దశనాదఆరాధన
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:42 AM
తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో సహా పది (దశ) దిశలున్నాయి. అలాగే గోవు, భూమి, ధాన్యం, వస్త్రాదులతో కలిపి దశవిధ దానాలూ ఉన్నాయి. ఇలాంటివే దశ నా ద ధ్వనులు. ఈ దశ నాద ధ్వనుల...

తెలుసుకుందాం
దశనాదఆరాధన
తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో సహా పది (దశ) దిశలున్నాయి. అలాగే గోవు, భూమి, ధాన్యం, వస్త్రాదులతో కలిపి దశవిధ దానాలూ ఉన్నాయి. ఇలాంటివే దశ నా ద ధ్వనులు. ఈ దశ నాద ధ్వనుల అంతరార్థం మనో నివేదన. నాదమైనా.. నినాదమైనా దైవారాధనలోని ప్రధాన భాగమే. మనసును కేంద్రీకరించడంలోని అంతర్భాగమే ఈ నాద ఆరాధన ! అలాంటి ఆరాధానలేమిటో తెలుసుకుందాం.
జల నాదం: దీని ప్రస్తావన ’వర్ణన రత్నాకరం‘లో ఉంది. చిన్న నీటి ఊట నుంచి మహాసముద్రం వరకు అంతా జలమే. నీటితో నిండిన పాత్రలతో జల తరంగిణి మన దేశంలో అలనాడు పేరొందిన వాద్యం. దీని ప్రత్యేకతను ఒకప్పటి ’సంగీత పారిజాతం‘ గ్రంథం వివరిస్తుంది.
చిణి నాదం: ఇది పూర్తి విభిన్న శైలి. గురుశిష్య విద్యానుబంధానికి సంబంధించింది. గురూపదేశం అనుసరించి, చెవులు మూసి వినే విధానం ఇది. ప్రత్యేకించి ఓంకార స్వరం క్రమేణా చిరుగజ్జెల మోతలా పరివర్తితమవుతుంది. మంత్రం లేదా సందేశం వల్ల వీనులకు విందు అందుతుంది. అది ’చిణి‘ శబ్దాన్ని పోలి ఉంటుంది.
భేరీ నాదం: పెద్ద పెద్ద వాయిద్యాలతో మోతే భేరీ నాదం. దీని ప్రత్యేకతను ’శివ పురాణం‘లో వినవస్తుంది. ఆలయ బ్రహ్మోత్సవాల తరుణంలో ఢమరుక శబ్దాలు, నినాదాలు మామూలే. పోతన తెలుగు భాగవతంలో ఒకచోట ‘భేరీ భాంకారాలు’ అనే పద ప్రయోగం ఉంది. గుర్రాల గిట్టల తాకిడి, రథచక్రాల ఒరిపిడితో పాటు భటుల పాద ఘట్టనల తీవ్రత గురించి కూడా వివరం ఉంటుంది. ప్రద్యుమ్నుడు ధనుష్టంకారంతో శత్రు సేనలను భయభ్రాంతం చేశాడన్నది ఉత్కంఠను పెంచే ఘట్టం. అదే విధంగా కురుక్షేత్ర సమరంలో విజయభేరి ‘ఫెళఫెళ’ మోగిందని, ‘ధణం ధణం’ శబ్దం భీకరంగా ధ్వనించిందని ఇతిహాస కథనం. అలాంటి సందర్భంలో భేరీనాదం అరివీర భయంకరం.
కంకణి నాదం: ఇది మువ్వల సవ్వడి. దీనికే అందె, మంజీరం, పాదపట్టంగా పేర్లున్నాయి. గండపెండేరం తాలూకు శబ్దంగా పరిగణించవచ్చు. కాలి అందెలు ధరించి నడిచినప్పుడు ’ఘల్లు ఘల్లు‘ శబ్దం వస్తుంది. ‘ఘల్లు ఘల్లున కాలిగజ్జెలు మోగుతుంటే కలికి కలహంస నడకతో వచ్చింద’న్నది కవి హృదయం.
మృదంగ నాదం: మద్దెల, తప్పెట లాంటి చర్మవాయిద్యాల విశేషమిది. ‘మోత’, ‘దరువు’, ‘మేళం’గా అందరికీ విదితం. మృదంగం సర్వ సాధారణంగా సహ-వాయిద్యం. తబలా, డోలక్ రూపాల శబ్దాలు శ్రోతలను అలరిస్తుంటాయి. శివ, గణేశ, నంది రూపాలకు అత్యంత ప్రీతి పాత్రం మృదంగమే. నంది వాయించే మృదంగం మహేశునికి ఇష్టం కాబట్టే అది దైవిక వాద్యంగా ప్రత్యేకత అందుకుంది.
కాహళ నాదం: ‘ధ్వనులు పిక్కటిల్లగ శంఖ పటహ కాహళ’ అనేదీ తెలుగు భక్తి కావ్య వర్ణనే. ఇదీ వాద్య విశేష అనుసంధానమే. బాకాను బిగ్గరగా ఊదినంత శబ్ద తీవ్రత ఇది. పెద్ద ఢంకా, బూరగొమ్ము శబ్దాలను ‘కాహళ’తో సరిపోలుస్తుంటారు. ఈ నాద ధ్వని చాలా దూరం వ్యాపిస్తుంది. రామాయణ కావ్యంలోని యుద్ధ కథనంలో దీని విశదీకరణ గమనార్హం. ధనుష్టంకారం, బాణాల వర్షం, ప్రచండంగా విజృంభించడం, సింహనాదం చేస్తూ శత్రుసేనను ఓడించడం... వీటన్నింటి నేపథ్యాన సమరసీమలో కాహళ ధ్వని మిన్ను ముట్టిందనడం... ఆ శబ్ద ధాటికి సూచికలు. నటరాజును స్తుతించే వేళలో ’ఢమఢమ డమరుక నాదం, భంభం శంఖారావం, ధిమింధిమిత మంగళ మృదంగం‘ అంటున్నపుడే కాహళ నాద తరంగ ధాటి మన చెవికి సోకుతుంది.
ఘంటానాదం: ఆలయాన గంటను మోగించినప్పుడు కలిగే శబ్దం పరమాత్మ ప్రతిరూపమని ప్రతీతి. భక్తులను, పరిసర ప్రాంతాల్లోని ఇతరులనూ ప్రభావితం చేసేది ఘంటా నాదమే. ఏ శబ్దమైనా ఆగకుండా సాగడమే నాదం అనుకుంటే, అందులో కీలకమైనది ఘంటానాదం. గంటను భక్తి భావంతో మోగించడంతో, మనసు కేంద్రీకృతమై దైవం మీదనే లగ్నమవుతుంది. మోగే ఘంటిక కారణంగా మనో సంబంధమైన అనుభూతి అంతటా నిండుతుంది.
భ్రమర నాదం: భ్రమరం అంటే తుమ్మెద. అది చేసే సడినే ‘భ్రమర నాదం’గా భావిస్తుంటాం. ‘తుమ్మెద ఝంకారం’ అనేది తరచుగా మనం వినే మాట. ఆ నల్ల రెక్కల ప్రాణిని కావ్యభాషలో ‘చంచరీకం’, ‘భృంగం’గా పిలుస్తుంటాం. పురుగును తెచ్చి, మట్టి గూటిలో ఉంచి, చుట్టూ కప్పిన తర్వాత చిన్న రంధ్రాన్ని చేసి, ఆ చుట్టూతా శబ్దం చేస్తూ తిరుగుతుంటుంది భ్రమరం. దాని నిరంతర నాదం కొనసాగుతుండగానే, లోపలి కీటకానికి తుమ్మెద రూపు రావడమన్నది సహజసిద్ధ పరిణామం. ఇక్కడి సందర్భంలో ‘భ్రమర నాదం’ అనేది నిరంతర దైవ నామ స్మరణకు గుర్తు.
వేణునాదం: వేణు అనే పదం వినడంతోనే గీతా గానం మన చెవిన పడినట్లవుతుంది. వెదురు గొట్టం ఒకవైపు తెరిచి, మరోవైపు మూసి ఉండి, పై భాగాన గాలి ఊదేలా రంధ్రం కానవస్తుంది. దాని ఆధారంగానే వేణుగాన మాధుర్యం మనం అనుభవించగలుగుతాం.
మురళీ గాన రవళిని కావ్యాలెన్నో ప్రస్తావించాయి. ’మందారమూలే మదనాభిరామం, బింబాధరాపూరిత వేణునాదం‘ అనేది ఆ శబ్ద మధురిమను తేటతెల్లం చేస్తుంది. గోపాల మురళీరవానికి గోపికలు పరవశించారన్న అభివర్ణన ఉంది.
ప్రణవ నాదం: అన్నింటికన్నా మిన్న ప్రణవనాద భక్తి. ’ప్రణామయతి ఇత్యేస్మాత్ ప్రణవః’ అనేది ఒక శ్లోక భాగం. ‘సర్వం పరమాత్మే’ అనేంత అనుభవ రూపసారమే ప్రణవం. నుతి, కైవారం, ప్రణుతి, సాధువాదం... అన్నీ ఇందులోనివే. విష్ణు పదానికి పర్యాయం ప్రణవమే! ‘ఓం’ అని మొదలవుతుంది ప్రణవనాదం. ప్రాణనాడులకు స్పందన అందిస్తుంది.
జంధ్యాల శరత్‌బాబు,
9948345013
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News