పశువుల పాకలు పూర్తయ్యేనా?
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:28 PM
పశు పోషకులు, కోళ్ల పెంపకందారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో వందశాతం రాయితీతో పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.

- జిల్లాకు 250 షెడ్లు మంజూరు
- ఇప్పటివరకు 40 శాతం మాత్రమే పూర్తి
- గడువులోగా పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు
వాంకిడి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పశు పోషకులు, కోళ్ల పెంపకందారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో వందశాతం రాయితీతో పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలోని రైతులు షెడ్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నా నిర్మాణపు పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. మంజూరైన వాటిలో సగం మాత్రమే నిర్మాణాలు పూర్తిగా చేపట్టగా మిగిలినవి ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిధుల విడుదలలో నిబంధనలు క్షేత్రస్థాయిలో నిర్మాణాల పురోగతికి ప్రధాన ప్రతి బంధకాలుగా మారుతున్నాయి. కూలీల వేతనం 1,081 రూపాయలు మినహా మిగిలిన నిధులన్నీ నిర్మాణం పూర్తయ్యకే అందిస్తుండటంతో అబ్ధిదారులు వీటి నిర్మాణాలపై ఆసక్తి చూపడంలేదు. ఈ నెలాఖరు ఆర్థిక సవత్సరం పూర్తవుతుండటంతో వందశాతం నిర్మాణాలు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రతీ మండలంలో షెడ్ల నిర్మాణాలు..
ప్రభుత్వం ఉపాధిహామీ పథకం, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో షెడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఈ మేరకు పశువుల షెడ్లు మంజూరుచేస్తూ నిధులను విడుదల చేసింది. కోళ్ల షెడ్లను సైతం ప్రతీ మండలంలో తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పశువుల షెడ్డుకు ఒక్కో దానికి రూ. 85 వేల రూపాయలను వందశాతం రాయితీతో రైతులకు అందిస్తున్నారు. కోళ్ల షెడ్లకు ఒక్కో దానికి రూ. 2.90 లక్షల వరకు నిధులను అందజేస్తున్నారు. దీనికి రైతులు స్థలం, పశువులు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత మండల పశువైద్యాధికారుల చేత ధ్రువీకరించాలి. ప్రభుత్వం వీటి నిర్మాణాలకు నిధులు వందశాతం ఇస్తున్నా ప్రజల్లో సరైన అవగాహన లేని కారణంగా రైతులు, మహిళలు ఆశించిన మేరకు ముందుకు రావడంలేదు.
250 షెడ్లు మంజూరు..
జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 250 షెడ్లు మంజూరయ్యాయి. ఇందులో 202 పశువుల షెడ్లు, 31 మేకలు, గొర్రెల షెడ్లు, 17 పౌలీ్ట్ర షెడ్‌లు మంజూరయ్యాయి. 202 పశువుల షెడ్లకు కోటి 87 లక్షల రూపాయలు, మేకలు, గొర్రెల షెడ్లకు 39 లక్షల రూపాయలు, పౌలీ్ట్ర షెడ్లకు 40 లక్షల రూపాయలను కేటాయించారు. ఇప్పటివరకు కేవలం 40 శాతం మాత్రమే పూర్తి కాగా మిగితా షెడ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న షెడ్లను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు నిర్మాణ దశలో ఉన్న షెడ్లను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిబంధనలు ఇవీ..
- షెడ్డు మంజూరుకు ఉపాధిహామి జాబ్‌కార్డు ఉండాలి. దీంతో పాటు అయిదేకరాల్లోపు భూమి, తప్పనిసరిగా మూడు పశువులు ఉండాలి. నిర్మాణానికి స్థలం ఉండాలి.
- గ్రామసభ తీర్మానం అవసరం
- నిర్మాణం పూర్తయిన తర్వాతే 85 వేల రూపాయలు అందిస్తారు.
నెలాఖరుకు పూర్తి చేసేందుకు చర్యలు..
శ్రావణ్, ఏపీవో - వాంకిడి
రైతులకు, పశుపోషకులకు పోత్సాహకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రత్యేక కార్యాచరణతో చేపడుతున్నాము. మార్చి 31 నాటికి అన్ని పనులూ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము. నిర్మాణ దశలో ఉన్న షెడ్లను వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాము. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే మంజూరుకోసం ప్రతిపాదనలు పంపిస్తాము. మహిళలు, రైతులు పశువుల షెడ్ల నిర్మాణాలను సద్వినియోగం చేసుకోవాలి.