Confident With Shape: చక్కని రూపం కోసం సురక్షిత చికిత్సలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:29 AM
శరీరంలో వచ్చే రూప పరిమాణ మార్పులకు సౌందర్య చికిత్సలు సురక్షితమైన పరిష్కారం అందిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అనుభవజ్ఞులైన వైద్యుల సహాయంతో చిన్నచిన్న కోతలతో చికిత్సలు చేయించుకోవచ్చు

అందం చందం
ఏ ఇద్దరి వేలి ముద్రలూ ఒకేలా ఉండనట్టే, ఏ ఇద్దరి శరీరాలూ ఒకేలా ఉండవు. అలాగే కొవ్వు పేరుకునే అవయవాలు, చర్మం సాగిపోయే స్వభావాలు కూడా వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. పెరిగే వయసుతో పాటు మారిపోతూ ఉంటాయి. ఈ ఇబ్బందులను సరిదిద్దుకోగలిగే సౌందర్య చికిత్సలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అసౌకర్యాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఈ చికిత్సలను ఆశ్రయించడం అవసరమేనని అంటున్నారు వైద్యులు.
పెద్ద రొమ్ముల సమస్య
ప్రస్తుతం పెళ్లీడు యువతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘జైగాంటియోమాస్టియా’! చిన్న వయసులోనే తొలి నెలసరి మొదలు కావడం, పెద్ద రొమ్ముల కుటుంబ చరిత్రను కలిగి ఉండడం వల్ల, కొందరు యువతుల్లో రొమ్ముల పరిమాణం పెరిగిపోయి, మెడ నొప్పి, వెన్ను నొప్పి వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక రకరకాల బ్రాసరీలను ప్రయత్నించే అమ్మాయిలు ఉంటారు. నలుగురిలో కలవలేక, ఉద్యోగాలు మానుకుని ఇళ్లకే పరిమితమైపోయే అమ్మాయిలూ ఉంటారు. ఇలాంటి యువతుల రొమ్ముల సమస్యకు రెండు కారణాలుంటాయి.
లేజర్ లైపోసక్షన్: పెద్ద పరిమాణానికి కారణం కొవ్వు మాత్రమే అయితే, నాలుగు మిల్లీమీటర్ల రంథ్రం ద్వారా, లేజర్, పవర్ అసిస్టెడ్, వేజర్ లైపోసక్షన్‌లతో కొవ్వును కరిగించి తొలగించవచ్చు. కానీ ఈ సర్జరీతో సాగిన రొమ్ములను సరి చేసే వీలుండదు.
సర్జరీతో: ఒకవేళ పెద్ద రొమ్ములకు, కొవ్వుతో పాటు గ్రంథులు కూడా కారణమైన పక్షంలో, సర్జరీతో రెండు రొమ్ముల్లోని అదనపు కొవ్వు, గ్రంథులనూ తొలగించవలసి వస్తుంది. ఈ సర్జరీతో కిందకు జారిన రొమ్ములను పైకి సరిచేసే వీలు కూడా ఉంటుంది. మూడు గంటల నిడివి ఉండే ఈ సర్జరీ చేయించుకున్న రోజు సాయంత్రమే ఇంటికి వెళ్లిపోవచ్చు. మరుసటి రోజు నుంచి స్నానం చేయొచ్చు, డెస్ట్ జాబ్స్ చేసుకోవచ్చు. సర్జరీ చిన్న కోతతో పూర్తవుతుంది. కాబట్టి గాయం మానిపోయిన తర్వాత స్కార్ క్రీమ్స్ వాడుకుంటే, మచ్చ ఎబ్బెట్టుగా కనిపించకుండా చర్మంలో కలిసిపోతుంది. ఇక నొప్పి విషయానికొస్తే, సర్జరీ చేసే సమయంలోనే నర్వ్ బ్లాక్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సర్జరీ తర్వాత 16 గంటల వరకూ నొప్పి పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడుకుంటే సరిపోతుంది. ఇలా రొమ్ముల్లోని కొవ్వును తొలగించే క్రమంలో కొన్ని పాల గ్రంథులు దెబ్బతింటాయి. కాబట్టి పెళ్లై, తల్లైన తర్వాత బిడ్డకు సరిపడా పాలు తయారు అవకపోవచ్చు. సాధారణ మహిళలతో పోలిస్తే, ఇలా రొమ్ము సర్జరీ చేయించుకున్న వారిలో చనుపాల ఉత్పత్తి 40 నుంచి 50ు మేరకు తగ్గుతుంది.
పెళ్లీడు యువతుల్లో...
అవాంఛిత రోమాలు, రొమ్ముల్లో లోపాలు పెళ్లీడు యువతులను వేధిస్తూ ఉంటాయి. వీటికి లేజర్ చికిత్సలతో పాటు, ఇంప్లాంట్స్, బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆకర్షణీయంగా కనిపించడం కోసం స్కిన్ బూస్టర్స్, లేజర్ టోనింగ్‌లను ఆశ్రయించవచ్చు. కొందరు యువతులకు శరీరంలోని కొన్ని ప్రదేశాల్లోనే కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కొందరికి చేతుల్లో, పిరుదుల్లో, పొట్టలో, రొమ్ములో ఎక్కువ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును తొలగించుకోవడం కోసం లేజర్ లైపోసక్షన్‌ను ఆశ్రయించవచ్చు. లేజర్స్‌తో పాటు అలా్ట్రసౌండ్ లైపోసక్షన్‌లో భాగంగా ‘వేజర్స్’ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. జనరల్ అనస్థీషియాలో, ఈ సర్జరీలతో ఆయా శరీర భాగాల్లోని అదనపు కొవ్వును తొలగించి, చక్కని ఆకృతిలోకి మలుచుకోవచ్చు.
ముక్కులోలోపాలు
పుట్టుకతోనే సంక్రమించిన వంకర ముక్కు, చట్టి ముక్కు, బండ ముక్కులను సరిదిద్దే రైనోప్లాస్టీ చికిత్సలు కూడా ఉన్నాయి. శ్వాసలో సమస్యలు, ముక్కు నుంచి నీరు కారే అలర్జిక్ రైనైటిస్‌లకు కారణమయ్యే నాశికా లోపాలను సరిచేసే చికిత్సలతో పాటు ఆకారాన్ని సరిదిద్ది ఆకర్షణీయంగా మలిచే సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సర్జరీలకు, సమస్య తీవ్రతను బట్టి గంటన్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇలాంటి రైనోప్లాస్టీ సర్జరీల్లో కూడా మూడు రకాలుంటాయి.
లిక్విడ్ రైనోప్లాస్టీ
ముక్కు మీద గుంటలున్నప్పుడు సర్జరీతో పని లేని లిక్విడ్ రైనోప్లాస్టీతో జెల్‌తో అవకారాలను సరిదిద్దే వీలుంటుంది. కానీ ఈ ప్రభావం ఏడాదికి మించి ఉండదు.
ఇంప్లాంట్స్
ముక్కు ఎత్తు పెంచడానికి సిలికాన్ ఇంప్లాంట్స్‌ను వాడుకోవచ్చు.
సర్జికల్ రైనోప్లాస్టీ
ముక్కు మొత్తాన్నీ తెరిచి, లోపాన్ని సమూలంగా సరిదిద్దే సర్జరీ ఇది. దీన్లో ముక్కులోని ఎముక, మృదులాస్థిలను పునర్నిర్మిస్తారు.
డొప్ప చెవుల కోసం
కొంతమందికి పుట్టుకతోనే గబ్బిలం చెవుల్లా చెవులు విప్పారి ఉంటాయి. చెవుల్లోని మృదులాస్థిలో ముడతలు ఏర్పడని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి వాళ్లకు చెవి వెనక కోత పెట్టి మృదులాస్థిని మడత పెట్టడం జరుగుతుంది. దాంతో చెవులు వెనక్కి వెళ్లిపోతాయి. లోకల్ అనస్థీషియాతో చేసే ఈ సర్జరీ పూర్తయిన తర్వాత, రెండు గంటల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు.
బిగుతును పెంచే ‘వెజైనోప్లాస్టీ’
సాధారణ ప్రసవంతో వెజైనా చుట్టూరా ఉన్న కండరాలన్నీ వదులైపోతాయి. ఫలితంగా కొందర్లో మూత్రం మీద నియంత్రణ తప్పుతుంది. దాంతో దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య తీవ్రత తక్కువగా, మొదటి రెండు దశలకే పరిమితమై ఉన్నప్పుడు వెజైనోప్లాస్టీ సర్జరీని ఎంచుకోవచ్చు. సమస్య మొదటి దశలో ఉన్న వాళ్లకు లేజర్ వెజైనోప్లాస్టీ సరిపోతుంది. ఈ సర్జరీ తర్వాత లైంగిక కలయిక కోసం ఆరు వారాలు ఆగవలసి ఉంటుంది. వదులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీ తప్పదు. అలాగే వరుస ప్రసవాల వల్ల లేబియా వ్యాకోచించి, చమటతో, పిగ్మెంటేషన్‌తో బాధపడే మహిళలు కూడా ఉంటారు. ఇలాంటివారికి ‘లేబియోప్లాస్టీ’ సర్జరీ అందుబాటులో ఉంది.
అమ్మలకు... మమ్మీ మేకోవర్
పిల్లలను కన్న తర్వాత మహిళల శరీరాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. పైబడే వయసుతో ముఖంలో మార్పు రావచ్చు. రొమ్ములు జారిపోవచ్చు. పొట్టలో కొవ్వు పేరుకుపోవచ్చు.
రొమ్ముల్లో మార్పులు: రొమ్ములు బిగుతు సడలి, గాలి తీసిన బెలూన్లలా కిందకు జారిపోతాయి. కొందరికి పరిమాణం పెరిగి మెడ నొప్పి, వెన్ను నొప్పి వేధిస్తాయి. వీళ్లకు కొవ్వు తగ్గించే బ్రెస్ట్ రిడక్షన్, బిగుతును పెంచే బ్రెస్ట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్, పైకి లేపే బ్రెస్ట్ లిఫ్ట్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఎత్తు పొత్తికడుపు: వరుస ప్రసవాల వల్ల పొట్టలోని కండరాలు వదులై, కిందకు జారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. టమ్మీ టక్ చికిత్సతో ఈ సమస్యను సరిదిద్దే వీలుంది. పిరుదులు, నడుము, పొట్ట చుట్టూరా లైపోసక్షన్ చేసి, కండరాల బిగుతును పెంచి, అదనపు చర్మాన్ని తొలగించే సర్జరీ ఇది.
15 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళల శరీరాలు పలు రకాల మార్పులకు లోనవుతూ ఉంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, శరీరంలో కొవ్వు పేరుకుపోయే తత్వాలు, ముఖంలో చోటుచేసుకునే వృద్ధాప్య లక్షణాల వల్ల ఆకర్షణ తగ్గిన మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు, శారీరక అసౌకర్యాలకు కూడా లోనవుతూ ఉంటారు. అయితే అవగాహన లోపంతో, అశ్రద్ధతో ఈ అసౌకర్యాలను నిర్లక్ష్యం చేసే మహిళలే ఎక్కువ. కానీ నిజానికి మనసుకూ, శరీరానికీ ఇబ్బందిగా తోచే ఏ ఒక్క మార్పునూ నిర్లక్ష్యం చేయవలసిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న సౌందర్య చికిత్సలతో వాటిని సరిదిద్దుకుని ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన వైద్యుల సహాయంతో, చిన్న కోతలతో, దుష్ప్రభావాలు లేని చికిత్సలతో చక్కని ఫలితాన్ని రాబట్టుకుని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
-డాక్టర్ గురు కర్ణ వేముల
డైరెక్టర్, పెర్సోనిక్స్ కాస్మెటిక్ అండ్
ప్లాస్టిక్ సర్జరీ సెంటర్, మణికొండ, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..