Mythological Roles: వెండి తెర రాముడు
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:34 AM
తెలుగు సినిమాల్లో శ్రీరాముడి పాత్రకు ఎన్టీఆర్ అనేది చిరస్మరణీయమైన పేరు. యడవల్లి సూర్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు మొదటగా రాముడిగా కనిపించినా, ఆ పాత్రకు శాశ్వత గుర్తింపునిచ్చినవారు ఎన్టీఆరే.

తెలుగు సినిమాలకు, శ్రీరామునికి ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమాల్లో రాముడు అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు. నిజానికి ఎన్టీఆర్ కంటే ముందు తెలుగులో తొలిసారిగా రాముడి పాత్రను పోషించినవారు యడవల్లి సూర్యనారాయణ. ఆ తర్వాత పారుపల్లి సుబ్బారావు. కానీ, రాముడి పాత్రలో ఎంత మంది నటించినా గుర్తొచ్చేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే.
1932లో వచ్చిన ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’లో యడవల్లి సూర్యనారాయణ తొలిసారిగా రాముని పాత్రలో కనిపించారు. అప్పటికే రంగస్థల నటుడిగా పేరున్న సూర్యనారాయణ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ నిర్మించింది. తెలుగులో రెండో టాకీ చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత 1934లో వచ్చిన మొదటి ‘లవకుశ’లో పారుపల్లి సుబ్బారావు రాముడి పాత్రను పోషించారు. 1959లో ఎన్.ఎన్.ఎ. ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’లో అమర్‌నాథ్ రాముడిగా నటించారు.
రెండో రాముడు ఏఎన్‌ఆర్
1944లో వెండితెరకు రెండో రాముడిగా అక్కినేని నాగేశ్వరరావు పరిచయమయ్యారు. ‘సీతారామ జననం’లో శ్రీరాముడి పాత్రను ఆయన చక్కగా పోషించారు. ఈ సినిమా తర్వాత 1945లో వచ్చిన ‘పాదుకా పట్టాభిషేకం’లో సీఎ్‌సఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు.
అదే మొదటిసారి
‘చరణదాసి’ అనే సాంఘిక కథా చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి వేశంలో కన్పించారు. 1958లో విడుదలైన తమిళ ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముని పాత్రలో పూర్తి స్థాయిలో నటించారు. ఆ తర్వాత వచ్చిన ‘లవకుశ’ ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లోనూ ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రలో నటించారు. ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘సీతారామ కల్యాణం’ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వహించారు.
శోభన్‌బాబు
‘భక్త పోతన‘లో శోభన్‌బాబు తొలిసారిగా రాముడి పాత్రలో ఓ ఐదు నిమిషాలు కన్పిస్తారు. అలాగే బాపు దర్శకత్వంలో రూపొందిన ‘సంపూర్ణ రామాయణం’లో పూర్తి స్థాయిలో రాముడి పాత్రను పోషించారు.
ఈ సినిమా శోభన్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ తరవాత రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఒక్క శోభన్‌బాబుకే దక్కుతుంది. బాపు దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా ‘సీతాకల్యాణం’. ఇందులో జయప్రద సీతగా, మలయాళ నటుడు రవి రాముడిగా నటించారు. బాపు తెరకెక్కించిన చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో నందమూరి బాలకృష్ణ రాముడిగా నటించారు. ‘లవకుశ’కు రీమేక్‌గా తీసిన ఈ చిత్రంలో బాలకృష్ణ అద్భుతంగా నటించి ఎన్టీఆర్‌ను మైమరపించారు.
బాల రాముడు
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం(1996)’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించారు. అన్ని పాత్రలనూ బాలలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
‘సీతారామ కల్యాణం’, ‘శ్రీరామ కథ’ చిత్రాల్లో హరనాథ్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు.
తొలి తరం తెలుగు నటుల్లో ఒకరైన కాంతారావు ‘వీరాంజనేయ’లో రాముడిగా కనిపించారు.
కృష్ణ తన తొలి చిత్రం ‘తేనె మనుసులు’లో రాముడి అవతారంలో కన్పించారు. ‘అల్లూరి సీతారామరాజు’లో కూడా ఓ చోట రాముడి పాత్రను పోషించారు.
‘రామదాసు’ సినిమాలో సుమన్, ‘దేవుళ్లు’ చిత్రంలో శ్రీకాంత్ రాముడిగా అలరించారు.
రామాయణం నేపథ్యంలో చివరగా వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో కథను ఆధునిక రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News