Share News

Waqf Bill Legal Battle: వక్ఫ్‌ బిల్లు చట్టబద్ధతపై సుప్రీంకు కాంగ్రెస్‌, ఎంఐఎం

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:08 AM

వక్ఫ్‌ సవరణ బిల్లును కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వారు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు

Waqf Bill Legal Battle: వక్ఫ్‌ బిల్లు చట్టబద్ధతపై సుప్రీంకు కాంగ్రెస్‌, ఎంఐఎం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించిన వక్ఫ్‌ సవరణ బిల్లును కాంగ్రెస్‌, ఏఐఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. రాజ్యాంగ నిబందనలను అది ఉల్లంఘిస్తోందని బిహార్‌లోని కిషన్‌గంజ్‌ కాంగ్రెస్‌ ఎంపీ మొహమ్మద్‌ జావేద్‌, ఎంఐఎం అధ్యక్షుడు-హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్‌పై ఏర్పాటైన జేపీసీలో వీరిద్దరూ సభ్యులు కూడా. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని.. వారి మతపరమైన స్వేచ్ఛను అడ్డుకునేలా ఉందని.. వక్ఫ్‌ ఆస్తులు, నిర్వహణపై నియంత్రణ విధిస్తోందని జావేద్‌ తరఫు న్యాయవాది అనాస్‌ తన్వీర్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరోవైపు, వక్ఫ్‌ బిల్లును లోక్‌సభలో బుల్డోజ్‌ చేశారన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బిల్లుపై దాదాపు 14 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 61 మంది ఎంపీలు చర్చలో పాలుపంచుకున్నారు. మూడు సార్లు ఓటింగ్‌ జరిగింది. ఇంత విస్తృత చర్చ, సముచిత ఆమోదం తర్వాత.. సభ నియమావళినే సీనియర్‌ నేత ప్రశ్నించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య గౌరవానికి తగినట్లుగా లేదు’ అని ఆయన అన్నారు. వక్ఫ్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఇదిలా ఉండగా, వక్ఫ్‌ సవరణ బిల్లు వ్యవహారం ఎన్డీయే కూటమి పార్టీ జేడీయూలో ముసలం పుట్టించింది. ఈ బిల్లుకు అనుకూలంగా జేడీయూ ఎంపీలు పార్లమెంటులో ఓటు వేయడాన్ని తప్పుబడుతూ ఐదుగురు కీలక నేతలు పార్టీకి రాజీనామాలు సమర్పించారు. వీరిలో షహనవాజ్‌ మాలిక్‌, మొహమ్మద్‌ అన్సారీలు గురువారం రాజీనామా చేయగా, నదీమ్‌ అఖ్తర్‌, రాజు నయ్యర్‌, తబ్రిజ్‌ సిద్దిఖిలు పార్టీకి శుక్రవారం గుడ్‌బై చెప్పారు.


రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు 128-95తో అమోదం

వక్ఫ్‌ బిల్లుపై రాజ్యసభలో బీజేపీకి కష్టాలు తప్పవన్న అంచనాలను ఆ పార్టీ తలకిందులు చేసింది. బిల్లుకు 128 మంది సభ్యుల స్పష్టమైన మద్దతును కూడగట్టుకుంది. వీరిలో ఐదుగురు బీజేడీ ఎంపీలు, వైసీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ కూడా ఉన్నారు. రాజ్యసభలో 9 ఖాళీలు ఉండగా.. సభలో 236 మంది మిగిలారు. వీరిలో 128 మంది బిల్లుకు మద్దతుగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 13 మంది గైర్హాజరయ్యారు. ఇండియా, ఎన్డీయే కూటములకు చెందని 23 మంది ఎంపీల్లో 13మంది గైర్హాజరు కావడం బీజేపీ వ్యూహ చతురతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:08 AM