KTR: విచారణకు వేళాయె!
ABN, Publish Date - Jan 04 , 2025 | 03:48 AM
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సన్నద్ధమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొంది.
ఈ నెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు హాజరుకండిఠి
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసు
7న రావాలంటూ అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా..
ఒప్పందాలు, చాటింగ్, ఈ-మెయిల్స్ ఆధారంగా విచారణ
ఇప్పటికే కేటీఆర్‌ను ఏడో తేదీన విచారణకు రావాలన్న ఈడీ
న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు క్వాష్ పిటిషన్‌పై ఉత్కంఠ
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సన్నద్ధమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. ఇదే కేసులో సహ నిందితులైన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. వారిని ఏడో తేదీన విచారణకు రావాలని సదరు నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారమంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగిందంటూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 19వ తేదీన కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (1), (ఏ) రెడ్ విత్ 13 (2), సెక్షన్ 409, 120 బి ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.
ఆ తర్వాత.. ఫార్ములా -ఈ కారు రేసు వ్యవహారంలో అసలేం జరిగిందన్న వివరాలను దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు. పురపాలక శాఖ నుంచి అనేక పత్రాలను సేకరించారు. సీఎస్ శాంతి కుమారికి గతంలో అర్వింద్ కుమార్ ఇచ్చిన వివరణ ప్రతిని తెప్పించుకున్నారు. ఈ కేసులో విచారణ ప్రారంభించాలని భావించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఫార్ములా ఈ కారు రేసు బాధ్యత అంతా తనదేనని తొలుత మీడియాతో అన్న కేటీఆర్.. ఆ తర్వాత ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు ప్రకటించే వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని, విచారణను మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే, ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
పత్రాల ఆధారంగానే విచారణ
కేటీఆర్‌ను విచారించడానికి ముందు ఏసీబీ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా.. ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు ఏమిటి!? వాటిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది? ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు? వీరి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ వివరాలేమిటి!? ఈ-మెయిల్ సందేశాలేమిటి? తదితర విషయాలను చాలా వరకు ఏసీబీ అధికారులు సేకరించారు. వీటన్నింటి ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశముంది. ఇక, ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏం జరిగిందన్న వివరాలను ఈ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి రాతపూర్వకంగా అందజేశారు. సీఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు అందులో ఆయన బదులిచ్చారు. అందులో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెబుతానని, అరెస్టు నుంచి తనను బయటపడేయాలని అర్వింద్ కుమార్ లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, అర్వింద్ కుమార్, కేటీఆర్ చెప్పినట్లే తాను చేశానని, అంతకుమించి తనకేమీ తెలియదని హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఈడీ విచారణ కూడా..
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై దృష్టిసారించిన ఈడీ అధికారులు.. కేటీఆర్‌ను ఈనెల ఏడో తేదీన విచారణకు రావాలంటూ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ ఈనెల 2, 3 తేదీల్లో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. వారు కొంత సమయం అడిగారు. దాంతో, వీరిద్దరినీ ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అంటే.. ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఈ కేసులో ఈడీ విచారణ జరగబోతోంది.
హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేశారు. ఈ తీర్పు ఏవిధంగా రావచ్చనే అంశంపై బీఆర్‌ఎస్ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తుందా? లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ఆరో తేదీన ఏసీబీ.. ఏడో తేదీన ఈడీ ఇలా ఒకదాని తర్వాత మరో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కేటీఆర్ బృందం న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. విచారణలకు కేటీఆర్ హాజరవుతారా లేక సమయం కావాలని కోరతారా అనే అంశం న్యాయవాదుల బృందం నిర్ణయం ప్రకారం ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేస్తే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, ఆలోపే చట్టపరమైన చర్యల్లో భాగంగా ఏసీబీ అరెస్ట్ చేస్తే మాత్రం ఇబ్బందనే విషయంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్‌పై నమోదు చేసిన కేసులో సెక్షన్ 409 ప్రకారం నోటీసు లేకుండానే అరెస్టు చేయవచ్చని మాజీ పోలీసు అధికారులు అంటున్నారు.
Updated Date - Jan 04 , 2025 | 03:48 AM