Share News

‘ఉపాధి’కి పెరిగిన పని దినాలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:14 PM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం 2005లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతోంది.

‘ఉపాధి’కి పెరిగిన పని దినాలు

- 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనుల అంచనా

- వ్యవసాయ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట

- జిల్లాలో మొత్తం కార్డులు 1,23,035

చింతలమానేపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం 2005లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతోంది. రైతులు తమ చేన్లలోకి వెళ్లేందుకు మట్టి రోడ్ల నిర్మాణంతో పాటు రైతుల పొలాల్లో కుంటలు, గట్లు, తదితర వ్యవసాయ పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సైతం ఈ పథకం ద్వారా చేపడుతున్నారు. జాబ్‌ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి వంద రోజుల పని దినాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ ఏడాది 2025-26 ఆర్థిక సంవత్సరానికి అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనాకు మించి పనులు పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరానికి పని దినాల పెంపుతో కూలీలకు మరింత ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.

- 44.33 లక్షల పనిదినాలు లక్ష్యం..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 1,23,035 జాబ్‌కార్డులు ఉండగా, 2,43,969 మంది కూలీలున్నారు. ఇందులో యాక్టివ్‌ జాబ్‌ కార్డులు 91,721 ఉన్నాయి. 1,70,268 మంది కూలీలు యాక్టివ్‌గా పనులు చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 38,71,840 పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే లక్ష్యానికి మించి పనులు చేశారు. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఊరూరా గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపు చేపట్టారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 44,33,277 పనిదినాలను లక్ష్యంగా ఏర్పాటు చేసుకోగా అందుకు గానూ కూలీల చెల్తింపు కోసం రూ. 132.99కోట్లు వ్యయం చేయనున్నట్లు అంచనా రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా వ్యవసాయ సంబంధిత పనులు చేపట్టనున్నారు. కుంటల తవ్వకం, పంట చేన్లకు వెళ్లేందుకు మట్టి రోడ్లు వేయడం, గట్టలు పోయడం, కందకాల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, చేపల ఉపాధి పనులు ఉపయోగపడనున్నాయి. కూలీలందరి కీ పని కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, కూలీ చెల్లింపు అంచనా ఇలా..

మండలం పనిదినాల లక్ష్యం చెల్లింపులు(రూ. కోట్లలో)

చింతలమానేపల్లి 2,18,134 6.54

బెజ్జూరు 4,64,060 13.92

పెంచికలపేట 1,65,068 4.95

దహెగాం 3,81,624 11.44

కౌటాల 3,42,800 10.28

కాగజ్‌నగర్‌ 2,90,975 8.72

సిర్పూర్‌(టీ) 2,08,658 6.25

సిర్పూర్‌(యూ) 2,09,000 6.27

రెబ్బెన 3,41,384 10.24

లింగాపూర్‌ 1,65,220 4.95

ఆసిఫాబాద్‌ 3,31,600 9.95

కెరమెరి 4,24,150 12.74

వాంకిడి 2,80,453 8.41

జైనూరు 2,84,114 8.52

తిర్యాణి 3,25,917 9.77

==========================================

మొత్తం 44,33,277 132.99

===========================================

Updated Date - Mar 20 , 2025 | 11:14 PM