Ramappa Temple: కాన్వాసుపై కాకతీయ కళా వైభవం
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:47 AM
అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీకలైన గణపురం కోతగుళ్లు, చంద్రవెల్లి దేవాలయాలను 60 మంది చిత్రకారులు కాన్వాసుపై అద్భుతంగా చిత్రించారు.

టార్చ్ ఆధ్వర్వాన శిలా నిశ్శబ్దం చిత్ర ప్రదర్శన
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీకలైన గణపురం కోతగుళ్లు, చంద్రవెల్లి దేవాలయాలను 60 మంది చిత్రకారులు కాన్వాసుపై అద్భుతంగా చిత్రించారు. వీరిలో తెలంగాణ, ఏపీలకు చెందిన 56 మందితోపాటు ఒడిశా, ఛత్తీ్‌సఘఢ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు చిత్రకారులున్నారు. టార్చ్ స్వచ్ఛంద సంస్థ, కళాయజ్ఞం సంస్థలు సంయుక్తంగా మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘శిలా నిశ్శబ్దం’ పేరుతో నిర్వహిస్తున్న ప్రదర్శనను తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నిజాం వారసుడు రౌనఖ్ యార్‌ఖాన్ ప్రారంభించారు.
కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ చిత్రకారుడు శేష బ్రహ్మం, టార్చ్ వ్యవస్థాపకుడు అరవింద్ ఆర్యపై వక్తలు ప్రశంసలు కురిపించారు. ఈ నెల 14 వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. చివరిరోజు సోమవారం కాకతీయుల నాణేలు, ఆనాటి వస్తువులను ప్రదర్శనతో పాటు ప్రత్యేక సదస్సులు జరుగుతాయన్నారు. కాగా, టార్చ్ ఫౌండేషన్, కళా యజ్ఞ సంస్థలు సామాజిక మాధ్యమాల వేదికగా 60 మంది చిత్రకారులను జనవరిలో కాకతీయ కట్టడాల సందర్శనతో పాటు స్కెచ్ టూర్ నిర్వహించారు. కాకతీయు ల చరిత్ర, సంస్కృతి, నిర్మాణ విశిష్టత మీద నిపుణులతో ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహించారు. అలా చిత్రకారులు గీసిన పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచారు.