3D Printed Railway Station: జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:57 PM
జపాన్‌లో ఓ రైల్వే స్టేషన్‌ను కేవలం ఆరు గంటల వ్యవధిలోనే నిర్మించారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో మరో ఇజినీరింగ్ అద్భుతం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. అరిడా నగరంలోని హట్సుషీమా స్టేషన్ పురాతన భవనం స్థానంలో ఈ కొత్త త్రీడీ ప్రింటెడ్ స్టేషన్ సిద్ధం చేశారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ అద్భుతంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇది ఎలా సాధ్యమైందంటే..
స్టేషన్ నిర్మాణానికి సంబంధించి విడి భాగాలనే త్రీడీ ప్రింటెడ్ టెక్నాలజీతో సిద్ధం చేసి ఆ తరువాత వాటిని ఒకదానితో మరొకటి అనుసంధానించి ఈ స్టేషన్ ఏర్పాటు చేశారు. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ ఈ స్టేషన్‌ను నిర్మించింది. కునమోటో ప్రిఫెక్చర్‌లో సంస్థకు ఉన్న ఫ్యాక్టరీలో మొదట రైల్వే స్టేషన్ టాపు, గొడలను త్రీడీ ప్రింటింగ్ పద్ధతిలో నిర్మించారు. వీటిని తయారు చేసేందుకు వారం రోజులు పట్టింది. ఆ తరువాత ఈ వీడి భాగాలను 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరిడాకు మార్చి 24న తరలించారు.
మార్చి 26 అర్ధరాత్రి వేళ చివరి రైలు స్టేషన్ నుంచి వెళ్లిపోయాక విడి భాగాల అసెంబ్లింగ్ కార్యక్రమం మొదలైంది. క్రేన్ సాయంతో వర్కర్లు ఒక్కో విడిభాగాన్ని పేరుస్తూ స్టేషన్‌ను నిర్మించారు. పాత స్టేషన్‌కు కొన్ని అడుగుల దూరంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయం తొలి రైలు బయలుదేరే లోపే స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. అంటే, కేవలం ఆరు గంటల్లోనే మొత్తం పూర్తి చేశారు. వాస్తవానికి స్టేషణ్ లోపల టిక్కెట్ మెషీన్లు, ఐడీ కార్డు రీడర్లు వంటివి ఏర్పాట్లు చేయాల్సిన పని ఇంకా మిగిలున్నా 90 పనులు ఆరు గంటల్లోనే పూర్తి కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ స్టేషన్ చిన్నదే అయినా జపాన్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కొన్ని పరిష్కారాలు చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. జనాభా తగ్గిపోతుండటంతో జపాన్‌లో కార్మికుల కొరత కూడా ఏర్పడింది. దీంతో, రైళ్ల కంపెనీలకు ట్రాక్, స్టేషన్ల మెయింటెనెన్స్ కష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. స్టేషన్‌ను వేగంగా నిర్మించడంపై పూర్తికావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి:
యువతి వింత హాబీ.. చచ్చిన దోమల్ని పేపర్‌పై అతికించి
మహిళకు షాక్.. ఆఫీసు టైమ్ కంటే నిమిషం ముందుగా ఇంటికెళ్లినందుకు..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..