Share News

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ను మించిన దోపిడీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:20 AM

భూముల అమ్మకాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బీఆర్‌ఎ్‌సను మించిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ను మించిన దోపిడీ

  • వాళ్లు పదేళ్లలో రూ.20 వేల కోట్ల విలువైన భూములమ్మారు

  • వీళ్లు ఏడాదిలోనే రూ.50 వేల కోట్ల భూములు అమ్మాలని చూస్తున్నారు

  • భవిష్యత్తు తరాలకు గజం భూమైనా మిగల్చరా?

  • విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి

  • అంబేద్కర్‌ను, జగ్జీవన్‌రామ్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది

  • కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): భూముల అమ్మకాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బీఆర్‌ఎ్‌సను మించిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ రూ.20 వేల కోట్ల విలువైన భూములను విక్రయించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.50 వేల కోట్ల విలువైన భూములు విక్రయించి, పెద్దమొత్తంలో దండుకునేందుకు సిద్ధమైందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు భావితరాలకు గజం జాగా కూడా లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బండి సంజయ్‌ నివాళులర్పించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందన్నారు.


ప్రభుత్వ వైఖరిని విమర్శించిన స్కాలర్‌ రోహిత్‌పై దాడి చేయడమే కాకుండా ఆయన్ను జైలుకు పంపించారన్నారు. రోహిత్‌ మీద అక్రమ ఆయుధాల కేసు పెట్టి ఆయన జీవితాన్ని నాశనం చేస్తారా? అని మండిపడ్డారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అట్టడుగువర్గాల ఆణిముత్యం జగ్జీవన్‌రాం అని సంజయ్‌ కొనియాడారు. ‘కాంగ్రెస్‌ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ. అంబేద్కర్‌ను పార్లమెంటులో అవమానించి మంత్రి పదవికి రాజీనామా చేయించింది. డుప్లికేట్‌ గాంధీలకు భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్‌ పాలకులు అంబేద్కర్‌ను మాత్రం విస్మరించారు. ప్రధాని అయ్యే అర్హత ఉన్న నేత జగ్జీవన్‌రాం. కానీ, దళితుడికి అవకాశం ఇవ్వవద్దన్న కుట్రతో నాడు ఇందిర ఎమర్జెన్సీ విధించింది’ అని సంజయ్‌ ఆరోపించారు.

Updated Date - Apr 06 , 2025 | 05:20 AM