Cabinet Expansion: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ కుంపటి!
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:12 AM
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ కుంపటి రాజుకుంటోంది! రాష్ట్ర క్యాబినెట్‌లో అరడజను ఖాళీలుండగా.. ఆశావహులు డజన్లలో ఉండడంతో.. రాజకీయవాతావరణం హీటెక్కిపోతోంది.

అరడజను ఖాళీలకు డజన్లకొద్దీ ఆశావహులు
హామీలు.. సామాజిక, ప్రాంతీయ న్యాయం కోసం అధిష్ఠానంపై ఒత్తిళ్లు
విస్తరణ వాయిదాతో నాయకుల్లో అసంతృప్తి
సామాజిక న్యాయం అడ్డొస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా: మల్‌రెడ్డి
జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ కుంపటి రాజుకుంటోంది! రాష్ట్ర క్యాబినెట్‌లో అరడజను ఖాళీలుండగా.. ఆశావహులు డజన్లలో ఉండడంతో.. రాజకీయవాతావరణం హీటెక్కిపోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతలకు ఇచ్చిన ముందస్తు హామీలు, సామాజిక, ప్రాంతీయ న్యాయం కోసం వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్ఠానం వాయిదా మంత్రాన్ని పాటిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అధిష్ఠానానికి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ శిరోభారాన్ని తెచ్చిపెడుతోందనే వాదనలున్నాయి. ఈ ఆలస్యంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు అదేబాట పట్టే ప్రమాదం ఉండడంతో.. విస్తరణకు మరోమారు బ్రేకులు పడవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
వాయిదాల పర్వం..!
రాష్ట్ర క్యాబినెట్‌లో మరో ఆరుగురికి అవకాశం ఉంటుంది. పోటీ తీవ్రంగా ఉండడంతో విస్తరణలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు అధిష్ఠానం పెద్దలతో భేటీ అవుతున్నారు. అయితే.. ఆ సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరక.. ప్రతీసారి అధిష్ఠానం నిర్ణయం వాయిదా పడుతోంది. తాజాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తమ అభిప్రాయాలు చెప్పివచ్చారు. తాజా భేటీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, బీసీల నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్, ముస్లిం వర్గం నుంచి ఆమెర్ అలీఖాన్ తదితర పేర్లపై పరిశీలన జరిగింది. ఉగాదికి లేదా ఏప్రిల్ 2, 3 తేదీల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. అంతలోనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం వద్ద క్యూకట్టారు. మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేశారు. లంబాడా వర్గం ఎమ్మెల్యేలు కూడా సీఎం రెవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతోపాటు.. అధిష్ఠానాన్ని కలిసి.. తమ వర్గానికి అవకాశమివ్వాలని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు.. హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని మాజీ మంత్రి జానారెడ్డి ఏకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. మరికొందరు నేతల మద్దతును ఈ జిల్లాలకు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి కూడగట్టుకున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటివ్వాలని అధిష్ఠానాన్ని కూడా కోరారు. మల్‌రెడ్డి రంగారెడ్డి ఏకంగా.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న వేడి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రె్‌సలో రాజకీయ వేడి రాజుకుంది. ఆయన ఏకంగా మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ కురు వృద్ధుడు జానారెడ్డిని టార్గెట్‌గా చేసుకున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని, ఆయన రాసిన లేఖ వల్లే ప్రక్రియ ఆలస్యమైందని విమర్శించారు. అధిష్ఠానం తనకు మంత్రి పదవినిస్తానంటే.. కొందరికి చెమటలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. అంతలోనే.. సోమవారం రోజు ప్రేమ్‌సాగర్‌రావు తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే ఒకే కుటుంబంలో మూడు పదవులున్నాయని, నాలుగో పదవి కూడా ఇస్తారా? అని గడ్డం వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనికి అదేస్థాయిలో గడ్డం వెంకటస్వామి ప్రతిస్పందిచారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి స్వతహాగా రాలేదని, రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చానన్నారు. అందరికీ మంత్రి పదవిపై ఆశ ఉంటుందని, ఆ దిశలో ప్రేమ్ సాగర్‌రావు మాట్లాడి ఉంటారన్నారు. అయితే.. ఆశావహుల అసంతృప్తులు ఇంతటితో ఆగుతాయా? లేదా.. కొనసాగుతాయా? అనేదానిపై మంగళవారం జరగనున్న సీఎల్పీ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మల్‌రెడ్డిని తీసుకోవాలి: చామల
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్ర జనాభాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే సగం మంది ఉంటారని, ఆ రెండు జిల్లాల నుంచి శాసనసభకు ఎన్నికైన ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఇబ్రహీంపట్నం కార్యకర్తల వాణిని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే
నా గొంతు కోసేందుకు ఓ కుటుంబం
యత్నం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు
రేవంత్ ఆహ్వానిస్తేనే వచ్చానన్న వివేక్
మంచిర్యాల, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తనకు మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పదేళ్లపాటు కాంగ్రెస్ బలోపేతానికి తాను కృషి చేశానని, ఈ క్రమంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తూ.. తన గొంతు కోసేందుకు యత్నిస్తున్నారని చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్‌లను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే ఒకే కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయని.. నాలుగో పదవి కూడా ఇస్తారా..? అని ప్రశ్నించారు. నోట్లో నాలుక లేని గిరిజనులు, ఉమ్మడి జిల్లాలోని అమాయక ప్రజల తరఫున తాను గొంతు ఎత్తుతున్నానని.. తనకు అన్యాయం చేస్తే ఆయా వర్గాల ప్రజలకు అన్యాయం చేసినట్లే అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News