Digital Arrest: డిజిటల్ అరెస్టు.. ఇవి తెలుసుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:35 PM
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో నేరస్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి చట్ట సంబంధ అధికారులుగా నటిస్తారు. అచ్చం నిజమైన అధికారులు మాదిరిగా దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తుంటారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రతి రోజూ కేటుగాళ్లు కొత్తపుంతలు తొక్కుతూ అమాయకుల నుంచి వేలు, లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో భారత్ సహా అన్ని దేశాల్లోనూ డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరిగిపోయాయి. ఈ డిజిటల్ అరెస్టు అనేది కూడా ఒక రకమైన సైబర్ మోసం. ఇందులో కేటుగాళ్లు.. ప్రభుత్వ అధికారుల మాదిరిగా నటిస్తూ బురిడీ కొట్టిస్తారు. బాధితులను భయాందోళనలకు గురి చేసి అందినకాడికి దోచుకుని ఉడాయిస్తారు.
డిజిటల్ అరెస్ట్ అంటే..
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో నేరస్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి చట్ట సంబంధ అధికారులుగా నటిస్తారు. అచ్చం నిజమైన అధికారులు మాదిరిగా దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తుంటారు. ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి మనీలాండరింగ్, పన్ను ఎగవేతకు పాల్పడ్డారని.. లేదా మీకు పార్మిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు ఉన్నాయని బెదిరిస్తారు. మీపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తారు. బాధితుడికి కనీసం ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే అడిగినంత నగదు, చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని బెదిరిస్తుంటారు. వారి మాటలు నమ్మిన ఎందరో డబ్బులు బదిలీ చేసి మోసపోతుంటారు.
గతేడాది కోట్లు కొట్టేశారు..
భారతదేశంలో 2024 మొదటి త్రైమాసికంలో రూ.120.30 కోట్లను డిజిటల్ అరెస్టుల ద్వారా కేటుగాళ్లు దోచేశారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నివేదిక చెబుతోంది. అలాగే భారతదేశంలో 2024 ఆర్థిక సంవత్సరంలో సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు నాలుగు రెట్లు పెరిగాయని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. దీని ఫలితంగా 20 మిలియన్ల డాలర్ల నగదును ప్రజలు కోల్పోయారని తెలిపింది.
డిజిటల్ అరెస్టుల నుంచి కాపాడుకునేందుకు ఈ ఐదు సూత్రాలు పాటించండి..
ప్రభుత్వ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి బెదిరింపులకు దిగితే ముందుగా భయపడకుండా ఉండాలి. ఫోన్ చేసిన వారి గుర్తింపును తనిఖీ చేసే ప్రయత్నం చేయాలి. దీని కోసం ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక సంప్రదింపు నంబర్ల ద్వారా ఫోన్ చేసిన వ్యక్తి నిజమైన అధికారో, కాదో నిర్ధారించుకోవాలి.
కాల్స్ చేసిన వ్యక్తులు ఎంత ఒత్తిడికి గురి చేసినా బ్యాంకులకు సంబంధించిన ఎలాంటి విషయాలనూ వారితో పంచుకోవద్దు. ఎంటీఎం కార్డ్ సీవీవీ, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని వారికి అస్సలు చెప్పొద్దు.
సైబర్ కేటుగాళ్లతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహాన్ని కోల్పోకూడదు. ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీకు బెదిరింపు కాల్ వస్తే భయాందోళనకు గురికాకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక్క నిమిషం కేటాయించండి.
డిజిటల్ అరెస్టు బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. అందుకు చట్టబద్ధమైన అరెస్టు నిబంధనలు, పౌరుడిగా మన హక్కులను తెలుసుకోవాలి.
ఫోన్ చేసిన వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ అధికారులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి. వారు మీ నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తే కచ్చితంగా ఫేక్ అధికారులని అర్థం. మీకు వారిపై అనుమానం వచ్చిన వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
TG High Court: వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న..