Share News

సెంచరీ హు‘షార్‌’..

ABN , Publish Date - Jan 19 , 2025 | 11:11 AM

‘ఇస్రో’ రాకెట్‌ ప్రయోగం... యావత్‌ భారతావని టీవీలో క్రికెట్‌మ్యాచ్‌ ఫైనల్‌లాగే ఉత్కంఠభరితంగా చూస్తుంది. ‘షార్‌’లో కౌంట్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశించేదాకా... మాన్యుల నుంచి సామాన్యుల దాకా ఊపిరిబిగబట్టి చూడటం అలవాటుగా మారింది.

సెంచరీ హు‘షార్‌’..

‘ఇస్రో’ రాకెట్‌ ప్రయోగం... యావత్‌ భారతావని టీవీలో క్రికెట్‌మ్యాచ్‌ ఫైనల్‌లాగే ఉత్కంఠభరితంగా చూస్తుంది. ‘షార్‌’లో కౌంట్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశించేదాకా... మాన్యుల నుంచి సామాన్యుల దాకా ఊపిరిబిగబట్టి చూడటం అలవాటుగా మారింది. ఇప్పటిదాకా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని, అనేక రికార్డులు సృష్టించిన ‘ఇస్రో’ మరో మైలురాయికి సిద్ధమయ్యింది. శ్రీహరికోటలోని ‘షార్‌’లో 100వ రాకెట్‌ (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15) ప్రయోగం... చర్చనీయాంశంగా మారింది. తొలినాళ్లలో సైకిల్‌ మీద శాస్త్రజ్ఞులు రాకెట్‌ను మోసుకెళ్లిన రోజుల నుంచి అత్యాధునిక రాకెట్లను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించే దిశగా దూసుకెళ్లిన ‘షార్‌’ వెలుగుజాడలివి...


అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చగల శక్తి మన దేశ అంతరిక్ష సంస్థ ‘ఇస్రో’కి మాత్రమే ఉంది. అందువల్లే అమెరికా, రష్యాలు సైతం తమ చిన్న ఉప గ్రహాల కోసం మన రాకెట్‌లను వినియోగించు కోవడానికి ముందుకొస్తున్నాయి. ఈ ప్రయోగాలన్నింటికీ వేదిక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట- ‘షార్‌’ కేంద్రం. పరిస్థితులు అనుకూలిస్తే మరికొన్ని గంటల్లో ఇక్కడి నుంచి 100వ రాకెట్‌ నింగికెగరనుంది. జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 15 రాకెట్‌ ఈ ‘సెంచరీ’ ఘనతను సాధించబోతోంది.

షార్‌ (సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌) నుంచి ఇప్పటి దాకా వివిధ రకాల 99 వాహన నౌకలను (రాకెట్లు) నింగిలోకి పంపారు. వీటి ద్వారా 538 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చారు. ఇందులో విదేశాలకు చెందిన ఉపగ్రహాలు 433 ఉన్నాయి. మన దేశానికి చెందినవి 105 ఉపగ్రహాలతో పాటు యూనివర్సిటీలకు చెందిన 13 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్లు అంతరిక్షంలోకి మోసుకువెళ్లాయి. ఇన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న శ్రీహరికోటను రాకెట్‌ ప్రయోగ వేదికగా ఎంపిక చేయాలనే ఆలోచనకు అంకురార్పణ ఎలా జరిగిందంటే...


రాకెట్‌ కేంద్రంగా... యానాదుల దీవి

మన దేశంలో కూడా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలన్న ప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ ఆకాంక్షకు 1967లో భారత ప్రభుత్వం అనుమతి లభించింది. రాకెట్‌ల ప్రయోగాలకు దేశంలో అనువైన ప్రదేశాన్ని ఎంపికచేసే బాధ్యతను ఆయనకే అప్పగించారు. ఏడాదికిపైగా ఆయన అన్వేషణ సాగింది. దక్షిణ భారతదేశంలో పులికాట్‌ సరస్సుకూ, బంగాళాఖాతానికీ నడుమ దట్టమైన అడవులతో నిండివున్న ఒక చిన్న దీవి విక్రమ సారాభాయ్‌ కంటబడింది. 175 చదరపు కిలోమీటర్లు విస్తరించివున్న ఆ దీవికి 50 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతం ఉంది. అప్పటికి బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని 18 గ్రామాల ప్రజలుండే చిన్న దీవి మాత్రమే అది. దట్టమైన అడవుల్లో యానాదులు, తీరానికి దగ్గరగా వ్యవసాయం మీద ఆధారపడినవారూ ఉండేవారు. ఆ దీవి పేరే శ్రీహరికోట. 1968లో రాకెట్‌ ప్రయోగాలకు శ్రీహరికోట అనువైన ప్రదేశమని విక్రమ్‌ సారాభాయ్‌ గుర్తించారు. 1969లో భారత ప్రభుత్వం శ్రీహరికోటను రాకెట్‌ కేంద్రంగా ప్రకటించింది. భూమధ్యరేఖకు అత్యంత దగ్గరగా 13 డిగ్రీల అక్షాంశం మీద ఉండడమే శ్రీహరికోట ఎంపికకు ప్రధాన కారణం.


పులికాట్‌లో రోడ్డు

శ్రీహరికోట రేంజ్‌ (షార్‌) 1969లో ఏర్పాటైంది. అయితే 1979 దాకా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ పరిధిలోనే ఉండేది. షార్‌లో నిర్మాణపనులను అక్కడి నుంచే పర్యవేక్షించేవారు. ప్రాజెక్టు ఇంజనీర్‌గా వైజే రావును నియమించారు. ఆయన ఆధ్వర్యాన శ్రీహరికోటలో పనులు, ప్రయోగాలు జరిగాయి. 1979లో షార్‌కు ప్రత్యేకంగా డైరెక్టర్‌ను నియమించడంతో పూర్తిస్థాయిలో ‘షార్‌’ కేంద్రం పనిచేయడం మొదలైంది. సూళ్లూరుపేట నుంచి పులికాట్‌ సరస్సు మధ్యలో శ్రీహరికోటకు రోడ్డు వేయడంతో నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2002లో సెప్టెంబరులో ‘సతీష్‌ ఽధావన్‌ స్పేస్‌ సెంటర్‌’ (షార్‌)గా దీని పేరును మార్చారు.

book7.2.jpg


తొలి సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగం

శ్రీహరికోట తొలి లక్ష్యం- వాతావరణ పరిశోధనకు ఉపకరించే చిన్న రాకెట్లను నిర్మించి ప్రయోగించడం. 1971 అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగంతో షార్‌ కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఒడ్డున ఉండే చిన్న లాంచ్‌ ప్యాడ్‌ మీద నుంచి వీటిని ప్రయోగించేవారు. అప్పట్లో సైకిళ్ల మీద ఈ రాకెట్‌లను శాస్త్రవేత్తలు తీసుకువెళ్లేవారు. అక్కడి నుంచి ప్రయోగాలు వేగవంతం అయ్యాయి. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలిగే రాకెట్‌ల తయారీ, ప్రయోగం మీద దృష్టి పెట్టారు. ఆతర్వాత దశలవారీగా ఎస్‌ఎల్వీ, ఏఎ్‌సఎల్వీ, పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ, జీఎ్‌సల్వీ-మార్క్‌3, ఎల్‌వీఎం3, ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్లను సులువుగా నింగిలోకి పంపే స్థాయికి ‘ఇస్రో’ ఎదిగింది. అనంతరం ఇదే శ్రీహరికోట చంద్రయాన్‌-1, మార్స్‌ అర్భిటల్‌ మిషన్‌, చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 వంటి ప్రయోగాలకు వేదికైంది. భవిష్యత్‌లో మానవ సహిత రాకెట్‌ ప్రయోగం కూడా ఇక్కడి నుంచే జరగనుంది.


తొలి ఉపగ్రహ ప్రయోగ రాకెట్‌ - ఎస్‌ఎల్వీ

చువ్వలా 22 మీటర్ల పొడవుండే తొలి రాకెట్‌ ఎస్‌ఎల్వీ-3 ప్రయోగం 1979 ఆగస్టు 10న శ్రీహరికోట నుంచి జరిగింది. కానీ ఇది విఫలమైంది. అయినా నిరాశ చెందకుండా సరిగ్గా ఏడాదికే రెండో రాకెట్‌ ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధమయ్యింది. 1980 జూలై 18న ఎస్‌ఎల్వీ-3 రాకెట్‌ రోహిణి ఆర్‌ఎస్‌ 1 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. దీంతో ప్రపంచంలో ఉప గ్రహాలను సొంతంగా ప్రయోగించగల సత్తా గలిగిన ఆరవ దేశంగా భారత్‌ స్థానం దక్కించుకుంది. కేవలం ఒక కెమెరా మాత్రమే ఉండే 35 కిలోల బరువుగల చిన్న ఉపగ్రహం రోహిణి. దీనిని భూ సమీప కక్ష్యలోకి ఎస్‌ఎల్‌వి 3 చేర్చింది. ఇది నాలుగంచెల రాకెట్‌. 17 టన్నుల బరువుంటుంది. ఆ తర్వాత వరుసగా మూడు ఎస్‌ఎల్‌వి-3 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టగా మూడూ విజయవంతం అయ్యాయి. అబ్దుల్‌ కలాం నేతృత్వంలో ఈ ప్రయోగాలు జరిగాయి. రెండో దశలో మరింత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే ప్రయోగాల్లో భాగంగా ఎఎస్‌ఎల్‌వి (అడ్వాన్స్‌డ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) రాకెట్లను ఇస్రో రూపొందించింది. 150 కిలోల బరువుండే ఉపగ్రహాలను ఇవి అంతరిక్షంలోకి చేర్చగలవు. 1987 మార్చి 24న ఏఎ్‌సఎల్వీ-డీ1 రాకెట్‌ ప్రయోగం జరిగింది. 1994 దాకా నాలుగు ఏఎస్‌ఎల్‌వి రాకెట్లను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇందులో రెండు విజయవంతమయ్యాయి. రెండు విఫలమయ్యాయి.


ఇస్రో విజయాశ్వం- పిఎస్‌ఎల్‌వి

మూడో దశలో ఇస్రో తయారు చేసిన రాకెట్‌ భారత కీర్తి ప్రతిష్టలను అంతరిక్ష స్థాయికి తీసుకువెళ్లింది. పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ ఇస్రో విజయాశ్వంగా పేరుపడింది. 3450 టన్నుల బరువుండే ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు పీఎస్ఎల్వీ వాహక నౌకను తొలుత 1990లో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. 1993 సెప్టెంబరు 20న తొలి వైఫల్యంతో పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు మొదలయ్యాయి. అంతే ఆ తర్వాత వెనుతిరగలేదు. విజయాల చరిత్రను ఈ రాకెట్‌ నమోదు చేసుకుంటూనే వెళ్తోంది. ఇప్పటివరకు 62 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు చేపట్టగా రెండు ప్రయోగాలు మినహా అన్నీ విజయవంతం అయ్యాయి. అందుకే ఈ రాకెట్‌ ద్వారానే చరిత్రాత్మకమైన చంద్రయాన్‌-1, మార్స్‌ అర్బిటల్‌ మిషన్‌ మంగళయాన్‌, ఇండియన్‌ రీజినల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్‌ఎ్‌స) మొదలైనవి ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు అమెరికా, రష్యా సహా అనేక దేశాలు ముందుకు వచ్చాయి.


సమాచార ఉపగ్రహాల కోసం...

కమ్యూనికేషన్‌ రంగానికి చెందిన భారీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ‘ఇస్రో’ జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ నిర్మాణం చేపట్టింది. 2001 ఏప్రిల్‌ 18న జీశాట్‌-1 ఉపగ్రహాన్ని ఈ వాహక నౌక ద్వారా రోదసీలోకి పంపి విజయం సాధించారు. ఈ రాకెట్‌లో మూడో అంచెలో వాడే క్రయోజనిక్‌ ఇంజన్‌లను ప్రారంభంలో రష్యా నుంచి తెచ్చేవారు. ఆ తర్వాత పూర్తిగా స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజన్‌లను ఇస్రో తయారు చేసుకుంది.


సిద్ధమవుతోన్న మూడో ప్రయోగ వేదిక

రాకెట్‌లను ప్రయోగించేందుకు షార్‌లో రెండు ప్రయోగ వేదికలు ఉన్నాయి. 1990లో తొలి ప్రయోగ వేదికను అందుబాటులోకి తెచ్చారు. రెండోదాన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించి 2005లో వినియోగంలోకి తీసుకువచ్చారు. దీని ద్వారానే భారీ ప్రయోగాలు చేపడుతున్నారు. ప్రస్తుతం షార్‌లో మూడో ప్రయోగ వేదిక కూడా నిర్మాణంలో ఉంది. రాకెట్‌ దశలను అనుసంధానం చేసేందుకు షార్‌లో రెండు వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లు ఉన్నాయి. మరిన్ని పీఎ్‌సఎల్వీ ప్రయోగాలు చేపట్టేందుకు పిఫ్‌ (పీఐఎఫ్‌) భవనం నిర్మించారు. ఈ పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనాన్ని 2024 ఫిబ్రవరి 27న ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగాల కోసం షార్‌లో ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్‌ను కూడా నిర్మించుకొన్నారు.


గగన్‌యాన్‌పై దృష్టి...

భవిష్యత్‌లో ‘ఇస్రో’ షార్‌ నుంచి మానవ సహిత ప్రయోగాన్ని చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ముందుగా మానవరహిత ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇదే కాకుండా సముద్రం లోపల అధ్యయనం చేసేందుకు ‘సముద్రయాన్‌’ చేపడుతోంది. చంద్రయాన్‌-4 ప్రయోగానికి కూడా ‘షార్‌’ వేదిక కానుంది.

- ఎడమని భాస్కర్‌, సూళ్లూరుపేట

- ఇస్రో చంద్రయాన్‌-1, చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3, సూర్యయాన్‌ (ఆదిత్య-ఎల్‌1), మార్స్‌ అర్బిటల్‌ మిషన్‌ (మామ్‌) వంటి గ్రహాంతర ప్రయోగాలు విజయవంతంగా చేపట్టి ప్రపంచ దేశాలకు దీటుగా నిలిచింది.


- చంద్రయాన్‌-3 మిషన్‌ను 2023 జూలై 14న ఇస్రో బాహుబలి ఎల్‌వీఎం4 రాకెట్‌ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ చంద్రయాన్‌-3ను నింగిలోకి తీసుకెళ్లింది. 42 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి పై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యింది. దీంతో అమెరికా, రష్యా, చైనా తరువాత చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. అనంతరం ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం కూడా విజయవతంగా చేశారు.

- 2017 ఫిబ్రవరి 15న పీఎ్‌సఎల్వీ-సీ 37 రాకెట్‌ ద్వారా ఒకేసారి రోదసీలోకి 104 ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా ఇన్ని ఉపగ్రహాలు పంపలేదు.


దేశం గర్వించదగ్గ కేంద్రం

సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) 1990 నుంచి భాగా అభివృద్ధి చెందింది. 1979 నుంచి 1992 మధ్య 8 రాకెట్‌ ప్రయోగాలు జరిగాయి. అప్పట్లో నేను త్రివేండ్రంలో పనిచేసేవాడిని. అబ్దుల్‌ కలాం సారథ్యంలోని ఎస్‌ఎల్వీ-3 ప్రాజెక్టులో, దేవ్‌ సారథ్యంలో ఏఎ్‌సఎల్వీ ప్రాజెక్టులో పనిచేశాను. రాకెట్‌ అనుసంధాన పనులు 4 నెలల పాటు జరిగేవి. త్రివేండ్రంలో ఉద్యోగం అయినా షార్‌లో రాకెట్‌ అనుసంధాన పనుల్లో ఎక్కువ కాలం పనిచేశాను. ఎస్‌ఎల్వీ, ఏఎ్‌సఎల్వీ రాకెట్‌ ప్రయోగాల ద్వారా పీఎస్ఎల్వీ, జీఎ్‌సఎల్వీ రాకెట్‌ డిజైన్లు నేర్చుకున్నాం. ఇప్పుడు షార్‌లో ఏడాదిలో పది, పన్నెండు రాకెట్‌ ప్రయోగాలు చేసేందుకు వసతులున్నాయి.

- ఎంవైఎస్‌ ప్రసాద్‌,

‘షార్‌’ మాజీ డైరెక్టర్‌

మైలురాళ్లు

1979 ఆగస్టు 10:

షార్‌ నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం

(ఎస్‌ఎ్‌సఎల్వీ-3)

2015 డిసెంబరు 16:

షార్‌ నుంచి (పీఎ్‌సఎల్వీ-సి 29)

50వ రాకెట్‌ ప్రయోగం.

2025 జనవరి 23, 24 :

(జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 15) 100వ రాకెట్‌ ప్రయోగం ఉండవచ్చు.

Updated Date - Jan 19 , 2025 | 11:19 AM