Ponnam Prabhakar: కులాల వారీ లెక్కలన్నీ తప్పే..!
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:57 AM
ప్రస్తుతం కులాల వారీగా బయటకు వస్తున్న లెక్కలన్నీ తప్పేనని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

ప్రతిపక్షాలు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నాయి.. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే: పొన్నం
బీఆర్‌ఎ్‌సకు బీసీల పట్లచిత్తశుద్ధి లేదు: మహేశ్ గౌడ్
మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్‌లకు బీసీ సంఘాల నేతల సన్మానం
హైదరాబాద్/కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం కులాల వారీగా బయటకు వస్తున్న లెక్కలన్నీ తప్పేనని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం మంత్రి పొన్నం, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను సన్మానించాయి.. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి ఆన్‌లైన్ సర్వే చేపడతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఆన్‌లైన్ ద్వారా కూడా సర్వే వివరాలు సేకరిస్తామని చెప్పారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తమిళనాడు తరహాలో అన్ని పార్టీలు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం ఏకం కావాలని కోరారు. బీఆర్‌ఎ్‌సకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టదలిచిన బీసీల ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు: పొన్నం
బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడం, కులగణన సర్వే బీజేపీకి ఇష్టం లేదని.. అందుకే విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ వ్యాపారుల పార్టీ అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి చేతనైతే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మౌనంగా ఉండాలన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత సామాజిక న్యాయంపై మాట్లాడే ముందు బీఆర్‌ఎ్‌సలో మూడు ముఖ్య పదవులైన పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభాపక్ష నేత.. ఇవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు పెడతామని.. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ, బీఆర్‌ఎస్ మద్దతు పలకాలన్నారు.