Share News

Rajasthan Royals Defeat: ఏకపక్షం

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:02 AM

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాల్ట్‌ (65) మరియు కోహ్లీ (62 నాటౌట్‌) అర్ధ శతకాలు గెలుపులో కీలకంగా నిలిచాయి.

Rajasthan Royals Defeat: ఏకపక్షం

  • బెంగళూరు ఘన విజయం

  • 9 వికెట్లతో రాజస్థాన్‌ చిత్తు

  • జైస్వాల్‌ అర్ధ శతకం

జైపూర్‌: ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), కోహ్లీ (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్‌) అర్ధ శతకాలతో చెలరేగడంతో.. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్‌ (75), ధ్రువ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) రాణించారు. క్రునాల్‌, భువనేశ్వర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో బెంగళూరు 17.3 ఓవర్లలో 175/1 స్కోరు చేసి గెలిచింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. సాల్ట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఆరంభం నుంచే బాదుడు..: రాజస్థాన్‌ బ్యాటర్లు తడబడిన పిచ్‌పై ఓపెనర్‌ సాల్ట్‌ భారీ షాట్లతో విరుచుకుపడడంతో మ్యాచ్‌ ఏకపక్షమైంది. మరో ఓపెనర్‌ కోహ్లీతో కలసి సాల్ట్‌ తొలి వికెట్‌కు 52 బంతుల్లో 92 పరుగులు జోడించడంతో.. బెంగళూరు అలవోకగా గెలిచింది. బౌండ్రీతో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న సాల్ట్‌ను కార్తికేయ అవుట్‌ చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్‌తో కలసి కోహ్లీ రెండో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు జోడించడంతో.. బెంగళూరు మరో 15 బంతులు మిగిలుండగానే గెలుపుగీత దాటింది. ఈ క్రమంలో హసరంగ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన కోహ్లీ.. టీ20ల్లో తన వందో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.


శాంసన్‌ విఫలం..: ఓపెనర్‌ జైస్వాల్‌ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. జురెల్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ గౌరవప్రద స్కోరు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్‌ 45/0తో నిలిచింది. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో క్రునాల్‌ బౌలింగ్‌లో శాంసన్‌ స్టంపౌట్‌ కావడంతో.. తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన పరాగ్‌.. జైస్వాల్‌కు చక్కని సహకారం అందించాడు. ఈ క్రమంలో 13వ ఓవర్‌లో సింగిల్‌తో జైస్వాల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాతి ఓవర్‌లో పరాగ్‌ను యశ్‌ అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. ఇక, హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ క్యాచ్‌వదిలేయడంతో బతికిపోయిన జురెల్‌..తర్వాత ధాటిగా ఆడడంతో స్కోరు 170 మార్క్‌ దాటింది.

కోహ్లీకి లైఫ్‌..: 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సందీప్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పరాగ్‌ నేలపాలు చేశాడు. లాంగ్‌ ఆన్‌ నుంచి వచ్చిన పరాగ్‌.. నిర్లక్ష్యంగా క్యాచ్‌ను అందుకోవడంతో అది చేజారింది.

క్యాచ్‌ చేజార్చిన విరాట్‌..: ఫీల్డింగ్‌లో కోహ్లీ ఎంతో చురుగ్గా ఉంటాడనేది తెలిసిందే. అలాంటి విరాట్‌ చేతిలో పడ్డ బంతి కిందపడిపోవడంతో.. ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 17వ ఓవర్‌లో జురెల్‌ కొట్టిన బంతిని బౌండ్రీ వద్ద నుంచి ముందుకు వచ్చిన కోహ్లీ పట్టినట్టేపట్టి వదిలేశాడు. దీంతో అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.


స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (ఎల్బీ) హాజెల్‌వుడ్‌ 75, శాంసన్‌ (స్టంప్డ్‌) జితేష్‌ (బి) క్రునాల్‌ 15, పరాగ్‌ (సి) కోహ్లీ (బి) యశ్‌ 30, జురెల్‌ (నాటౌట్‌) 35, హెట్‌మయర్‌ (సి) పడిక్కల్‌ (బి) భువీ 9, రాణా (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 173/4; వికెట్ల పతనం: 1-49, 2-105, 3-126, 4-169; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-32-1, యశ్‌ దయాళ్‌ 4-0-36-1, హాజెల్‌వుడ్‌ 3-0-26-1, క్రునాల్‌ పాండ్యా 4-0-29-1, లివింగ్‌స్టోన్‌ 1-0-8-0, సుయాష్‌ శర్మ 4-0-39-0.

బెంగళూరు: సాల్ట్‌ (సి) జైస్వాల్‌ (బి) కార్తికేయ 65, కోహ్లీ (నాటౌట్‌) 62, పడిక్కల్‌ (నాటౌట్‌) 40; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.3 ఓవర్లలో 175/1; వికెట్ల పతనం: 1-92; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-36-0, తుషార్‌ దేశ్‌పాండే 2-0-21-0, సందీప్‌ 2.3-0-29-0, తీక్షణ 2-0-21-0, కుమార్‌ కార్తికేయ 3-0-25-1, హసరంగ 3-0-33-0, పరాగ్‌ 1-0-10-0.

Updated Date - Apr 14 , 2025 | 04:04 AM