Share News

Bhadradri: రమణీయం.. రాములోరి కల్యాణం

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:06 AM

భద్రాద్రి రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా.. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు.

Bhadradri: రమణీయం.. రాములోరి కల్యాణం

  • భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

  • ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

  • నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్‌

భద్రాచలం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా.. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం చేశారు. తదుపరి ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. ఉదయం 9.45 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తరామదాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజేశారు.

4.jpg


తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి తొలిసారి సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత ఉదయం 11.33 గంటలకు రామాలయానికి చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. పూజల తర్వాత సీఎం దంపతులు 11.45 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ జీలకర్రబెల్లం సమయంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రామయ్యకు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నం సమీపించగానే వేద పండితులు ఉత్సవమూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం మూడు సూత్రాలతో కన్నుల పండువగా మాంగళ్య ధారణ నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి తిలకించారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. టీటీడీ తరఫున చైర్మన్‌ బీఆర్‌ నాయుడు శ్రీసీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు.


భారీగా తరలివచ్చిన భక్తజనం

సీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రతను తాళలేక అవస్థలు పడ్డారు. కల్యాణ మండపానికి చేరుకునే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో భక్తులు ఇక్కట్ల పాలయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే సమయంలో గంటపాటు సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేశారు. ఒక మహిళా ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించారు. నిఘా వర్గాల సిబ్బందిని సైతం వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడం గమనార్హం. ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులు సీఎం రాకను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వారినీ ఆ ఎస్సై వెళ్లిపోవాలని హెచ్చరించారు. తమకు పాస్‌లు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు. చివరిలో కల్యాణ తలంబ్రాల కోసం భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.


నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం

కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు. సోమవారం నిర్వహించే ఈ పట్టాభిషేకానికి భద్రాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీరామ మహాపట్టాభిషేకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:07 AM