Weather Updates: భాగ్యనగరంలో దంచికొట్టిన వాన.. రోడ్లన్నీ జలయమయం..
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:14 PM
Hyderabad weather update: హైదరాబాద్‌లో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని విధంగా వర్షం రావడంతో భాగ్యనగరవాసులు వేడి వాతావరణం నుంచి ఊరట లభించింది.

గత కొన్నాళ్లుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగరవాసులను వరణుడు కరుణించాడు. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది.

భానుడి సెగలతో అట్టుడుకిపోతున్న హైదరాబాద్ నగరాన్ని వరుణుడు శాంతింపజేశాడు. పలు చోట్ల వర్షం దంచికొట్టడంతో నగరవాసులకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినట్లయింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు అబిడ్స్, కోఠి, కూకట్‌పల్లి బషీర్ బాగ్, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో హఠాత్తుగా పెద్ద ఎత్తున వర్షం కురిసింది.

పంజాగుట్ట, మధురానగర్, అమీర్‌పేట, బోరబండ, సనత్‌నగర్, కృష్ణానగర్, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి..

నగరంలో మధ్యాహ్నం వరకూ వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హఠాత్తుగా భోరున వర్షం కురవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

ఒక్క భాగ్యనగరంలోనే కాక తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. అకస్మాత్తుగా వర్షం కురవడంతో రాష్ట్రంలో పలుచోట్ల కోతకు వచ్చిన ధాన్యం రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో మూడు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండ్రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Updated at - Apr 03 , 2025 | 05:14 PM