంస్థకు కేటాయించిన నిధుల్లో భారీగా కోత పెట్టింది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి