Allu Arjun: ప్రతి వారం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:33 AM
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు పెద్ద ఊరట లభించింది.
అల్లు అర్జున్ బెయిల్ షరతుల్లో సడలింపులు
నాంపల్లి కోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో ఏ11గా ఉన్న అర్జున్‌కు ఈనెల 3వ తేదీన షరతులతో కూడిన సాధారణ బెయిల్ ఇవ్వగా నాంపల్లి కోర్టు వాటిలో కొన్నింటిని సడలించింది. ఈ షరతుల్లో కొన్నింటిని సడలించాలని శుక్రవారం అర్జున్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. శనివారం దీనిపై విచారణ జరిపిన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరయ్యేందుకు భద్రత పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్జున్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సినిమా షూటింగ్‌ల కోసం విదేశాలు వెళ్లాల్సి ఉన్నందున అనుమతించాలని కోరారు. ఈ అంశాల్లో పోలీసుల నుంచి బలమైన ప్రతివాదనలు లేకపోవడంతో ఇందుకు సంబంధించిన రెండు షరతులను న్యాయస్థానం సడలించింది. పోలీసులు పూర్తి స్థాయి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే వరకు నగరం విడిచి వెళ్లే ముందు చిక్కడపల్లి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని అర్జున్‌కు సూచించింది. విదేశాలు వెళ్లే ముందు తాను అక్కడ ఎక్కడ ఉంటున్నారో సహా పర్యటన పూర్తి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఆదేశించింది.