Share News

Golconda Diamond Blue: తెలంగాణలో పుట్టిన నీలి వజ్రం.. త్వరలో వేలం.. ధర ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Apr 14 , 2025 | 05:37 PM

గోల్కోండలో పుట్టి భారత రాజరిక వైభవానికి చిహ్నంగా నిలిచి అరుదైన నీలి వజ్రం ‘ది డైమండ్ బ్లూ’ త్వరలో వేలానికి రానుంది. ప్రముఖ ఆక్షన్ సంస్థ మే 14న దీన్ని జెనీవాలో వేలం వేయనుంది.

Golconda Diamond Blue: తెలంగాణలో పుట్టిన నీలి వజ్రం.. త్వరలో వేలం.. ధర ఎంతో తెలిస్తే..
Golconda Diamond Blue Auction

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో పుట్టిన అత్యంత అరుదైన నీలి వజ్రం ‘ది గోల్కొండ బ్లూ’ త్వరలో వేలం వేయనున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్ సంస్థ క్రిస్టీ మే 14 జెనీవాలో దీన్ని వేలానికి పెట్టనుంది. గోల్కొండ వజ్రాల గనుల్లో నుంచి వెలికి తీసిన ఈ 23.24 కారెట్ల వజ్రం విలువ సుమారు రూ.300 నుంచి రూ.430 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఈ వజ్రాన్ని వేలం వేయడం ఇదే తొలిసారి. దీంతో దీన్ని ఎవరో ఎంతకు సొంతం చేసుకోనున్నారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది (Golconda Diamond Blue Auction).

ఏమిటీ డైమండ్ బ్లూ

నీలి వర్ణంలో మిలమిలా మెరిసిపోయే ‘ది డైమండ్ బ్లూ’ వజ్రం భారతీయ రాచరిక వైభవానికి ఓ చిహ్నం . 259 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం.. ఇండోర్, బరోడా రాజ వంశాల వైభవానికి నిదర్శనం. ఇండోర్ మహారాజు 2వ యశ్వంత్ రావ్ హోల్కర్ చెంత ఉన్న ఆభరణాల్లో ఇదీ ఒకటి. ఆయన తండ్రి 1923లో ఫ్రెంచ్ నగల సంస్థ ఛామెట్‌తో ఓ బ్రెస్‌లెట్ తయారు చేయించారు. అందులో ది డైమండ్ బ్లూను పొదిగారు.


ఆ తరువాత యశ్వంత్ రావ్ గైక్వాడ్ ది డైమండ్ బ్లూతో పాటు గోల్కొండలో వెలికి తీసిన మరో రెండు వజ్రాలతో కలిపి ఓ నెక్లెస్‌లో చేయించారు. ఇండోర్ మహారాణి కంఠాన అలంకరించిన ఈ మణిహారం అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. నెక్లెస్ ధరించిన మహారాణి చిత్రాన్ని ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నాడ్ బూటే దీ మోన్వెల్ రూపొందించారు.

ఆ తరువాత కాలక్రమంలో చేతులు మారుతూ వచ్చిన ఈ వజ్రం 1947లో న్యూయార్క్ చెందిన హారీ విన్సట్ జువెలర్స్‌ వద్దకు చేరింది. ఆ జువెలర్స్ సంస్థ.. ది డైమండ్ బ్లూను బ్రూచ్ అనే మరో ఆభరణంలో పొదిగింది. అనంతరం దీన్ని బరోడా మహారాజు సొంతం చేసుకున్నారు. చివరకు అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయి తెరమరుగైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఇది వేలానికొచ్చింది.


అత్యంత అరుదైన ది డైమండ్ బ్లూ వజ్రాన్ని దక్కించుకునే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని ఆక్షన్ సంస్థ క్రిస్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. గోల్కొండ గనుల్లో పుట్టిన ఈ వజ్రం ప్రపంచంలోని నీలి డైమండ్స్‌లో అరుదైనదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై

సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

Read Latest and Viral News

Updated Date - Apr 14 , 2025 | 06:32 PM