Share News

Viral: పైకి డాక్టర్‌లా ఫోజు.. ఆమె చేసే పనులు మాత్రం..

ABN , Publish Date - Apr 04 , 2025 | 08:27 PM

ఈజీ మనీకి అలవాటు పడి కొందరు వ్యక్తులు.. అనేక రకాల వేషాలు వేస్తుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అన్న చందంగా.. రకరకాల అవతారాలెత్తుతారు. తాజాగా ఓ మహిళ ఈజీ మనీ కోసం డాక్టర్ అవతారమెత్తింది. చిన్నా చితకా ఆస్పత్రి కాదు.

Viral: పైకి డాక్టర్‌లా ఫోజు.. ఆమె చేసే పనులు మాత్రం..
Woman Poses as Doctor

ఈజీ మనీకి అలవాటు పడి కొందరు వ్యక్తులు.. అనేక రకాల వేషాలు వేస్తుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అన్న చందంగా.. రకరకాల అవతారాలెత్తుతారు. తాజాగా ఓ మహిళ ఈజీ మనీ కోసం డాక్టర్ అవతారమెత్తింది. చిన్నా చితకా ఆస్పత్రి కాదు. ఏకంగా దేశ రాజధానిలోని ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో తన ట్యాలెంట్‌ను ప్రదర్శించింది. అలాగని ఏదో ట్రీట్‌మెంట్ చేసేయలేదండోయ్.. పక్కా చోర్ లెక్కలు చేసింది. డాక్టర్ వేషంలో మెడికల్ కాలేజీ హాస్టల్‌లో దూరింది. ఆ తరువాత సీన్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. మరి ఆ మహిళ డాక్టర్ వేషం ఎందుకేసింది.. హాస్టల్‌లో చొరబడి ఏం చేసింది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..


గత నెల 27వ తేదీన ఎయిమ్స్‌లో ఓ మహిళా వైద్యురాలి గదిలోంచి విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇదే విషయంపై బాధితురాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయం వెలుగు చూసింది. మ్యాటర్ తెలుసుకుని ఆస్పత్రివర్గాలు సైతం షాక్‌కు గురయ్యారు. పోలీసులు 100కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అందులో ఓ మహిళ వైద్యురాలి దుస్తుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది. వైద్యులంతా తమ తమ విధులకు వెళ్లగా.. ఈమె మాత్రం వారి గదులకు వెళ్లే ప్రయత్నం చేసింది. వారి గదుల తాళాలు తెరిచేందుకు ప్రయత్నించింది. కాసేపటి తరువా తన స్కూటర్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్కూటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆరా తీసిన పోలీసులు.. అనుమానితురాలిది ఘజియాబాద్‌లని బ్రిజ్ విహార్‌గా గుర్తించారు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు వివరాలన్నీ బయటపెట్టింది. అంతేకాదు.. విచారణ సమయంలో నిందితురాలు చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అయ్యారు.


నిందితురాలు ఏం చెప్పిందంటే..

ఈ డూప్లికేట్ డాక్టర్‌ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసింది. పలు సందర్భాల్లో ఎయిమ్స్‌కి వెళ్లి వస్తుండేది. ఆ సమయంలో చాలా మంది మహిళా వైద్యులు తమ గదులకు తాళం వేయకుండానే విధులకు వెళ్లడాన్ని గుర్తించింది. దీనిని అవకాశంగా మలుచుకున్న మహిళ.. వైద్యుల ఇళ్లలో చోరీలకు పాల్పడింది. అన్నింటికంటే ముఖ్యంగా.. ఆమెకు ఆభరణాలంటే చాలా ఇష్టమట. వాటిని కొనే స్థోమత లేకపోవడంతో దోపిడీ మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌లో వైద్యుల ఇళ్లలో చొరబడి దోపిడీకి పాల్పడింది. నిందితురాలి వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, బంగారు ఉంగరం, ఒక జత బంగారు చెవిపోగులు, గోల్డ్ బ్రాస్‌లెట్, రూ. 4,500 నగదు, 522 మలేషియన్ రింగిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు.. అనేక సందర్భాల్లో ఎయిమ్స్‌లోకి చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది.

Updated Date - Apr 04 , 2025 | 08:27 PM