Share News

మిస్‌వరల్డ్‌ పోటీదారులకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:31 AM

బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్‌ వద్ద ఉన్న బుద్ధవనం సందర్శనకు వచ్చే మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

మిస్‌వరల్డ్‌ పోటీదారులకు ఏర్పాట్లు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇలాత్రిపాఠి

బుద్ధపూర్ణిమ రోజు బుద్ధవనం సందర్శనకు రాక

కలెక్టర్‌ ఇలాత్రిపాఠి

నల్లగొండ టౌన్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్‌ వద్ద ఉన్న బుద్ధవనం సందర్శనకు వచ్చే మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిస్‌ వరల్డ్‌ పోటీదారుల రాక సందర్భంగా ఏర్పాట్లపై తన ఛాంబర్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్‌, ఇతర అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు బుద్ధపూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్‌ వద్ద ఉన్న బుద్ధవనానికి వస్తున్నారని, ఆ రోజు సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు విజయ విహార్‌, బుద్ధవనంలో వారు గడిపే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే దారిలో చింతపల్లి వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుని బుద్ధవనానికి చేరుకుంటారని, అనంతరం బుద్ధవనంలో జాతక వనాన్ని పరిశీలిస్తారని, అనంతరం బుద్ధుని ధ్యాన మందిరం వద్ద ధ్యానంలో పాల్గొంటారని తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రకారం తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ అధికారులకు, బందోబస్తు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు సూచనలు చేశారు. పాసులు ఉన్న వారిని తప్ప ఇతరులు ఎవరినీ బుద్ధ వనంలోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. విజయ్‌ విహార్‌లో వారు విశ్రాంతి తీసుకునేందుకు గదులు సిద్ధం చేయాలని, ఒకవేళ నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను చూసేందుకు వస్తే అక్కడ ఏర్పాట్లు చేయాలన్నారు. మునిసిపల్‌ సిబ్బంది తాగునీరు, దారి పొడవునా పరిశుభ్రం చేయాలన్నారు. ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనేవారు తిరిగే అన్ని ప్రదేశాలను ముందే తిరిగి పరిశీలించాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, మెడికల్‌ టీం, ఫైర్‌ టీములు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆహారం, తాగునీరుతో పాటు, అన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి ఒక్కో ప్రదేశం వద్ద ఒక సీఐ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, బుద్ధవనం ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ సూదన్‌రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌, మిర్యాలగూడ మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు, జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలి

లబ్ధిదారులకు పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకించి ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి ఇదివరకే నిర్థేశించినట్లు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

పౌష్టికాహారంపై మరోసారి సదస్సు

దేవరకొండ డివిజన్‌లో పౌష్టికాహార ప్రాముఖ్యం పై మరోసారి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులను భాగస్వామ్యం చేస్తామని ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఈ నెల 8 నుంచి పది రోజులపాటు పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, గర్భిణులు, పిల్లలు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఆరోగ్య జాగ్రత్తలపై గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు తెలియజేసే విధంగా మరోసారి అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. టీఎస్‌ ఐ-పాస్‌ కింద వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో వై. అశోక్‌రెడ్డి, స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:31 AM